test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మద్దతు’లోనూ లొంగుబాటు!

25 మే, 2026

msp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 25, 2026, 06:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

• సి2ను పరిగణనలోకి తీసుకోనేలేదు • పంటల ధరలు నామమాత్రం పెంచినా జీహుజూర్‌ చెప్పిన టిడిపి కూటమి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి :
స్వామినాథన్‌ ‌కమిషన్‌ ‌సిఫారసులకు అనుగుణంగా (సి2+50 శాతం) పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌‌పి) ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి రైతులను మోసగించగా, రాష్ట్ర టిడిపి కూటమి ప్రభుత్వం అందుకు ఆమోదం తెలపడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న సాగు ఖర్చులను బేరీజువేసి ఏ పంటకు ఎంత మొత్తం రైతుకు పెట్టుబడి అవుతుందో గణించి, దానికి కనీసం 50 శాతం కలిపి రానున్న ఖరీఫ్‌ ‌మార్కెటింగ్‌ ‌సీజన్‌‌కు ఎంఎస్‌‌పి ప్రకటించాలని టిడిపి కూటమి సర్కార్‌ ‌కేంద్రానికి సిఫారసులు పంపింది. స్థానికంగా తిష్ట వేసిన కొన్ని పరిస్థితుల కారణంగా చాలా రాష్ట్రాల కంటే ఇక్కడ సాగు వ్యయం అధికమని వివరించింది. రాష్ట్రం పంపిన సిఫారసులను కేంద్రం బుట్టదాఖలు చేసి తాను అనుకున్నట్లు నామమాత్రపు పెంపుతో సరిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌‌ను పట్టించుకోకుండా ఎంఎస్‌‌పి ప్రకటించిన మోడీ సర్కార్‌‌ను రైతుల ప్రయోజనాల కోసం నిలదీయాల్సిన కూటమి ప్రభుత్వం ఆ పని చేయకపోగా ప్రకటించిన ధరలను సంపూర్ణంగా ఆహ్వానించి లొంగుబాటును ప్రదర్శించింది. కూటమి సర్కార్‌ ‌తీరుపై రైతుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సి2+50 కోసం, ఎంఎస్‌‌పికి చట్టబద్ధత కోసం రైతులు ఆందోళనలు చేస్తుండగా, కూటమి సర్కార్‌ ‌కనీసం నిరసన తెలపకపోవడం, వినతి పత్రం సైతం ఇవ్వకపోవడంపై అన్నదాతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వెయ్యి తక్కువ
కేంద్రం పరిధిలోని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (‌సిఎసిపి) ప్రతి ఏటా ఖరీఫ్‌, రబీ ముందు పంటలకు ఎంఎస్‌‌పిని నిర్ణయించేందుకు పెద్ద కసరత్తు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను, రైతులను, వినియోగదారులను, మార్కెట్‌‌ను దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేస్తుంది. రాష్ట్రాల్లో పరిస్థితులపై అంచనాలు కడుతుంది. రాష్ట్రాలను సలహాలు సూచనలు అడుగుతుంది. కూటమి ప్రభుత్వం 2026-27 ఖరీఫ్‌ ‌పంటల సాగుకు రైతులకు ఎంతెంత పెట్టుబడులవుతాయో పేర్కొని, ఎంత ఎంఎస్‌‌పి ప్రకటించాలో సిఎసిపికి సిఫారసులు చేసింది. ఉదాహరణకు వరి ధాన్యం క్వింటాలు ఉత్పత్తికి రూ.2,325 రైతుకు ఖర్చవుతుందని అంచనా వేసి, దానిపై సి2+50 శాతం లెక్కించి, ఎంఎస్‌‌పి రూ.3,448 ప్రకటించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కాగా సిఎసిపి కేవలం 2,441 సిఫారసు చేయగా, ఆ మేరకే మోడీ ప్రభుత్వం ఎంఎస్‌‌పి ప్రకటించింది. రాష్ట్రం అడిగిన దానికంటే దాదాపు వెయ్యి తగ్గించింది. క్వింటాలు వరి ధాన్యం ఉత్పత్తికి సిఎసిపి అంచనా వేసిన దేశ సగటు ఖర్చు (సి2) రూ.2,021. దానిపై సి2+50 కలిపితే రూ.3,032 ప్రకటించాలి. అదీ లేదు. గతేడాది ధర కంటే వరికి మూడు శాతం పెంచడమే గొప్పని మోడీ సర్కార్‌ ‌పేర్కొంది. ఈ పరిస్థితి వరికే కాదు, దాదాపు అన్ని పంటలదీ.

ఇదే రైతులకు పెద్ద ఉపశమనమట!
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు రైతులకు భారీ ఊరట అని మోడీ సర్కార్‌‌ను అభినందించడం విమర్శలకు దారితీసింది. ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్‌‌డిఎ ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయరంగ బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయని స్వాగతించారు కూడా. కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌‌పితో రైతులకు నష్టం జరుగుతున్నా కూటమి సర్కార్‌ ఈ విధంగా వ్యవహరించడంపై రైతులు ఆగ్రహం చెందుతున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఎంఎస్‌‌పి సైతం అమలు కాకపోవడంపై ఆందోళనలు నెలకొన్నాయి. ఖరీఫ్‌, రబీలలో ఏ పంటకూ ధర లేక ఆర్థికంగా చితికిపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్