తెలంగాణ : ‘నటుడిగా అభిమానిస్తాం.. సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం కానీ.. మా రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోం` అని కెటిఆర్ హెచ్చరించారు. తెలంగాణపై ఎపి డిప్యూటి సిఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. దేశభక్తి, పోరాటాల గురించి తాము పవన్ కల్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ ఓజీ కెసిఆర్ అని స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఉదయం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడుతూ మీడియావారు వేసిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని తెలిపారు. జనసేన కొత్తగా తెలంగాణలో పోటీ చేసేది ఏముందని అన్నారు. 2023 ఎన్నికల్లో బిజెపి తో కలిసి తెలంగాణలో పవన్ పోటీ చేశారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్‌ను ఎవరూ అడ్డుకోలేదని.. ప్రజలే అడ్డుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నారని… మరి మద్రాస్ నుంచి ఆంధ్ర వేరుపడాలని పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆత్మబలిదానం చేసుకున్నారు కదా అది కూడా ప్రాంతీయ వాదం అంటారా ? అని ప్రశ్నించారు. ప్రాంతీయ వాదం అంటే తెలంగాణకి రావాల్సిన పెట్టుబడులు గుజరాత్‌లో పెట్టుకున్నారు.. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఆర్ధిక ప్రాంతీయ వాదం కరెక్టేనా ? అని నిలదీశారు. ప్రధాని మోడి కేవలం గుజరాత్‌కు పిఎంగా వ్యవహరించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని గతంలో పవన్ కల్యాణ్ అన్నారని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌కు వచ్చి సభ పెడతానంటే ఎలా ? అని ప్రశ్నించారు. దేశభక్తి గురించి పవన్ కల్యాణ్ తమకు నేర్పించాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు. ‘నటుడిగా అభిమానిస్తాం.. సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం కానీ.. మా రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోం` అని కెటిఆర్ హెచ్చరించారు. మొన్ననే అంత కష్టపడి విడిపోయాం కదా.. మళ్లీ మీ పెత్తనం ఎందుకు అని నిలదీశారు.
పెత్తనం చేస్తామంటే ఊరుకోం : పవన్ వ్యాఖ్యలపై కెటిఆర్
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 01:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)