'దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక భూమిక పోషిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ విద్యలో నిరంతరం మార్పులు చేస్తూ అధునాతన కోర్సులను సైతం ప్రవేశపెడుతోంది. విద్యార్థులకు లెర్నింగ్ ఔట్‌కమ్స్ మెరుగుపర్చటం ద్వారా నైపుణ్యాభివృద్ధి సాధ్యమవుతుంది. సమీకృత, మల్టీడిసిప్లినరీ కోర్సులతో ఇది సాధ్యమవుతోంది. ఇప్పటికే ఏఐసీటీఈ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం మాతృభాషలోనూ సాంకేతిక విద్యను అందిస్తోన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో అత్యధికంగా ఏపీ విద్యార్థులే ఉండటం తెలుగు వారి విద్యా ప్రతిభకు నిదర్శనం. కంప్యూటర్స్ సైన్స్ ఒక్కటే సాంకేతిక విద్య కాదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. విద్యార్థులకు ప్రపంచ స్థాయి కంపెనీల్లో సర్టిఫికేషన్లు అందించడం ద్వారా నైపుణ్య సామర్థ్యాలను పెంపొందించే అవకాశం ఉంది` అని ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోని శ్రీ పోలాకు అక్కయ్య మెమోరియల్ (ఎస్‌పిఎఎం) పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్ కూనపరెడ్డి సత్యనారాయణ చెప్పారు. ఆయన ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...
పదో తరగతి తర్వాత మేటి సాంకేతిక విద్యతోపాటు, చక్కని ఉపాధి ఆశించేవారు ఐటిఐ, డిప్లొమా కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. వీటిని తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఐటిఐల్లో మార్కుల ప్రతిభ ఆధారంగా, సాంకేతిక విద్య శిక్షణ సంస్థలు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2026) ద్వారా అభ్యర్థులకు వచ్చిన ర్యాంకు ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది.
సాంకేతిక నైపుణ్యం తప్పనిసరి…
మన సాంకేతిక విద్యారంగం ప్రపంచ శ్రేణితో పోటీ పడాలంటే మనలో నిపుణత, నాణ్యత, సాంకేతికత వైపుగా మరింత వేగంగా కదలాలి. ఈమధ్యే విడుదలైన నాల్‌స్కేప్ సంస్థ నివేదిక 2028 నాటికి తయారీ రంగ పరిశ్రమలో సాంకేతిక నైపుణ్య లేమి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 24 లక్షల ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతాయి. దీన్ని సరిదిద్దకపోతే 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం తప్పదని హెచ్చరించింది. తయారీ రంగంలో అత్యధిక పరిశ్రమలు ఉద్యోగార్థుల చదువుతోపాటు వారికున్న భిన్న రకాల నైపుణ్యాలేమిటని చూస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ ఆధారిత సామర్థ్యాలు, సీఎన్‌సీసీ ఆపరేషన్స్, ఆటోమేషన్ సిస్టమ్స్, ఇంటెగ్రేషన్, డేటా ఎనలిటిక్స్ డిజిటల్ ట్విన్ టెక్నాలజీస్, హ్యూమన్-మెషీన్ ఇంటర్‌ఫేస్ డిజైన్ వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి అపారమైన డిమాండ్ ఏర్పడబోతోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి కోర్సులు నేర్చుకున్న వారి అవసరం ఎంతైనా ఉంది. సిబ్బందికుండే నైపుణ్యాలే విజయానికి బాటలు వేస్తాయి గనుక ఎంపికలో వాటినే ప్రధానంగా చూస్తామని 94 శాతం సంస్థలంటున్నాయి. ప్రపంచ స్థాయిలో పోటీపడగల వారికే ఏ పరిశ్రమల్లోనైనా ఉద్యోగాలు భద్రంగా ఉండాయనేది తెలిసిందే. భిన్నరంగాల్లో మెరుపు వేగంతో దూసుకొస్తున్న ఏఐకి సంబంధించిన బహుముఖ నైపుణ్యాలను ఒడిసిపట్టుకోవటంలో వెనకబడితే వీరందరికీ మెరుగైన ఉద్యోగాల కల్పన అసాధ్యమవుతుంది. ఈ సంపదలో మన వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండాలంటే మెరికల్లాంటి నిపుణులు తయారు కావాలి. సాంకేతిక విద్యతోనే నిరుపేద గ్రామీణ విద్యార్థులు ఇలాంటి ఉపాధి అవకాశాలను అందుకోగలరు.
నేర్చుకునేందుకు విస్తృత అవకాశాలు
ప్రపంచమే డిజిటల్ యుగంగా మారిన క్రమంలో సాంకేతిక విద్య, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవటం ఎంతో అవసరం. కృత్రిమమేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), యాంతిక భాష (మెషిన్ లాంగ్వేజ్ (ఎంఎల్) వంటివి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ ఉన్న కోర్సులు. అన్ని రంగాల్లోకి కృత్రిమమేథతో చాట్‌జీపీటీ వంటివి నైపుణ్యాలు వస్తుండటంతో ప్రతిఒక్కరూ ఏ సమాచారాన్నైనా ఆగమేఘాలపై క్షణాల్లో పొందే అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఉపాధి కల్పనకు అవకాశం ఉంది. ఈ క్రమంలో కోర్సుల ఎంపికతోపాటుగా సాంకేతిక నైపుణ్యత పెంపొందించుకోవటం ప్రతిఒక్కరికీ అత్యావశ్యకం. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు.. కొన్ని వారాల్లోనే మేటి నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ఇందుకు డబ్బులతో పని లేదు. సమయం వెచ్చించి, ఆసక్తి చూపిస్తే చాలు. ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. విద్యార్హతలూ, వయసుతో పనిలేదు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉపాధ్యాయులు, వృత్తి నిపుణులు.. ఇలా ఎవరైనా చేరొచ్చు. నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ, యూట్యూబ్‌ల్లోనూ ఉచితంగా అనేక ఉచిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీలు, ఐఐఎంలు, పేరున్న విద్యా సంస్థల బోధకులతో ఈ కోర్సులు రూపొందాయి. ‘స్వయం’ వేదికగా వీటిని అందిస్తున్నారు. సమగ్రంగా వీడియో పాఠాల ద్వారా నేర్చుకోవచ్చు. కోర్సులు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇంజినీరింగ్, డిజైన్, హెల్త్‌సైన్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ ఇలా పలు విభాగాల్లో వీటిని రూపొందించారు. ఎవరికివారు ఆసక్తి, అభిరుచి మేరకు సరిపోయేవి ఎంచుకోవచ్చు. విద్యార్థులైతే వీటి ద్వారా క్రెడిట్లూ పొందొచ్చు. నేర్చుకున్న కోర్సులో ప్రావీణ్యానికి సంబంధించి చివరలో పరీక్ష నిర్వహిస్తారు. దీన్ని రాసి, సర్టిఫికెట్ కూడా పొందటానికి అవకాశాలు కూడా ఉన్నాయి.
ఐటిఐలతోనూ అవకాశాలు అపారం
డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డిజిటి) నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రయివేటు పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ)లు కూడా అనేక ఉపాధి కోర్సులను అందిస్తున్నాయి. ఇవి పూర్తిచేసిన వారికి కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తారంగానే ఉన్నాయి. ఇవేకాకుండా స్వయంగా సొంత యూనిట్లు ఏర్పాట్లు చేసుకుని ఉపాధి పొందటానికి అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 800కు పైగా విద్యా సంస్థలు సుమారు 50 ట్రేడుల్లో తర్ఫీదు అందిస్తున్నాయి. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన వారు అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. విదేశాల్లోనూ రాణించొచ్చు. ఎందరికో ఉపాధి కల్పించే స్థాయినీ అందుకోవచ్చు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ ఐటీఐలు ఆధునిక శిక్షణా కేంద్రాలు (అడ్వాన్స్డ్ టైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా విస్తరిస్తున్నాయి. వీటిలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలను అందుకుంటున్నారు. తక్కువ వ్యవధిలోనే ఏదైనా అంశంలో నైపుణ్యం పెంపొందించుకుని, వెంటనే అందులో ఉపాధి పొందడానికి ఐటీఐ దారిచూపుతుంది. ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ఉపాధికి ఎలాంటి ఢోకా లేదు. మనదేశంలో మేకిన్ ఇండియా వంటి ప్రాజెక్టుల్లోనూ, స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఏర్పాటుతో ఐటీఐ ట్రేడుల్లో పట్టున్న వారికి గిరాకీ పెరుగుతోంది.
కోర్సులు ఇలా..
ఐటీఐల్లో పదోతరగతి అర్హతతో ఏడాది, రెండేళ్ల వ్యవధితో పలు ఇంజినీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడుల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు 50 స్పెషలైజేషన్లు కొనసాగుతున్నాయి. పారిశ్రామిక, ఆధునిక అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నీషియన్ లాంటి కోర్సుల్లోనూ కొన్ని చోట్ల శిక్షణ అందిస్తున్నారు. ఏపీలో 519, తెలంగాణలో 320 ఏటీసీ, ఐటీఐలు ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో విడిగా బాలికలు, బాలురు, మైనారిటీల కోసమూ కొన్ని ఉన్నాయి. ప్రవేశానికి ఎలాంటి పరీక్షా రాయనవసరం లేదు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్, పాయింట్లు, మార్కులతో సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ ఐటీఐల్లో దాదాపు ఉచితంగానే చదువుకోవచ్చు. ప్రయివేటు సంస్థల్లో ట్రేడు బట్టి కొంతమేరకు ఫీజు చెల్లించాలి
శిక్షణ పొందే ట్రేడులివే…
రెండేళ్ల వ్యవధితో: అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), డ్రాప్ట్క్స్‌మన్ (సివిల్, మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఇన్‌స్ట్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్), మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), మెరైన్ ఫిట్టర్, మెకానిక్ (మోటార్ వెహికల్, రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), మెకానిక్ మెషీన్ టూల్ మెయింటెనన్స్, పెయింటర్ జనరల్, టర్నర్, వెసెల్ నేవిగేటర్, వైర్‌మెన్.
ఏడాది వ్యవధి కోర్సులివే : కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, ఫౌండ్రీమెన్, మాసన్ (బిల్డింగ్ కనస్ట్రక్టర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ప్లంబర్, వెల్డర్, సెక్రటేరియల్ ప్రాక్టీస్ (ఇంగ్లీష్), సూయింగ్ టెక్నాలజీ, షీట్ మెటల్ వర్కర్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్), మెకానిక్ (డీజిల్, ఆటో బాడీ పెయింటింగ్, ఆటో బాడీ రిపేర్) ఇలా పలు ట్రేడులు వివిధ ఐటీఐల్లో అందుబాటులో ఉన్నాయి.
డిప్లమో కోర్సుల్లోనూ చేరొచ్చు
ఐటీఐ తర్వాత ఉన్నత నైపుణ్యం ఆశించేవాళ్లు డిప్లొమా కోర్సుల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. కొన్ని బ్రాంచీల్లో లేటరల్ ఎంట్రీతో నేరుగా ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంది. డిప్లొమా అనంతరం ఆసక్తి ఉంటే లేటరల్ ఎంట్రీ ద్వారా ఈఎపి సెట్ ద్వారా నేరుగా రెండో సంవత్సరం బీటెక్, బిఇ కోర్సుల్లో ప్రవేశం పొందే వీలుంది. నాన్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో ఐటీఐ ట్రేడ్‌లు పూర్తిచేసుకున్నవారు డిగ్రీ (బీఏ) ఆ తర్వాత పీజీ (ఎంఏ) కోర్సులు చదువుకోవచ్చు. ఐటీఐల్లో కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌ఎస్‌టిఐ)ల్లో శిక్షణ పొంది, ఇన్‌స్ట్రక్టర్లుగా రాణించే అవకాశం ఉంది. ట్రేడుల్లో మరింత ప్రావీణ్యానికి షార్ట్ టర్మ్ విధానంలో అడ్వాన్స్‌డ్ ఒకేషనల్ ట్రైనింగ్ కోర్సులూ ఉన్నాయి.
ఉపాధి అవకాశాలు ఇలా…
ఐటిఐ పూర్తిచేసిన రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలతోపాటుగా కేంద్రప్రభుత్వ సంస్థల్లోనూ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకుంటే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రఖ్యాత స్టీల్‌ప్లాంట్లు, నేవల్ డాక్‌యార్డులు, నౌకాయాన సంస్థలు, పోర్టులు, షిప్పులు, ప్రజా రవాణా సంస్థలు, యంత్రాలతో నడిచే అన్ని రకాల పరిశ్రమల్లోనూ ఐటీఐ చదివినవారికి ఉద్యోగాలున్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందటానికి కూడా అర్హులే. సాంకేతిక (టెక్నికల్) పోస్టుల్లో సింహభాగం సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చదువుకున్నవారితోనే భర్తీ చేస్తున్నారు. భారతీయ రైల్వేల్లోని వేల సంఖ్యలో ఉండే అసిస్టెంట్ లోకో పైలట్ (అసిస్టెంట్ డ్రైవర్), టెక్నీషియన్ పోస్టులకు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసుకున్నవారు అర్హులు. రాష్ట్ర స్థాయిలో ఎలక్ట్రికల్ లేదా వైర్‌మెన్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసుకున్నవారు జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్వేయింగ్ ఒక సబ్జెక్టుగా డ్రాఫ్ట్స్‌్‌మెన్ (సివిల్) రెండేళ్ల కోర్సు పూర్తిచేసుకున్నవారు డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు సిద్ధం కావచ్చు. ఆర్మీలో సోల్జర్ ట్రేడ్స్‌మెన్ విభాగంలోని కొన్ని పోస్టులకు ఐటీఐ అర్హత తప్పనిసరిగా ఉంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బి), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌ఫిఎఫ్), సెంట్రల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)…తదితర సెంట్రల్ ఆర్మ్‌డ్ విభాగాల్లో ఐటీఐ చదివినవారికి అవకాశాలు లభిస్తున్నాయి. నైపుణ్యం ఉన్న ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్; ఏసీ, రెఫ్రిజిరేటర్ మెకానిక్‌లకు పట్టణాలు, నగరాలతోపాటు పల్లెల్లోనూ డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే ఐటిఐలోని వివిధ టేడుల్లో పట్టు ఉంటే ఉపాధికి ఎలాంటి ఢోకా లేదు. బిగింపు, మరమ్మతు సేవల నిమిత్తం పలు ఆన్‌లైన్ సంస్థలూ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. అలాంటివాటిలో పేరు నమోదు చేసుకుంటే చేతినిండా పని దొరుకుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆయా రాష్ట్రాల ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిటిటెడ్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు విదేశీ ఉద్యోగాలకు దారి చూపుతున్నాయి. ఇవి శిక్షణ అందించి, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్నాయి. వీటిని పొందినవారు కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ ద్వారా విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించొచ్చు. ఫిట్టర్ ట్రేడ్ పూర్తిచేసుకున్నవారికి చమురు ఉత్పత్తి చేస్తోన్న దేశాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు.. సింగపూర్, మలేసియాలతోపాటు పలు దేశాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. షీట్‌మెటల్, వెల్డింగ్, టర్నర్ వంటి పోస్టులు రష్యాలోనూ దొరుకుతున్నాయి. స్కిల్స్ ఉన్న వారికి ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలు, బిహెచ్‌ఇఎల్, ఇస్రోతోపాటుగా ప్రయివేటు సంస్థలైనా టాటా, మహింద్రా, అశోక్ లైలాండ్, బజాజ్, హోండాతోపాటుగా జపాన్, జర్మనీ, కెనడా వంటి దేశాల్లోని ప్రముఖ సంస్థల పరిశ్రమల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి` అని సత్యనారాయణ వివరించారు.









కామెంట్‌లు (0)