ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ ఒకటి నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న కల నెరవేరుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆదివారం వెల్లడించారు. కొత్త రైల్వేజోన్ ద్వారా ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈ రైల్వే జోన్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మోడీ, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఏర్పడుతున్న ఈ రైల్వేజోన్ భారతీయ రైల్వేల 18వ జోన్‌గా అవతరించనుంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం డివిజన్ ఈ జోన్ పరిధిలోకి రానున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఇచ్చిన ప్రధాన హామీలలో రైల్వేజోన్ ఒకటిగా ఉండగా, దీని అమలు ఇప్పుడు కార్యరూపం దాల్చడం రాష్ర్టాభివృద్ధికి కీలక అడుగుగా భావిస్తున్నట్లు సిఎం చంద్రబాబు పేర్కొన్నారు.
నేడు తుని నియోజకవర్గంలో సిఎం పర్యటన
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని చామవరం గ్రామంలో నిర్వహించే ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొంటారు. షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 10:50 గంటలకు చామవరం చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:40 గంటలకు తుని నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సాయంత్రం 5:15 గంటలకు అమరావతికి చేరుకోనున్నారు.









కామెంట్‌లు (0)