mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ‌కార్యకలాపాలు ఆరంభం

01 జూన్, 2026

railway
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 12:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ‌కార్యకలాపాలకు రైల్వే ఉన్నతాధికారులు సోమవారం శ్రీకారం చుట్టారు. దీంతో దాదాపు నాలుగు దశాబ్దాల నాటిమాట ఇప్పటికి నెరవేరినట్టయింది. పూర్తిస్థాయి కార్యకలాపాలు సాగించడం కోసం ఇంకా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. విశాఖ నగరంలోని సిరిపురం జంక్షన్‌ ‌వద్దగల విఎంఆర్‌‌డిఎ డెక్‌ ‌భవనం ఆరో అంతస్తులో జోన్‌ ప్రధాన కార్యాలయాన్ని సోమవారం ఆరంభించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ‌జనరల్‌ ‌మేనేజర్‌ ‌సందీప్‌ ‌మాథుర్, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి వై.బాలాజీ కిరణ్‌, చీఫ్ పర్సనల్‌ ఆఫీసర్‌ ఎల్‌‌విఎస్‌ఎస్‌.ప్రాతుడు, ముఖ్య ఆర్థిక సలహాదారు పి.హరిప్రసాద్‌, ముఖ్య వాణిజ్య అధికారి (కోఆర్డినేషన్‌) డి.సత్యనారాయణ, ముఖ్య మెకానికల్‌ అధికారి డాక్టర్‌ అమిత్‌ ‌గుప్తా తదితరులు హాజరయ్యారు. జోన్ కార్యకలాపాల ప్రారంభం సందర్భంగా సిబ్బంది స్వీట్లు పంచిపెట్టారు. చిరకాల ఆకాంక్ష నెరవేరింది : రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇచ్చాపురం సరిహద్దు ప్రాంతమైన ఎ.ఎస్ పేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద సౌత్ కోస్ట్ రైల్వే జోన్ బోర్డును ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ... విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక పరిపాలన నేటి నుంచి ప్రారంభమైందని వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం 12 ఏళ్లుగా సాగించిన సుదీర్ఘ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజా ఉద్యమాల ఫలితమే 1990వ దశకం నుంచీ అనేక ప్రజా ఉద్యమాల ఫలితంగా జోన్‌ ‌కల సాకారమైంది. భువనేశ్వర్‌ ‌కేంద్రంగా జోన్‌ ఇప్పటివరకూ ఉండగా తాజా ప్రక్రియతో విశాఖకు మారింది. 2014 విభజన చట్టంలోనూ రైల్వేజోన్‌ హామీ ఉంది. 2017కు ముందు నుంచి ప్రధాని మోడీ రైల్వేజోన్‌ ‌విశాఖకు వస్తుందంటూ ఊరిస్తూనే వచ్చారు. ఈ ఏడాది జనవరి 8న జోన్ కు ఆయన వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. సుమారు 3501 కిలోమీటర్ల పరిధిలో 385 రైల్వేస్టేషన్‌‌లు ఈ జోన్ లో ఉంటాయి. 17 వేల మంది సిబ్బంది ఉండనున్నారు. ఏటా రూ.17300 కోట్లు ఆదాయ అంచనాతో ఈ జోన్ ఏర్పాటైంది. దేశంలో ఇది 18వ రైల్వేజోన్‌‌. దీనిపై ఈ ఏడాది మే 5న రైల్వే బోర్డు గెజిట్‌‌ను విడుదల చేస్తూ రూ.170 కోట్లకు అనుమతులిచ్చింది. ఈ జోన్‌‌ పరిధిలో విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు, విజయవాడ డివిజన్‌‌లు ఉంటాయి. అయితే అధికారికంగా రైల్వే నుంచి మీడియాకు ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా రహస్యంగా జోన్ కార్యకలాపాల ఆరంభ కార్యక్రమాన్ని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్