ప్రజాశక్తి-కాకినాడ
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌వో), అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్ పాల్గొని ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన అన్ని అంశాలపై రాజకీయ పార్టీల నాయకులకు సమగ్రంగా వివరించారు.
సుమారు రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, అర్హులైన ఓటర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు, పేర్ల తొలగింపు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలను అధికారుల బృందం వివరంగా తెలియజేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు.
ఈ సందర్భంగా కె.టి. సుధాకర్ మాట్లాడుతూ ఓటరు జాబితాల స్వచ్ఛత, ఖచ్చితత్వం కోసం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అసిస్టెంట్లు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీలు ప్రజల్లో అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల విజ్ఞప్తికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి, ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌వోలు) కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలు, దరఖాస్తుల స్వీకరణ, ఇంటింటి సర్వే, డేటా నమోదు, అభ్యంతరాల పరిశీలన తదితర అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్‌వో మరియు తహసీల్దార్ జితేంద్ర, డీటీ గోవిందరాజు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)