దక్షిణ కోస్తా రైల్వే జీఎంకు వినతి
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాధూర్‌కు శనివారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిధర్ కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లా రైల్వేపరంగా ఎంతో వెనుకబడి ఉందని, ఇక్కడ ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తేనే బడ్జెట్ నిధులు పెరిగి కొత్త ప్రాజెక్టులు మంజూరవుతాయని, అలాగే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. జిల్లాకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నప్పటికీ, ఇక్కడి పంటలు, కూరగాయలను ఇతర రాష్ట్రాలకు రవాణా చేసుకునేందుకు సరైన రైల్వే సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తిరుపతి తూర్పు, పడమర స్టేషన్లతో పాటు తిరుచానూరు, రేణిగుంట, చంద్రగిరి రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని, తిరుపతి-కాట్పాడి మార్గంలో విద్యుద్దీకరణతో పాటు డబుల్ లైన్ పనులను వేగవంతం చేయాలని కోరారు. వీటితో పాటు తిరుపతి నుండి విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాలకు మరిన్ని అదనపు రైళ్లను నడపాలని వారు జీఎంను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి సభ్యులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)