test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రేక్షకుడిని పట్టించుకుంటేనే పరిశ్రమకు జీవం!

18 మే, 2026

movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 06:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

టాలీవుడ్‌లో సమస్యలు వచ్చినప్పుడల్లా కమిటీలు వేయటం, ఆపై కాలయాపన చేయడం మామూలుగా ఉంది. తెలుగు సినిమా మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినప్పటి నుంచీ అనేక సమస్యలు చిత్రపరిశ్రమలో కొనసాగుతూనే ఉన్నాయి. నటీనటుల రెమ్యూనరేషన్ నుంచి, భారీ బడ్జెట్ మూవీలు మొదలయ్యాక ఓటీటీ మార్కెట్లు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల తర్వాత సినిమా పైరసీ భూతం... ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. కొద్దేళ్లుగా ముందుకొచ్చిన సమస్య సినిమా వినోదం సామాన్యులకు ఖరీదుగా మారిపోవడం. దీంతో చాలా వేగంగా థియేటర్లకు వచ్చే సగటు ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. చిన్న సినిమాలు తీసే నిర్మాతలు థియేటర్ల కోసం వెతుకులాడుతూ ఎదురు డబ్బులిచ్చి సినిమాలు ఆడించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద సినిమా నిర్మాతలు విడుదలైన పదిరోజులపాటు ధరలను అమాంతం పెంచేసి ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న సినిమా నిర్మాతలు మరింత చితికిపోతుండగా, పెద్ద నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. తమకూ అన్యాయం జరుగుతోందంటూ నిర్మాతలు కూడా ఆందోళన బాట పట్టారు. ఈ పరిణామాల పట్ల రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి.

 

ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్లలో రెంట్ పద్ధతికి బదులు పర్సంటేజీ ఇవ్వాలని పట్టుబడుతుండగా, నిర్మాతలేమో ఇప్పటికిప్పుడు అంటే కష్టం, తర్వాత చూసుకుందాం అనే రీతిలో మాట్లాడుతున్నారు. సమస్యలు–పరిష్కార పద్ధతులను పక్కన పెట్టేసి పరస్పర దూషణలకు పాల్పడటం, వ్యక్తిగత విమర్శలకు దిగటంతో సమస్య మరింత జఠిలమైంది. వాస్తవంగా సినిమా తీసిన నిర్మాత ఏదైనా థియేటర్‌లో ప్రదర్శనకు ఇవ్వాలంటే ఎగ్జిబిటర్‌కు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది. అయితే సింగిల్ స్క్రీన్లలో మూవీ వేసినందుకు అద్దె చెల్లిస్తుండగా, మల్టీప్లెక్స్‌లలో మాత్రం వచ్చిన డబ్బుల్లో పర్సంటేజీ చెల్లిస్తున్నారు. ఇలా వేర్వేరుగా కాకుండా అందరికీ ఒకేలా పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు తాజాగా కోరారు. ఎగ్జిబిటర్లకే కాదు, తమకూ సమస్యలున్నాయంటూ కొందరు నిర్మాతలు కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ “మల్టీప్లెక్స్‌లు ఎక్కువగా ఉన్న ఆసియన్ సునీల్‌కు సింగిల్ స్క్రీన్ బాధలేం తెలుస్తాయిలే” అన్నట్లుగా వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా సునీల్ “విగ్ పెట్టుకుంటాడు” అంటూ నాగవంశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా పరస్పర ఆరోపణలు శృతిమించి పక్కదారి పట్టాయి. మరోవైపు ‘పెద్ది’ రిలీజ్ టైంలో కావాలనే ఎగ్జిబిటర్ శిరీష్ ఇలా చేస్తున్నారని నిర్మాతలు ఆరోపించారు. స్పందించిన శిరీష్ తాము ఎప్పటినుంచో పర్సంటేజీ గురించి అడుగుతున్నామని, ‘పెద్ది’ని టార్గెట్ చేయట్లేదని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి 15 మందితో ఓ ప్రత్యేక కమిటీని ప్రతిపాదించారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు, వర్చువల్ ప్రింట్ ఫీజు, టికెట్ లాభాల వాటాలపై లోతుగా అధ్యయనం చేసి, రాబోయే రెండు నెలల్లో తుది నివేదికను ఛాంబర్‌కు సమర్పించాలని తీర్మానించారు. అప్పటివరకు థియేటర్ల ప్రదర్శనలు, కొత్త సినిమాల విడుదలలు యథావిధిగా కొనసాగుతాయి. మూడు విభాగాల ప్రతినిధులు దీనికి అంగీకరించారు.

​వినోదం అందుబాటులో ఉండాలి!
ఇండస్ట్రీలో రెండు–మూడేళ్లకు ఒక భారీ బడ్జెట్ సినిమా తీసే నిర్మాతలు మిగతా సినిమా ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అత్యధిక రెమ్యూనరేషన్లు ఇస్తుండటంతో చిన్న బడ్జెట్‌తో సినిమాలు తీసే నిర్మాతలు సగం పూర్తయ్యాక బడ్జెట్ తడిచిమోపెడు అవుతుండటంతో మధ్యలోనే ఆగిపోతున్నాయి. టాలీవుడ్‌కు కేంద్రమైన హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో తీసే సినిమాలకు కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఆంధ్రాలో షూటింగ్ స్పాట్స్ ఉన్నా స్టూడియోలు లేవు. టెక్నీషియన్లు తక్కువ. యూనిట్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే రవాణా ఖర్చులతో పాటు మౌలిక వసతులకు భారీగానే వ్యయం అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలే సినిమా రంగానికి ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తున్నాయి. గత 12 ఏళ్ల కాలంలో ఒక్క సినిమాకు కూడా ఆంధ్రాలో సబ్సిడీ వచ్చిన దాఖలాలు లేవు. ఆంధ్రాలో షూటింగులు మొదలై వివిధ దశల్లో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. పరిశ్రమ ముందుకెళ్లాలంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ ఐక్యంగా పనిచేయాలి. హీరోల రెమ్యూనరేషన్, ఓటీటీ బిజినెస్ వంటి వాటిపై నిర్మాతలు దృష్టి పెట్టాలి. టికెట్ రేట్లు సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలి. స్టార్ హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసేలా ఒప్పించాలి. బడ్జెట్ నియంత్రణలో ఉంచాలి. అన్నింటి మధ్యా సామాన్య ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తేనే- సినీరంగం నిలబడుతుంది. అప్పుడే థియేటర్లు బతుకుతాయి, తద్వారా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కూడా బతుకుతారు.

 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్