test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్

4 గంటల క్రితం

war
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 08:49 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ముదిరిన యుద్ధ వాతావరణం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. గత ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్, ఇజ్రాయెల్‌పై నేరుగా బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగింది. అంతకుముందు లెబనాన్‌ రాజధాని బీరుట్ శివార్లలోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు మరణించగా, 20 మంది గాయపడ్డారు. బీరుట్‌పై దాడి జరిగితే ఊరుకునేది లేదని గతంలోనే హెచ్చరించిన ఇరాన్.. అందుకు ప్రతీకారంగానే ఆదివారం సాయంత్రం 3 నుంచి 4 దశల్లో సుమారు 10 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. అయితే, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ క్షిపణులను గాల్లోనే అడ్డుకోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించడమే కాకుండా, “వారం రోజుల పాటు నిరంతర దాడులకు ఇది నాంది మాత్రమే” అని హెచ్చరించింది. దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్‌) ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తీవ్రంగా స్పందిస్తూ, ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, దీనికి తగిన ప్రతిఫలం ఉంటుందని హెచ్చరించారు.

అన్నట్లుగానే, ఈ దాడి జరిగిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ ఆదివారం రాత్రే ఇరాన్‌పై  ప్రతిదాడులు ప్రారంభించింది. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని టెహ్రాన్ సమీపంలో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులు చేయడంతో ఇరాన్‌లోని పలు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఆకస్మిక పరిణామాల నేపథ్యంలో ఇరాక్, సిరియాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేయగా, ఇరాన్ సైతం టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు, ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడి ప్రతీకార దాడులకు దిగొద్దని, దౌత్య మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే బీరుట్‌పై జరిగిన దాడికి తమ అనుమతి లేదని ఒక అమెరికా అధికారి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగించిన ఈ తాజా యుద్ధ వాతావరణం కారణంగా సోమవారం ఆసియా మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్