ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహకాల్లో భాగంగా బుధవారం ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద ‘యోగాంధ్ర-2026’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పాల్గొని, పలు యోగాసనాలను సాధన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతికి యోగా ప్రతీక అని, దీని ప్రాధాన్యత శాస్త్రీయంగా కూడా నిరూపితమైందని కొనియాడారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి, మధుమేహం (షుగర్), గుండెపోటు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలను నియంత్రించడానికి యోగా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లోనూ రోజూ కనీసం అరగంట పాటు యోగా సాధన చేయడం వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ యోగాను తమ జీవనశైలిగా అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఇందుకోసం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు యోగాపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 21న అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ ఎత్తున యోగా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ‘యోగాంధ్ర’ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రజలు, అధికారులు అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
జీవితంలో యోగా భాగం కావాలి: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
10 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 10, 2026, 08:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)