test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలలను .. స్వేచ్ఛగా ఎదగనిద్దాం ..

1 రోజు క్రితం

బాలలను.. స్వేచ్ఛగా ఎదగనిద్దాం ..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 11:16 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

పాపం, పుణ్యం, కష్టం, సుఖం ఎరుగని బాల్యం.. తల్లిదండ్రుల సంరక్షణలో ఆనందంగా గడపాల్సిన పసిప్రాయం.. వెట్టిచాకిరి వైపు మళ్లించబడుతోంది. బడికెళ్లి పలక, బలపం పట్టాల్సిన చేతులు పలుగు, పార పట్టి బాలకార్మికులుగా మారుతున్నారు. అమ్మానాన్నలు లేకపోవడమో, ఆర్థిక ఇబ్బందులో, పొట్టకూటి కోసమో.. కారణం ఏదైనా.. ఆటపాటలతో ఆహ్లాదంగా సాగాల్సిన శైశవాన్ని చిన్నారులు కోల్పోతున్నారు. ఈ బాలకార్మిక వ్యవస్థను రూపుమాపి, భావితర బాలలను స్వేచ్ఛగా ఎదగనిద్దాం..!


అమ్మ ఒడి నుంచి నడకనేర్చిన తర్వాత పిల్లలు బడికెళ్లడం, చదువుకోవడం, ఆటలాడుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం, స్వేచ్ఛాయుత జీవనం సాగించడం వారి హక్కు. కానీ ప్రపంచంలో తలెత్తున్న భౌగోళిక ఆర్థిక పరిస్థితులు అమాయకపు చిన్నారులను బాధితులుగా మార్చుతున్నాయి. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, కరోనా లాంటి భయానక విపత్తు, అక్రమ మానవ రవాణాకు గురికావడం, అనాధలు వంటి కారణాలు బాలలను శ్రామికులుగా మార్చేస్తున్నాయి. సరైన ఆహారం, వసతి, వస్త్రాలు వంటి కనీసావసరాలు కూడా నోచుకోక, బడికి దూరమైన ప్రతి పిల్లవాడు అనివార్యంగా పనిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.


పేదరికం..
బాలకార్మిక వ్యవస్థ బలపడటానికి ప్రధానమైన కారణం పేదరికం అని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో పేదలు మరింత పేదలు కావడంతో బాలకార్మికుల సంఖ్య మరింత పెరిగిందని విశ్లేషకుల మాట. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు.. ఫలితంగా ఏర్పడిన ఆర్థిక, చమురు సంక్షోభాల వల్ల
జీవన వ్యయం భారీగా పెరిగిపోవడంతో ఇంకెంత మంది జీవితాలు రోడ్డున పడనున్నాయో అంచనా వేయలేం. పేద కుటుంబాలు పిల్లల్ని అదనపు ఆదాయం తెచ్చేవారిగా భావిస్తున్నాయి. గ్రామాల్లో పిల్లల్ని కూలి పనిలో భాగం చేస్తున్నాయి. తల్లిదండ్రులు నిరక్ష్యరాస్యులు కావడం వల్ల పిల్లల్ని తప్పనిసరిగా బడికి పంపించాలన్న అవగాహనా లోపం చిన్నారుల భవిష్యత్తును ప్రశార్థకంగా మార్చుతోంది. ప్రాథమిక విద్యను కూడా అందించలేకపోతున్నారు. పల్లెల నుంచి పట్టణాలకు వలస వచ్చిన వాళ్లు బస్తీలో చదివించడానికి ఆర్థిక స్తోమత లేక, అక్కడి జీవనశైలికి అలవాటు పడలేక తల్లిదండ్రులే చిన్నారులను పనులకు పంపుతున్న సంఘటనలూ లేకపోలేదు.


బాలలను స్వేచ్ఛగా ఎదగనిద్దాం ..

ప్రమాదాలు.. అనారోగ్యాలు..
బాలకార్మికులు ఎక్కువగా బీడీ, నేత, బాణాసంచా కర్మాగారాల్లోనూ మైనింగ్‌, లోహ పరిశ్రమలు, యంత్రాల వద్ద, అసంఘటిత రంగం, హౌటళ్లు, షాపుల్లోనూ పనిచేస్తున్నారు. లేలేత చేతులతో పుస్తకాలను మోయాల్సిన పిల్లలు ఇటుక బట్టీల్లో, భవన నిర్మాణాల్లో పెద్దపెద్ద బరువులు మోస్తూ ప్రమాదాల బారిన పడుతుంటారు. గనుల తవ్వకాల్లో పనిచేసే బాలలు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతుంటారు. ఇటు తక్కువ వేతనం, అటు భద్రత లేని జీవనం.. ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తినా సరైన వైద్యం పొందలేని దుస్థితి.

భౌతిక దాడులు..
పిల్లలతో వెట్టిచాకిరీ చేయించే జాలి లేని యజమానులు వారికి కచ్చితమైన పనిగంటలు గానీ, సెలవులు గానీ అమలు చేయకుండా మరింత దోపిడీ చేస్తున్నారు. భౌతిక దాడులకు గురైన సంఘటనలెన్నో వార్తల్లో వింటున్నాం. ముఖ్యంగా బాలికలు లైంగిక వేధింపులతో మానసికంగా వేధింపబడుతున్నారు. ప్రతి ముగ్గురు బాలకార్మికుల్లో ఇద్దరు భౌతికదాడికి గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

అక్రమ రవాణా..
పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనో, తలిదండ్రుల రక్షణ కొరవడో ఇతర కారణాలతో ఇంటి నుంచి పారిపోయిన పిల్లలను, ఒంటరిగా తిరుగుతున్నవారిని మానవ అక్రమ రవాణా ముఠాలు ఎత్తుకుపోతున్నాయి. వారిని ఆదాయ వనరులుగా మార్చేందుకు బాలకార్మికులుగా, వేశ్యవృత్తిలో, నేర ప్రవృత్తి శిక్షణలో పెంచుతున్నారు. చెడ్డ అలవాట్లకు బానిసలుగా మార్చుతున్నారు. అక్రమ రవాణాకు బాలికలు అధికంగా బాధితులవుతున్నారు. మనదేశంలో బాలలపై నేరాలకు సంబంధించి 2022లో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయంటే తీవ్రతను అర్థంచేసుకోవచ్చు.

చట్టం ఏం చెబుతోంది..
బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు 1986లోనే ‘బాల కార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం’ అందుబాటులోకి వచ్చింది. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు జాతీయ బాలకార్మిక పథకం(ఎన్‌సిఎల్‌పి) తీసుకొచ్చారు. 2016లో ఎన్‌సిఎల్‌పి యాక్ట్‌ను సవరించి ‘సర్వ శిక్షా అభియాన్‌’లో విలీనం చేశారు. ఈ చట్టం ప్రకారం 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న బాలలను ఏరకంగానూ పనిలో పెట్టకూడదు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సున్న వారిని ప్రమాదకరమైన వృత్తుల్లో నియమించకూడదు.
బాలకార్మికులను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించడం లేదా పునరావాసం కల్పించి విద్యను అందించాలని ఈ చట్టం చెబుతోంది. ప్రస్తుతం మన దేశంలో ఎంత మంది బాలకార్మికులున్నారో కచ్చితమైన సమాచారం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఐదు నుంచి 14 ఏళ్ల వయస్సున్న వారు కోటి మంది బాలకార్మికులున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బాలబాలికలు ఎనిమిదో తరగతిలోపే బడి మానేస్తున్నారు. షెడ్యూల్డ్‌ కులాల్లో 55 శాతం, షెడ్యూల్డ్‌ తెగల్లో 63 శాతం చదువుకు దూరమవుతున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ తెలిపిన లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 2020-24 మధ్య 7,069 మంది బాల కార్మికుల్ని అధికారులు గుర్తించారు. వారిని పని నుంచి విముక్తి చేశారు.


బాలలను స్వేచ్ఛగా ఎదగనిద్దాం ..

శిక్షార్హులు..
2016 చట్టాన్ని ఉల్లంఘించి 14 సంవత్సరాల లోపు బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులకు ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు జైలు శిక్షతో పాటు 20 నుంచి 50 వేల రూపాయల వరకూ జరిమాన విధిస్తారు. ఒకవేళ తల్లిదండ్రులే చిన్నారులను పనికి పంపిస్తే వారూ శిక్షార్హులే. అయితే చిన్నారుల విద్యకు ఎటువంటి ఆటంకం కలగకుండా తల్లిదండ్రులకు సహాయపడొచ్చు. భారత రాజ్యాంగంలోని 24, 39, 45వ అధికరణలు పిల్లలకు శ్రమదోపిడీ నుంచే కాకుండా ఇతర రక్షణలను కల్పిస్తున్నాయి. కానీ అవి అమలుకు నోచుకోవడం లేదు. ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం ఓ మధురానుభూతి. ఆ అనుభూతికి నోచుకోవడం లేదు బాలకార్మికులు. ఎందుకు బాధింపబడుతున్నారో.. చుట్టూ ఏం జరుగుతుందో.. ఎలా మోసపోతున్నారో కూడా తెలియకుండానే నరకయాతన అనుభవిస్తున్నారు. చిరునవ్వులు చిందించాల్సిన చిన్నారులు ఎవరైనా ఆదుకుంటారేమోనని ఆశగా ఎదురుచూస్తుంటారు. పిల్లలతో వెట్టిచాకిరీ చేయించడం ఓ నేరంగా భావించని సమాజంలో ఉన్నాం. ఈ సమస్య తీవ్రతరంగా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. నేటి బాలలే రేపటి పౌరులని మాటలతో ఊదరగొట్టకుండా ఆచరణలో పెట్టాలి. చట్టాల అమలుకు కావాల్సిన నిధులు కేటాయించాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి మధ్యాహ్న భోజనం అందేలా చూడాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం, ఆరు నుండి 14 ఏళ్ల వయస్సు గల పిల్లలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్యను అందించాలి. పౌర సమాజం కూడా బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా తమ వంతు కృషి చేయాలి.


బాల కార్మికులు

ఐఎల్ఓ

బాల కార్మికులను దోపిడీ, వెట్టిచాకిరీ నుంచి బయటకు తేవడానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) కృషి చేస్తోంది. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగమైన ఐఎల్‌ఓ 2002లో జూన్‌12ను ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది. ప్రపంచ దేశాల్లో బాలకార్మికులను నిర్మూలించే దిశగా దేశాలు కఠినమైన చట్టాలు అమలుచేసేలా కృషి చేస్తోంది. దీనిలో 187 సభ్యదేశాలు ఉన్నాయి. పేదపిల్లలకు సామాజిక రక్షణ, విద్య, సంరక్షణ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోంది.


కోడె హేమలత
9290735678


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్