నూతన ఒరవడికి పురస్కారం

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో ‘డిజిటల్ మోసాలు`, ‘సైబర్ క్రైమ్`, ‘డిజిటల్ అరెస్టు` గురించిన వార్తలు వింటూనే ఉంటాం. వీటిపై ఎన్నో కథనాలు పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తూనే ఉంటాయి. అలా తనకెదురైన ఓ నిజ జీవిత సంఘటనను జర్నలిస్టు సుపర్ణా శర్మ ఎంతో అర్థవంతంగా ప్రముఖ మ్యాగజైన్లో దృశ్య రూపంలో అందించారు. ఆ కథన రూపానికి తన బొమ్మలతో మరింత లోతైన విశ్లేషణ తీసుకొచ్చారు ప్రముఖ చిత్రకారుడు ఆర్ కె ఆనంద్. అమెరికన్ పత్రిక ‘బ్లూమ్ బర్గ్`లో ‘trAPPed` పేరుతో ఈ కథనం ప్రచురించారు. సైబర్ క్రైమ్ పై సమాజాన్ని చైతన్యం చేసే ప్రక్రియలో భాగంగా వీరిద్దరు చేసిన కృషికి గాను తాజాగా ప్రతిష్టాత్మక అవార్డు పులిట్జర్ ప్రైజ్ దక్కింది. జర్నలిజంలో అత్యంత ఉన్నతమైన అవార్డుగా భావించే ఈ ప్రైజ్ ఈ ఏడాది భారతీయులైన వీరికి లభించడం గర్వకారణం.
జర్నలిజంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సుపర్ణ తన కెరీయర్ లో ఎన్నో ప్రభావవంత కథనాలు అందించారు. నేరాలు, సంఘర్షణలు, జాతీయ విపత్తులు, అవినీతి వంటి అంశాలపై ఆమె ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు.

ఢిల్లీలో 2023లో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఓ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఇద్దరు వృద్ధులు అగ్నికి ఆహుతి అయ్యారు. అయితే ఆ ఘటనను కప్పిపుచ్చేందుకు నిర్వాహకులు ఎన్నో కుయుక్తులు పన్నారు. వాటన్నింటినీ ఆమె బట్టబయలు చేశారు. ఆ సందర్భంలో ఆమె రాసిన కథనం భారత్ లో సీనియర్ సిటిజన్లపై సంరక్షణ కేంద్రాలు చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. అలాగే నిజాన్ని పూడ్చి పెట్టడంలో సహకరిస్తున్న అధికారుల పనితీరును కూడా కళ్లకు కట్టినట్లు చూపించింది. సుపర్ణ రాసిన మరో కథనం భారత మహిళా రెజ్లర్ల గురించి.. అందులో అగ్ర శ్రేణి మల్లయోధురాళ్లపై రెజ్లర్ చీఫ్ నెరిపిన లైంగిక వేధింపులను బహిర్గతం చేసిన తరువాత నుండి ఆ రెజ్లర్లు ఎదుర్కొన్న ప్రతికూల చర్యలను ఆమె కథనాల్లో తేటతెల్లం చేశారు. దేశంలోని ఉన్నత ఇంజినీరింగ్, బిజినెస్ స్కూళ్ల నుండి పట్టభద్రులైన వారు ఓటర్లను, ఎన్నికలను తారుమారు చేయడంలో రాజకీయ కన్నల్టెన్సీలకు ఏవిధంగా సహాయపడుతున్నారో అనే దానిపై కూడా ఆమె పలు కథనాలు రాశారు.
ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్న సుపర్ణ ఆల్ జజీరా ఆన్ లైన్ పత్రిక ఢిల్లీ విభాగానికి ఎడిటర్ గా, రిపోర్టర్ గా, రచయితగా ఉన్నారు. బిజినెస్, సినిమా, రాజకీయాలు, పాప్ సంస్కృతి, పుస్తకాలపై రచనలు చేస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా క్రైమ్ వార్తలు, ఉత్తర భారతదేశంలో ప్రజల తిరుగుబాటు, ప్రభుత్వాల అవినీతి వంటివి ఆమె కవర్ చేసిన వార్తాంశాల్లో ప్రధానమైనవి. రోలింగ్ స్టోన్ ఇండియా, బిబిసి ఆఫ్రికా, ద ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఫ్రంట్ లైన్, ద ఏషియన్ ఏజ్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ ఆఫ్ లైన్, ఆన్ లైన్ పత్రికల వివిధ విభాగాల్లో సుపర్ణ ఎన్నో ప్రభావవంతమైన వార్తలను అందిస్తున్నారు.

చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఆనంద్

ఆనంద్ ఆర్ కె ముంబై కేంద్రంగా పనిచేస్తున్న చిత్రకారుడు. సర్ jj స్కూల్ ఆఫ్ ఆర్ట్ (2011) పూర్వ విద్యార్థి. ‘బ్లూ ఇన్ గ్రీన్` అనే గ్రాఫిక్ నవలకు ఆనంద్ అందించిన బొమ్మలకు గాను కలరిస్ట్ జాన్ పియర్శన్ తో కలిసి 2021లో ‘ఉత్తమ చిత్రకారుడు/మల్టీ మీడియా కళాకారుడు` విభాగంలో ఎయ్ స్నీర్ అవార్డును అందుకున్నారు. పలు ప్రముఖ దినపత్రికలకు కూడా ఆనంద్ ముఖచిత్రాలు అందించారు. హుండయ్, భారత నావికాదళం, హెవీ మెటల్ మ్యాగజైన్ వంటి సంస్థల కోసం కూడా ఆనంద్ చిత్రాలు గీశారు.

నూతన ఒరవడికి పురస్కారం

సైబర్‌ ‌క్రైమ్‌ ‌పై ‘దృశ్య’ అవగాహన

తాజాగా పులిట్జర్ అవార్డుకు ఎంపికైన సుపర్ణ రాసిన కథనాన్ని నేటి సమాజంలో సైబర్ క్రైమ్ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని తీసుకొచ్చేలా సాగింది. నిజ జీవిత అనుభవాలను దశల వారీగా దృశ్య రూపంలో ఆవిష్కరించేలా ఈ కథనాన్ని తీర్చిదిద్దారు. ఈ వినూత్న విధానం వల్ల జరుగుతున్న మోసంలోని సంక్లిష్టతను పాఠకులకు సులువుగా అర్థమయ్యే సరళరీతిలో అందించినట్లైంది. ఇంకా కథను మరింత ఆసక్తిగా మార్చింది. అసంఖ్యాక పాఠకులకు నిజ జీవిత ఉదాహరణలను దగ్గరగా చూపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రాఫిక్ పద్ధతి డిజిటల్ మోసపు పథకంలోని చిక్కులను ప్రజలకు బాగా అర్థమయ్యేలా విజయవంతంగా తెలియజేసింది. ఈ కథనానికి సుపర్ణ, ఆనంద్ తో పాటు ఆర్టికల్ కు టైటిల్ అందించిన బ్లూమ్ బర్గ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ నటాలి ఒబికో పియర్సన్ కూడా అవార్డులో భాగం అందుకోనున్నారు.​

కొత్త రూపంలో వార్తాకథనం ​

ఒక వైద్యురాలికి డిజిటల్ స్కామ్ స్టర్స్ నుండి ఫోన్ వస్తుంది.
‘మీ పేరు మీద చాలా అకౌంట్స్ ఉన్నాయి. ట్రాన్సక్షన్స్ లో ఫ్రాడ్ జరుగుతోంది. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.
ఆమె తీవ్ర భయభ్రాంతులకు గురవుతుంది.
సీట్ లో నుండి కదలడానికి కూడా వీల్లేకుండా అధికారులు ఆమె ఎదురుగా స్క్రీన్ పై కనిపిస్తుంటారు.
ఆమె ఫోన్ మోగినా ఎత్తాలా? వద్దా? అని కూడా వారే చెబుతుంటారు.
స్క్రీన్ మీద కోర్డు ప్రత్యక్షమవుతుంది.
ఆ తర్వాత సిబిఐ ఆఫీసర్లు మాట్లాడతారు.
చివరగా ఆ వైద్యురాలు శిక్ష నుండి తప్పించుకోవాలంటే డబ్బులు డిపాజిట్ చేయాలని చెబుతారు.
నిరంతరం ఫోన్లు, క్షోభ, భయం..
ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. వారం రోజులకు పైగా అనుభవించిన ఈ భయంకర అనుభవం తరువాత ఆ వైద్యురాలు పోలీసులను ఆశ్రయిస్తుంది. అప్పుడు ఆమెకు వచ్చింది ఫ్రాడ్ కాల్ అని తెలుస్తుంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని మాటలతో, బొమ్మలతో కళ్లకు కట్టినట్లు గ్రాఫిక్ రూపంలో అందించిన ఈ బృందానికి దక్కిన ఈ అవార్డు జర్నలిజంలో నూతన ఒరవడిని ప్రతిబింబిస్తుంది. సమస్యను పాఠకులకు చేరవేయడం, అవగాహన కల్పించడంలో ఎంత పరిణతితో వ్యవహరించాలో తెలియజేస్తుంది.