– వచ్చే ఏడాది మార్చి నాటికి భూ సమస్యలు లేకుండా చేస్తాం
-‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సభలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్య్రకమం మొదలుపెట్టి ప్రస్తుతం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. సమాజంలో మార్పుతోనే స్వచ్ఛాంధ్ర సాకారమవుతుందన్నారు. రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతోనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని తెలిపారు. చెత్త ప్రాసెసింగ్ కోసం రూ.603 కోట్లతో 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. నెట్ జీరో క్యాంపస్ లో భాగంగా హాస్టళ్ల నుంచి వ్యర్థాలు లేకుండా ప్రణాళికలు అమలు చేస్తున్నామని వివరించారు. ప్రతి నెలా 10, 20 తేదీల్లో ఇ-వ్యర్థాలు సేకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా గ్రీన్ షాపులను ప్రారంభిస్తున్నామని, ప్రజలే అక్కడికి వెళ్లి ప్లాస్టిక్, ఐరన్ వంటి వ్యర్థాలను ఇచ్చి వస్తువులు పొందవచ్చన్నారు.
నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరులో సర్క్యులర్ ఎకానమీ పార్కులు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 50 ప్లాస్టిక్ వ్యర్థ యూనిట్లు వస్తుండగా, మరో 210 యూనిట్లు జూన్‌కి అందుబాటులోకి తెస్తామన్నారు.
రాష్ర్ట వ్యాప్తంగా నాలుగు వారాల పాటు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’
స్వచ్ఛాంధ్ర కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వారాల పాటు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. అందులో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు రహదారులపై పసుపు బోర్డర్లను సూచిస్తూ రంగులు వేసే కార్యక్రమం, 23 నుంచి 30వ తేదీ వరకు కాలువల క్లీనింగ్ ఉంటుందని తెలిపారు. జూన్ ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు చెత్త క్లీనింగ్, పదో తేదీ నుంచి 20 వరకు పబ్లిక్ కమ్యూనిటీ టాయిలెట్లను శుభ్రం చేసే పనిచేయాలన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మన తలసరి ఆదాయం రూ.మూడు లక్షలని, దీన్ని రాబోయే 22 ఏళ్లలో రూ.54 లక్షలు చేయాలనే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. గతంలో పి-3 విధానంతో కొంత ఆర్థిక అసమానతలు తలెత్తాయని, ఇప్పుడు పి-4 విధానం తీసుకొచ్చి పేదలను ఆదుకునే పనిచేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది
రాష్ట్రంలో జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. జనాభా తగ్గుదలతో కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని తెలిపారు. జనాభా తగ్గుదల రేటును అరికట్టేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామన్నారు. పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. పాపులేషన్ మేనేజ్‌మెంట్ ద్వారా జనాభాను దేశానికి సంపదగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మూడో సంతానానికి రూ.30 వేలు, నాలుగో సంతానానికి రూ.40 వేలు ప్రోత్సాహకంగా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తల్లికి వందనం కింద రూ.15 వేలు ఆర్థికసాయం చేస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ఆ మొత్తాన్ని పెంచే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు.
రీ సర్వే ద్వారా భూముల రికార్డుల ప్రక్షాళన
గత వైసిపి ప్రభుత్వం తనకు గిట్టని వారి భూములను 22-ఎలో పెట్టేసిందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో రీ సర్వే ద్వారా భూముల రికార్డులు ప్రక్షాళన చేస్తున్నామని, ఎవరూ ట్యాంపరింగ్ చేసే అవకాశం లేకుండా ఆధునిక టెక్నాలజీని వినియోగించి పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి అందిస్తున్నామని తెలిపారు. 2027 మార్చి నాటికి రాష్ట్రంలో ఎక్కడా భూ తగాదాలు లేకుండా చూసే బాధ్యత తీసుకుంటామన్నారు.
అధికారం అంటే… విధ్వంసం కాదు
అధికారం అంటే… విధ్వంసం కాదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందంటూ పరోక్షంగా వైసిపిని విమర్శించారు. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టబడులకు ఒప్పందాలు కుదిరాయని, తద్వారా 24 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. వైసిపితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం ద్వారా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. బంగారం కొనుగోలు, వంట నూనెల వాడకం తగ్గించాలని సూచించారు.
పంచాయతీ అధికారులకు అభినందన
అత్యుత్తమ విధానాలను అనుసరించడం ద్వారా రాష్ట్రంలోని పంచాయతీలకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. పంచాయతీలు అత్యుత్తమ పనితీరు కనబర్చడం ప్రభుత్వం చేస్తోన్న కృషికి దక్కిన ఫలితంగా భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి డిపిఒ సందీప్, పలువురు పంచాయతీ అధికారులు, గ్రీన్ అంబాసిడర్లు, స్వచ్ఛ రథం డ్రైవర్లకు శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపికలను అందించారు. ప్రజా వేదిక వద్ద పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన అభయం హెల్మెట్ బ్యాంకును ప్రారంభించి, హెల్మెట్ ధరించి అక్కడే ఉన్న బుల్లెట్ వాహనాన్ని ఎక్కారు. అనంతరం నరసన్నపేటలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)