- యుద్ధాలు వ్యతిరేకించి శాంతిని కోరుకుందాం
- సదస్సులో అంతర్జాతీయ విశ్లేషకులు అరుణ్ కుమార్
ప్రజాశక్తి- తిరుపతి సిటి : ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకే అమెరికా యుద్ధాలకు దిగుతోందని, యుద్ధాలను ప్రోత్సహిస్తోందని అఖిల భారత శాంతి, సంఘీభావ సంస్థ (ఎఐపిఎస్‌ఒ) అంతర్జాతీయ నిపుణులు ఆర్.అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ‘అమెరికన్ సామ్రాజ్యవాద దాడులను తిప్పుకొడుతున్న క్యూబా ప్రజల పోరాటానికి సంఘీభావం తెలుపుదాం - యుద్ధం వద్దు - శాంతి ముద్దు’ అనే నినాదంతో తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సోమవారం సదస్సు జరిగింది. జన విజ్ఞాన వేదిక నాయకులు సంగా రెడ్డప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆయుధాలు అమ్ముకునేందుకే యుద్ధాలు జరుగుతున్నాయన్నది ఒక కారణం మాత్రమేనని, ప్రపంచంలోని సహజ వనరులు, ప్రపంచ మార్కెట్టు, సరుకులు రవాణా మార్గాలను తన చేతుల్లోనే ఉండాలనే ఆధిపత్యం కోసమే అమెరికా యుద్ధాలను దిగుతోందని, యుద్ధాలను ప్రేరేపిస్తోందని వివరించారు. ప్రపంచంలోని కొన్ని వ్యవస్థలను సైతం అమెరికా తన గుప్పిట్లో పెట్టుకుందన్నారు. ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచ ఫుట్‌బాల్ టోర్నీ జరుగుతోందని, దీనికి అమెరికా మెక్సికో దేశాలలో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో పాల్గొనేందుకు ఇరాన్ జట్టుకు అనేక ఆంక్షలు విధించారని, అమెరికాలో జరిగే పోటీలలో పాల్గొనాలంటే కేవలం 24 గంటలు మాత్రమే వసతి కల్పిస్తామని, జట్టు సభ్యులు మాత్రమే హాజరు కావాలంటూ రకరకాలుగా ఇరాన్ జట్టును ఒత్తిడికి గురి చేశారని తెలిపారు. దీనిపై ఫిఫా స్పందిస్తూ ఆయా దేశాల ఆంక్షలను తాము పాటించక తప్పదని చెప్పటం విడ్డూరమన్నారు. ఇదే ఫిఫా 2022లో ఇండోనేషియాలో జరిగిన టోర్నమెంటు సందర్భంగా క్యూబాపై దాడులు చేస్తున్న ఉక్రెయిన్ జట్టును ఇండోనేషియా అనుమతించకపోవడంతో, ఆ దేశాన్ని టోర్నమెంట్ నిర్వాహణ బాధ్యుల నుంచి తొలగిస్తామని హెచ్చరించి మెడలు వచ్చిందని గుర్తు చేశారు. అమెరికాకు మాత్రం చాగిలపడటం దారుణమన్నారు. క్రీడల్లోనూ ఆమెరికా ఆధిపత్య ధోరణికి ఈ సంఘటన నిదర్శనమని పేర్కొన్నారు. క్యూబా ప్రజలు శాంతికాముకులని, శాంతిని కోరుకునేవారని, ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ సమయంలో ఎనిమిది రకాల వ్యాక్సిన్లు కనిపెట్టి ప్రపంచ దేశాలకు ఉచితంగా పంపిణీ చేశారని గుర్తు చేశారు. నిపుణులైన వైద్యులను తయారు చేసి ప్రపంచ దేశాలకు ఉచితంగా వైద్యం అందించేందుకు పంపిస్తున్నారన్నారు. ఆఖరుకు తనపై దాడి చేస్తున్న అమెరికాకు సైతం వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. అలాంటి దేశంపై బాంబు దాడులు చేయడం, క్యూబా సహజ వనరులను నాశనం చేయడం, స్కూలు, ఆస్పత్రులను నేలమట్టం చేయడం, ప్రజలను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులు చేసి ప్రాణాలు బలిగొనడం శోచనీయమన్నారు. ఉక్రెయిన్, అమెరికా దాడుల వల్ల క్యూబాలో రోజుకు రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా ఉండటం లేదని, తినేందుకు ఆహారం లేదని, దాహం తీర్చుకునేందుకు తాగు నీరు దొరకడం కష్టతరంగా మారిందని, యుద్ధంలో గాయపడిన ప్రజలకు సరైన వైద్య చికిత్స అందించేందుకు కూడా సౌకర్యాలు లేక, ఆఖరుకు మత్తుమందు ఇవ్వకుండానే బాధితులకు ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. ఆస్పత్రుల్లో లిఫ్టులు పనిచేయకపోవడంతో గాయపడిన వారిని వైద్యులే భుజంపైన మూసుకుని అంతస్తుల పైకి తీసుకెళ్లి చికిత్స అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతుండడం వారి ఔదార్యాన్ని తెలియజేస్తోందన్నారు. అలాంటి దేశానికి అండగా నిలబడేందుకు భారత ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని, దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి క్యూబాకు అండగా నిలిచేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాంతిని, సమానత్వాన్ని, స్వేచ్ఛను కోరుకునే క్యూబాకు ప్రతి ఒక్కరమూ సహకరిద్దామని కోరారు. ఎఐపిఎస్‌ఒ రాష్ట్ర కన్వీనర్ ఎన్.సతీష్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచం మొత్తం భయంగా బతుకుతోందన్నారు. యుద్ధం కారణంగా ముగ్గురు భారతీయులు చనిపోతే దానిపై ప్రధాని ఖండించలేదని, భారత్‌పై అమెరికా ఆంక్షలు పెడుతున్నా స్పందన లేదని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నాడని, ఇది దారుణమని, శాంతి కోసం అందరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సదస్సులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, ఎఐపిఎస్‌ఒ జిల్లా కన్వీనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆధిపత్యం కోసమే యుద్ధాలు
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 16, 2026, 01:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)