మాదక ద్రవ్యాల కేసులో నిందితునికి బెయిల్ నిరాకరించిన సుప్రీం
న్యూఢిల్లీ : మాదకద్రవ్యాల రవాణా, సరఫరాకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఒక తరం తర్వాత మరొక తరం యువత జీవితాలను డ్రగ్ డీలర్లు నాశనం చేస్తూ వస్తున్నారని విమర్శించింది. మాదకద్రవ్యాల నిరోధక చట్టం, 1985 నిబంధనల కింద 2022 జూన్‌లో అరెస్టయిన నిందితుడి బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. మద్రాసు హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ నిందితుడు సుప్రీంను ఆశ్రయించాడు. ఈ కేసులో నిందితుడు పెట్టుకున్న ఆరవ బెయిల్ పిటిషన్ ఇదని పేర్కొంటూ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి తిరస్కరించింది.
2022 జూన్ 11న పిటిషనర్ మరో ఇద్దరు వ్యక్తులతో ఒక సంచీ పట్టుకుని రోడ్డుపై నిలుచుని వుండగా పోలీసులను చూసి వారు పారిపోవడానికి యత్నించారని, దాంతో వారిని పట్టుకోగా పిటిషనర్ వద్ద దాదాపు 10.15 గ్రాముల బరువున్న ఎండిఎంఎ ఎక్స్టసీ టాబ్లెట్‌లు దొరికాయని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఆ మాదకద్రవ్యాలను జులై 5న చెన్నైలోని ప్రత్యేక కోర్టు ముందు పెట్టగా, సంబంధిత విచారణా కోర్టు ఆమోదం లేకుండానే పోలీసులు దాన్ని తమ వద్ద అట్టిపెట్టుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది మద్రాసు హైకోర్టులోవాదించారు. ఆరు మాసాల్లోగా విచారణ పూర్తి చేయాలని 2024 నవంబరులో హైకోర్టు ఆదేశించినా ఇంతవరకు విచారణ పూర్తి కాలేదని సహ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారని తెలిపారు. వాణిజ్యపరంగా విక్రయించడానికి వీలైనటువంటి మొత్తంలో, రూపంలో ఆ మాదకద్రవ్యాలు వున్నాయని ప్రాసిక్యూషన్ పేర్కొంది.









కామెంట్‌లు (0)