test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్ ప్రశ్నాపత్రం లీక్ – వెలుగు చూసిన కీలక విషయాలు ..!

13 మే, 2026

నీట్ ప్రశ్నాపత్రం లీక్ – వెలుగు చూసిన కీలక విషయాలు ..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 13, 2026, 11:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌ కేసులో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తన కుమారుడి వద్ద ఉన్న ‘గెస్‌పేపర్‌’ను రాజస్థాన్‌లోని సికార్‌లో హాస్టల్‌ యజమాని ఓ కెమిస్ట్రీ అధ్యాపకుడి దృష్టికి తీసుకెళ్లారు. పలు ప్రశ్నలు నీట్‌ పేపర్‌తో పోలినట్లు ఆయన గుర్తించారు. వెంటనే హాస్టల్ యజమాని పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే శుభమ్‌ ఖైర్నార్ అనే వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని సిబిఐకి నాసిక్ పోలీసులు అప్పగించారు.

ఎంబిబిఎస్ స్టూడెంట్ కు పిడిఎఫ్ ….
రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన ఓ విద్యార్థి కేరళలో ఎంబిబిఎస్‌ చదువుతున్నాడు. నీట్‌ పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందు.. అంటే మే 2 వ తేదీ రాత్రి 11 గంటలకు అతడికి సికార్‌లోని ఓ స్నేహితుడి నుంచి పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో నీట్‌ పరీక్షకు అవసరమయ్యే ప్రశ్నపత్నం వచ్చింది. ‘గెస్‌ పేపర్‌’తో వచ్చిన ఆ ప్రశ్నపత్రాన్ని సదరు విద్యార్థి రాజస్థాన్‌లోని తన తండ్రికి పంపించాడు. ఆ విద్యార్థి తండ్రి స్థానికంగా హాస్టల్‌ నిర్వహిస్తున్నాడు. మర్నాడు ఉదయం కొడుకు నుంచి మెసేజ్‌ చూసిన ఆ హాస్టల్‌ యజమాని.. ఈ విషయాన్ని తనకు తెలిసిన ఓ కెమిస్ట్రీ అధ్యాయపకుడి దృష్టికి తీసుకెళ్లాడు.

గెస్ పేపర్ తో పోల్చగా అసలైన ప్రశ్నా పత్రం సరిపోయింది …!
అప్పటికే దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష ప్రారంభమైంది. దీంతో ఆ టీచర్‌ అసలైన ప్రశ్నపత్రంతో ఈ గెస్‌ పేపర్‌ను పోల్చగా.. దాదాపు 108 ప్రశ్నలు ఒకేలా ఉండటం గుర్తించారు. ఆ తర్వాత బయాలజీ పేపర్‌ చూడగా.. అందులోనూ చాలావరకు ప్రశ్నలు ఒకేలా ఉండటంతో పేపర్‌ లీక్‌ జరిగిఉండొచ్చని అనుమానం మొదలైంది. దీంతో ఆ కెమిస్ట్రీ టీచర్‌, హాస్టల్‌ యజమాని కలిసి పోలీసుల వద్దకు వెళ్లడంతో ఈ లీకేజీ వ్యవహారం బయటపడిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

కేసు నమోదుకు నిరాకరించిన సికార్ పోలీసులు …
తొలుత ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసేందుకు సికార్‌ పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ హాస్టల్ యజమాని, కెమిస్ట్రీ టీచర్‌ కలిసి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి మెయిల్‌ పంపించారు. అప్పటికే పరీక్ష జరిగి నాలుగు రోజులు గడిచింది. దీంతో ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఎన్‌టీఏ.. ఇంటిలిజెన్స్‌ బ్యూరో సాయం కోరింది. వారి సూచనల మేరకు రాజస్థాన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ దీనిపై దర్యాప్తు చేపట్టగా.. లీకేజీ గుట్టు వెలుగులోకి వచ్చింది. భద్రతా కారణాల రీత్యా ఆ హాస్టల్‌ యజమాని, ఆయన కుమారుడు, కెమిస్ట్రీ టీచర్ వివరాలను పోలీసులు బహిర్గతం చేయలేదు.

కొడుకు కోసం వైద్యుడి దగ్గర పేపర్‌ కొని..
ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా …. కీలక విషయాలు బయటికొస్తున్నాయి. రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన సోదరులు మంగీలాల్‌, దినేశ్‌ బివాల్‌ ఈ నీట్‌ ప్రశ్నపత్రాన్ని ఏప్రిల్‌ 26న గురుగ్రామ్‌కు చెందిన వైద్యుడి నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సోదరుల్లో ఒకరి కుమారుడు నీట్‌ పరీక్ష కోసం సిద్ధమవుతుండగా ఆ పేపర్‌ను అతడికి పంపించారు. అనంతరం ఏప్రిల్‌ 29న ఈ ప్రశ్నపత్రాన్ని వీరు కొంతమందికి విక్రయించినట్లు దర్యాప్తులో తెలిసింది. బీహార్‌, జమ్మూ కాశ్మీర్, హర్యానా, తదితర రాష్ట్రాల్లోని అభ్యర్థులకు ఈ పేపర్‌ చేరినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు. లీక్‌ వ్యవహారంతో నీట్‌ పరీక్షను ఎన్‌టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్