కొంతమంది పిల్లలకు చీకటి అంటే భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. ఇంట్లో చిన్న శబ్దం వినిపించినా భయం. సోషల్ మీడియాలో ఏదో “ఘోస్ట్ వీడియో” కనిపించినా భయం. కొంతమంది పిల్లలు రాత్రిళ్లు ఒంటరిగా పడుకోలేకపోతున్నారు. మరికొందరు యూట్యూబ్‌లో చూసిన దెయ్యాల వీడియోలను నిజమని నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితిని చూసినప్పుడు చాలామంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. దెయ్యాల కథలే కారణమని అంటారు. మరి మన చిన్నప్పుడు దెయ్యాల కథలు లేవా? చందమామలో దెయ్యాల కథలు ఉండేవి. భేతాళుడు ఉండేవాడు. రాక్షసులు ఉండేవారు. మాయాజాలాలు ఉండేవి. అయితే అవి మనల్ని మూఢనమ్మకాల వైపు నడిపించాయా? మనలో భయాలను నింపాయా? నిజం చెప్పాలంటే అవి భయాన్ని పెంచలేదు. భయాన్ని ఎదుర్కోవడం నేర్పించాయి.
చందమామ కథల్లో దెయ్యం ఒక పాత్ర మాత్రమే! కథకు కేంద్రబిందువు కాదు. కేంద్రంలో ఉండేది మనిషి. అతని తెలివి. అతని ధైర్యం. అతని వివేకం. విక్రమార్కుడు భేతాళుడిని చూసి పారిపోడు. అతన్ని భుజాన వేసుకుని నడుస్తాడు. భేతాళుడు ప్రశ్నలు అడుగుతాడు. విక్రమార్కుడు సమాధానాలు చెబుతాడు. అక్కడ భయం కంటే ఆలోచనకు ఎక్కువ స్థానం ఉంటుంది. తెనాలి రామలింగడి కథల్లో కూడా ఇదే కనిపిస్తుంది. గ్రామస్తులు దెయ్యమని భయపడుతున్న చోట అతను కారణం వెతుకుతాడు. మోసాన్ని కనిపెడతాడు. అజ్ఞానాన్ని ఎగతాళి చేస్తాడు. అంటే కథ చివరికి గెలిచేది దెయ్యం కాదు. హేతువు. ఇదే చందమామ కథల అసలు బలం. అవి పిల్లలకు “భయపడకు, ఆలోచించు”, “అద్భుతాన్ని నమ్మే ముందు కారణం వెతుకు”, “చీకటిని చూసి పారిపోకు, దగ్గరకు వెళ్లి చూడు” అనే సందేశాలను ఇచ్చేవి. అవి కేవలం వినోద కథలు కాదు. హేతుబద్ధమైన ఆలోచనకు తొలి పాఠాలు.
అజ్ఞానాన్ని పెంచకూడదు..
చందమామలో దెయ్యాలు, మంత్రాలు, అద్భుతాలు కనిపించినా, అవి అజ్ఞానాన్ని పెంచే విధంగా ఉండేవి కావు. పిల్లల ఊహాశక్తిని పెంచుతూనే, వారిని ఆలోచింపజేసే ప్రయత్నం వాటిలో కనిపించేది. భేతాళుడు ప్రతి కథ చివర్లో ప్రశ్న అడగడం యాదృచ్ఛికం కాదు. అది ఒక విద్యా పద్ధతి. పిల్లలకు సిద్ధంగా జవాబులు ఇవ్వడం కంటే, ప్రశ్నలు అడగడం నేర్పించే పద్ధతి. చందమామలో కల్పన ఉన్నా, హేతువు కూడా ఉండేది. అద్భుతం ఉన్నా, వివేకం కూడా ఉండేది. అందుకే చందమామ దెయ్యాలు పిల్లలను భయపెట్టలేదు. ఆలోచింపజేశాయి. దాని వెనుక కొడవటిగంటి కుటుంబరావు వంటి హేతువాద రచయితల ప్రభావం ఉంది.
భయం కొత్త కాదు..
మానవ చరిత్రలో భయం కొత్తది కాదు. ఆదిమానవుడి నుంచి మనిషి భయాలతోనే జీవిస్తున్నాడు. పులి భయం. పాము భయం. చీకటి భయం. ప్రకృతి విపత్తుల భయం. కానీ ప్రతి నాగరికత ఒక విషయం అర్థం చేసుకుంది. భయాన్ని జయించాలంటే దాని గురించి మాట్లాడాలి. కథలు చెప్పాలి. ఊహల్లోకి తీసుకురావాలి. అందుకే ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోనూ దెయ్యాల కథలు కనిపిస్తాయి. కానీ ఒకప్పుడు ఆ కథల ఉద్దేశం భయాన్ని అమ్మడం కాదు. భయాన్ని అర్థం చేయించడం. పిల్లలను వణికించడం కాదు. భయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచడం. జానపద కథలు, పౌరాణిక కథలు, బాలసాహిత్యం చాలావరకు ఇదే పని చేశాయి.
నేడు భయం అమ్మకపు సరుకు!
ఇప్పుడు పరిస్థితి మారింది. నేడు భయం ఒక వ్యాపార వస్తువుగా మారింది. టెలివిజన్‌లో భయం. యూట్యూబ్‌లో భయం. వెబ్ సిరీస్‌లలో భయం. మొబైల్ గేమ్‌లలో భయం. సోషల్ మీడియాలో భయం. ఎందుకంటే భయం మనిషి దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది. ఆశ్చర్యం, భయం, ఉద్రేకం వంటి భావోద్వేగాలు వ్యాపారపరంగా లాభదాయకమైనవి. అందుకే వాటిని విపరీతంగా వినియోగిస్తున్నారు. 2017లో ప్రపంచవ్యాప్తంగా “ఎల్సాగేట్” అనే వివాదం వెలుగులోకి వచ్చింది. ఎల్సా, స్పైడర్‌మ్యాన్, పెప్పా పిగ్ వంటి పిల్లలకు ఇష్టమైన పాత్రలను ఉపయోగించి, వేలాది వీడియోలు రూపొందించారు. బయటకు చూస్తే అవి పిల్లల వీడియోల్లా కనిపించేవి. కానీ లోపల హింస, భయానక దృశ్యాలు, అసహజ ప్రవర్తనలు ఉండేవి. వివాదం బయటపడిన తరువాత యూట్యూబ్ లక్షలాది వీడియోలను తొలగించాల్సి వచ్చింది. పిల్లల వినోదం పేరిట భయం, కలవరాన్ని విక్రయిస్తున్న ఒక పెద్ద ప్రపంచం అప్పుడే బహిర్గతమైంది.
ఆన్‌లైన్ గేమ్‌ల్లోనూ..
ఆన్‌లైన్ గేమ్‌ల ప్రపంచంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. Granny, Poppy Playtime, Five Nights at Freddy’s, Bendy and the Ink Machine వంటి గేమ్‌లు ప్రధానంగా భయం, వెంటాడే రాక్షసాకార పాత్రలు, చీకటి వాతావరణం ఆధారంగా రూపొందించారు. ఇవి పెద్ద పిల్లలు, యువత కోసం రూపొందించిన గేమ్‌లు. కానీ చిన్న పిల్లలు కూడా వాటిని ఆడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో “గేమింగ్ డిజార్డర్” ను ఒక మానసిక ఆరోగ్య సమస్యగా గుర్తించింది. ప్రతి గేమ్ హానికరం కాదు. కానీ గంటల తరబడి భయం, హింస, వెంటాడే దృశ్యాల మధ్య గడపడం కొందరు పిల్లల్లో ఆందోళన, నిద్ర సమస్యలు, అసహజ భయాలను పెంచవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అమెరికాలో నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో 70 శాతానికి పైగా పిల్లలు తాము చూసిన టెలివిజన్ కార్యక్రమాలు లేదా సినిమాల వల్ల ఎప్పుడో ఒకసారి తీవ్రంగా భయపడ్డామని చెప్పారు. వారిని ఎక్కువగా భయపెట్టిన అంశాల్లో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు, రాక్షసులు ప్రధానంగా ఉన్నాయి. బాలల వైద్య నిపుణులు కూడా చిన్న వయసులో భయానక కంటెంట్‌ను అధికంగా చూడడం వల్ల కొందరు పిల్లల్లో పీడకలలు, చీకటి భయం, ఒంటరిగా ఉండలేకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చని చెబుతున్నారు.
వాస్తవికత తగ్గిపోతోంది..
అయితే ఇక్కడ కూడా అసలు సమస్య దెయ్యాల కథల్లో లేదు. సమస్య పిల్లల జీవితాల్లో వాస్తవ ప్రపంచం క్రమంగా తగ్గిపోవడంలో ఉంది. చందమామ చదివిన తరం కథలతోపాటు జీవితాన్ని కూడా చూసింది. చెరువును చూసింది. వానను అనుభవించింది. పిడుగును చూసింది. పామును చూసింది. పొలంలో నడిచింది. చెట్టు ఎక్కింది. పక్షులను గమనించింది. ప్రకృతిని చదివింది. అంటే వాస్తవ ప్రపంచం వారికి బాగా తెలుసు. అందుకే కల్పనను కల్పనగానే చూడగలిగారు. కానీ నేడు చాలామంది పిల్లల ప్రపంచం స్క్రీన్‌లకే పరిమితమవుతోంది. ప్రకృతి నుంచి దూరమవుతోంది. పరిశీలన తగ్గుతోంది. ప్రశ్నించడం తగ్గుతోంది. అనుభవం తగ్గుతోంది. అప్పుడు కల్పనకు సమతుల్యం ఇచ్చే వాస్తవ ప్రపంచం బలహీనపడుతుంది. అక్కడే భయాలు బలపడతాయి. అక్కడే మూఢనమ్మకాలు పెరుగుతాయి. అక్కడే అతీత శక్తుల కథలు నిజాల్లా అనిపించడం మొదలవుతుంది.
శాస్త్రాన్ని చదవడం మాత్రమే హేతువాదాన్ని ఇవ్వదు. ప్రశ్నించడం హేతువాదాన్ని ఇస్తుంది. ప్రకృతిని గమనించడం ఇస్తుంది. కారణాలు వెతకడం ఇస్తుంది. అందుకే పిల్లలకు కథలు కావాలి. కల్పన కూడా కావాలి. కానీ వాటితోపాటు జీవిత అనుభవాలు కూడా కావాలి. ఒక దెయ్యాల కథ విన్న తర్వాత కూడా “ఇది నిజమేనా?” అని అడిగే పిల్లలు కావాలి. ఒక యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత కూడా “దీనికి ఆధారం ఏమిటి?” అని ప్రశ్నించే పిల్లలు కావాలి. చందమామ దెయ్యాలు పిల్లలను భయపెట్టలేదు. ఎందుకంటే అవి దెయ్యాలను కాదు, మనిషిని నమ్మమన్నాయి. మంత్రాలను కాదు, బుద్ధిని నమ్మమన్నాయి. అద్భుతాలను కాదు, ధైర్యాన్ని నమ్మమన్నాయి. అందుకే ఆ కథల్లో చివరికి గెలిచేది దెయ్యం కాదు. ధైర్యం. తెలివి. వివేకం. ఇప్పటి పిల్లలకు కూడా అవే కావాలి!
శాంతిమిత్ర
9490099167









కామెంట్‌లు (0)