అర్బన్ గవర్నెన్స్‌లో సహకరించండి
పరిశ్రమల ఏర్పాటుకు భూములున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రితో చర్చ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వివిధ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఆంధ్రప్రదేశ్, సింగపూర్ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యంతో పండించిన ఉద్యాన ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అంశాలను పరిశీలించాలని సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్‌ను సిఎం కోరారు. రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాన మంత్రితో సోమవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగైన ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని వాంగ్‌ను చంద్రబాబు కోరారు. సెమీ కండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్, కెపాసిటి బిల్డింగ్‌లో తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధితోపాటు వివిధ అవకాశాలను అందిపుచ్చు కునేలా ఎపి - సింగపూర్ కలిసి పనిచేయాలని కోరారు. రాజధాని అమరావతి నిర్మాణాల గురించి లారెన్స్ వాంగ్ అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు భూమి లభ్యతతో పాటు సేవల రంగంలో నిపుణులైన మానవ వనరులు రాష్ట్రంలో ఉన్నాయని సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్‌తో భేటీ సందర్భంగా సిఎం చంద్రబాబు అన్నారు. ఎపి - సింగపూర్ మధ్య విమాన సర్వీసులు, వివిధ విమానాశ్రయాలకు ఎయిర్ కనెక్టివిటీ, రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించిన అంశాలను బాలకృష్ణన్‌కు వివరించారు. తయారీ రంగంతో పాటు సేవల రంగంలోనూ రాష్ట్రం అగ్రగామిగా అవతరిస్తోం దని, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ తయారీలో కీలకంగా ఉందన్నారు. అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ మంత్రి పి నారాయణ, సింగపూర్‌లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే పాల్గొన్నారు.
పెట్టుబడులకు సరైన సమయం
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయం అని, పెట్టుబడి దారులు ముందుకు రావాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వెంచర్ కాపిటలిస్టులతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడారు. శ్రీసిటీ వంటి ప్రత్యేక పారిశ్రామిక వాడలు పెద్దయెత్తున పెట్టుబడులను ఆకర్షిస్తు న్నాయని అన్నారు. పౌరసేవలతో పాటు అన్ని అంశాలకూ టెక్నాలజీని అనుసంధానిం చామన్నారు. అత్యుత్తమ ఆవిష్కర ణల్ని పోత్సహించేందుకు వెంచర్ కాపిటలిస్టులు ముందుకు రావాలన్నారు. రాష్ర్టాభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని అక్కడి భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో జరిగిన భేటీలో చంద్రబాబు అన్నారు. సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి పి నారాయణ, పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్, ఇడిబి సిఇఒ షన్మోహన్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గూగుల్‌తో కలిసి పనిచేసేందుకు టాస్క్ ఫోర్స్
వివిధ రంగాల్లో సంయుక్తంగా పనిచేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ నిర్ణయించాయి. సింగపూర్‌లో పర్యటిస్తున్న సిఎం చంద్రబాబు గూగుల్ ఆసియా - పసిఫిక్ రీజియన్ అధ్యక్షులు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఈ మేరకు జరిగిన చర్చల్లో ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామి కావాలని కరణ్ బజ్వాను సిఎం కోరారు. ప్రభుత్వ సేవల్లో ఎఐ వినియోగంపై గూగుల్ క్లౌడ్ సహకారం అందించాల న్నారు. విశ్వవి ద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాల ఏర్పాటు చేసేలా తీసుకుంటున్న చర్యలకు సహకారం కావాలని కోరారు. లాజిస్టిక్స్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, రాష్ర్టాన్ని సందర్శించి పెట్టుబడులు పెట్టాలని వైసిహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్‌తో జరిగిన సమావేశంలో సిఎం చెప్పారు. యుఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని, దీనికి భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని యుఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తో జరిగిన సమావేశంలో చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పట్టణాల సుస్థిర అభివృద్ధికి యుఎన్ హాబిటాట్ సహకారాన్ని కోరిన సిఎం.. పట్టణాల్లో మురికివాడల అభివృద్ధికి పార్టిసిపేటరీ స్లమ్ అప్‌గ్రేడింగ్ ప్రోగ్రాం అమలుపై చర్చించారు. రాజధాని అమరావతిలో యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్) ప్రెసిడెంట్ టాన్ ఎంగ్ చేయ్‌ను చంద్రబాబు కోరారు. అన్ని రంగాల్లో తెలుగు పారిశ్రామికవేత్తలు ఉన్నారని, మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సిఐఐ ఎపి బిజినెస్ ప్రతినిధులకు సూచించారు. పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని విదేశాల్లో బ్రాండ్ చేసే బాధ్యతను తెలుగు పారిశ్రామికవేత్తలు తీసుకోవాలని కోరారు. గుడ్ గవర్నెన్స్ విషయంలో సీనియర్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని జిఐసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్‌ను కోరారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి లోయెన్ లింగ్‌తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు.









కామెంట్‌లు (0)