test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్ రద్దు - విద్యార్థుల ఆత్మహత్యలు ..!

16 మే, 2026

నీట్ రద్దు - విద్యార్థుల ఆత్మహత్యలు ..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 16, 2026, 03:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

రాజస్థాన్ : నీట్-యూజీ ఎగ్జామ్ అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగా విద్యార్థుల మరణాల విషాదాలు చోటుచేసుకోవడంతో రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు గోవాలో కూడా మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఎగ్జామ్ షెడ్యూల్‌పై స్పష్టత లేకపోవడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది.


నీట్‌-యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీక్‌ వల్ల పరీక్ష రద్దవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోనూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ పరీక్షలో 650 మార్కులు వస్తాయని తన కుమారుడు చెప్పాడంటూ అతడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఝున్‌ఝున్‌ జిల్లాకు చెందిన ప్రదీప్‌ మహిచ్.. తన ఇద్దరు సోదరులతో కలిసి సికార్‌లో నివసిస్తున్నాడు. అక్కడే నీట్‌ పరీక్ష కోసం ఒక ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకున్నాడు. మే 3న జరిగిన నీట్‌- యూజీ పరీక్ష రాశాడు. అయితే, శుక్రవారం మధ్యాహ్నం అతడు తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన అతడి సోదరి వెంటనే స్థానికుల సహాయంతో సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నీట్‌ పరీక్షను బాగా రాసినట్లు తన కుమారుడు చెప్పాడని, 650 మార్కులు వస్తాయన్నాడని ప్రదీప్‌ తండ్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ సీటు ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నాడంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రద్దవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నీట్‌ పరీక్ష రద్దు నేపథ్యంలో ఢిల్లీ, యుపి ల్లోనూ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి చెందిన హృతిక్ మిశ్రా (21)..నీట్ రద్దు కావడంతో తన కళ్లముందే డాక్టర్ కల చెదిరిపోతుందన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి హృతిక్ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం .... వైద్య విద్యార్థి కావాలనే లక్ష్యంతో హృతిక్ గత మూడేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. ఈ ఏడాది ఎగ్జామ్ లో అత్యద్భుతంగా రాణించిన హృతిక్, ఎలాగైనా సీటు వస్తుందన్న ధీమాతో ఉన్నాడు. కానీ, పేపర్ లీక్ ఆరోపణలు, ఆపై ఎగ్జామ్ రద్దు వార్తలు అతన్ని కుంగదీశాయి. తిరిగి ఎగ్జామ్ రాయాల్సి వస్తే తన కష్టమంతా వృధా అవుతుందేమోనన్న ఆందోళనతో మే 14న ఉదయం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏళ్ల తరబడి కష్టపడి సాధించిన ఫలితం ఇలా వివాదాల్లో చిక్కుకోవడం, మళ్ళీ ఎగ్జామ్ రాసే పరిస్థితి రావడం హృతిక్‌ను తీవ్ర కలతకు గురిచేసిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్