అమెరికా : ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో నోరో వైరస్ కలకలం రేగింది. ఫోర్ట్ లాడర్డేల్ నుండి బయలుదేరిన ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్లో 100 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది నోరోవైరస్ బారినపడ్డారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గురువారం తెలిపింది. కరేబియన్ ప్రిన్సెస్ నౌకలో మొత్తం 102 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది అనారోగ్యానికి గురైనట్లు సిడిసి వెల్లడించింది. మొత్తంగా 115 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
అధికారుల చర్యలు ….
నౌకను శుభ్రపరిచడం, క్రిమిసంహారక ప్రక్రియలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. మల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణం మొత్తం సమయంలో కేసులు క్రమంగా పెరిగాయి. ఒక్కసారిగా కాకుండా దశలవారీగా ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. మొత్తం ప్రయాణికుల్లో 3 శాతానికి మించి కేసులు నమోదుకావడంతో CDC అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ నౌక ఏప్రిల్ 29న పోర్ట్ ఎవర్గ్లేడ్స్ నుండి బయలుదేరి, మే 11న పోర్ట్ కెనవెరాల్కు చేరుకోవాల్సి ఉంది. నౌకలోని 3,116 మంది ప్రయాణికులలో సుమారు 3.3 శాతం మంది, సిబ్బందిలో 1.2 శాతం మంది అనారోగ్యానికి గురయ్యారని సిడిసి తెలిపింది. ప్రయాణంలో భాగంగా ఓడ అరుబా, బొనైర్, ప్యూర్టో రికో, బహామాస్ వంటి పర్యాటక ప్రాంతాల్లో ఆగింది. ఈ సమయంలోనే ప్రయాణికుల్లో అనారోగ్య లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి.
అతిసారం, వాంతుల వ్యాప్తి ….
సిడిసి (వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం) వివరాల ప్రకారం …. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అతిసారం, వాంతుల వ్యాప్తికి నోరోవైరస్ ప్రధాన కారణం. ఇది ఇతరులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా, వైరస్‌తో కలుషితమైన ఆహారం, ద్రవాలను సేవించడం ద్వారా, అలాగే కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా వ్యాపిస్తుంది. ఉపరితలాలను క్రిమిరహితం చేయడం, తరచుగా చేతులు కడుక్కోవడం ద్వారా నోరోవైరస్ను నివారించవచ్చని సిడిసి పేర్కొంది.
నోరోవైరస్ అంటే ?
నోరోవైరస్ అనేది కడుపు, ప్రేగులకు సోకే అత్యంత అంటువ్యాధి వైరస్. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మూసి ఉన్న, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకే క్రూయిజ్ షిప్‌లలో ఇలాంటి వైరస్లు త్వరగా వ్యాపిస్తాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తి చేతులు, ఆహారం, నీరు లేదా వారు తాకిన వస్తువుల ద్వారా ఈ వైరస్ ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. బఫే ఆహారం, స్విమ్మింగ్ పూల్స్, ఎలివేటర్లు, హ్యాండ్రైల్స్ వంటి సామూహిక వినియోగ వస్తువులు వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి.
వైరస్ లక్షణాలు ….
ఈ వైరస్ సోకినవారిలో అకస్మాత్తుగా వాంతులు, నీళ్ల విరేచనాలు కనిపిస్తాయి. కడుపు నొప్పి, వికారం, తేలికపాటి జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కూడా ఉండొచ్చు. సాధారణంగా 1 నుంచి 3 రోజులలో చాలా మంది కోలుకుంటారు. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో డీహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
క్రూయిజ్ షిప్‌లలో ప్రమాదం ఎందుకు ఎక్కువ ?
క్రూయిజ్ షిప్‌లు మూసివున్న వాతావరణంలో వేలాది మంది కలిసి ప్రయాణించే ప్రదేశాలు కావడంతో వైరస్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కొంతమంది లక్షణాలు కనిపించకముందే వైరస్‌ను ఇతరులకు వ్యాపింపజేయవచ్చు. ప్రతి ఏడాది అమెరికాలో లక్షలాది మంది నోరోవైరస్ బారిన పడుతున్నప్పటికీ, క్రూయిజ్ షిప్ ఘటనలు ప్రత్యేకంగా చర్చకు వస్తుంటాయి. ఎందుకంటే ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభావితమవుతారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి CDCతో కలిసి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సెస్ క్రూయిజెస్ సంస్థ వెల్లడించింది. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడటం, అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.













