test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీలో ` ఇండియా బ్లాక్’ కీలక సమావేశం

1 గంట క్రితం

Crucial India Bloc meet underway in Delhi,
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 01:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ :  ప్రతిపక్ష ‘ఇండియా’ బ్లాక్ సోమవారం న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమైంది. వామపక్ష నేతలు జాన్ బ్రిట్టాస్, దీపాంకర్ భట్టాచార్య, పి. సంతోష్ కుమార్ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ,  పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.  పశ్చిమబెంగాల్ మాజీ సిఎం, టిఎంసి అధ్యక్షురాలు మమతా బెనర్జీ తో పాటు టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా సమావేశానికి హాజరయ్యారు. శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాకరే వర్చువల్‌ విధానంలో ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇటీవల తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టివికె)తో కాంగ్రెస్ చేతులు కలిపి, డిఎంకెతో ఉన్న దీర్ఘకాల భాగస్వామ్యానికి ముగింపు పలకడంతో .. ఈ సమావేశానికి స్టాలిన్ దూరంగా ఉన్నారు. అయితే, తమిళనాడుకు చెందిన విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పి) ఎంపీ ఎన్‌కె ప్రేమచంద్రన్ ఈ భేటీకి హాజరయ్యారు.

ఇండియా బ్లాక్ సమావేశాన్ని చూసి బిజెపి భయపడుతోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కె.సి.వేణుగోపాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తనకు అటువంటి పోస్టర్లు కనిపించలేదని కొట్టిపారేశారు. బిజెపి రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొనే వ్యూహాలతో పాటు, కూటమిలోని అంతర్గత విభేదాల పరిష్కారానికి కూడా ఈ సమావేశం అత్యంత కీలకంగా మారనుంది. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి ఓటమి తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్ డి ఎఫ్)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను ఈ సమావేశంలో ఎండగడతామని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు వామపక్షాలకు బిజెపితో పొత్తు ఉందంటూ కాంగ్రెస్ అధిష్టానం వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. పరస్పర గౌరవం, విశ్వాసం లేనప్పుడు ఐక్య ఉద్యమాన్ని నిర్మించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ‘దేశాన్ని కాపాడండి, బిజెపి హటావో’ అనే ఉమ్మడి లక్ష్యంతో ఏర్పడిన ఇండియా బ్లాక్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని రాజా తెలిపారు.

కేరళ ఎన్నికల సమయంలో తమ నాయకత్వంపై జరిగిన ‘వ్యవస్థాగత ప్రచారం’పై సిపిఐ(ఎం) సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఇండియా బ్లాక్ ఐక్యతను కాపాడేందుకు ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను సమావేశానికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత నాయకుడు జైరామ్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కీలక సమావేశానికి మొత్తం 23 రాజకీయ పార్టీలు హాజరవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. పార్టీల మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే ఊహాగానాలను కొట్టిపారేస్తూ.. ఇండియా బ్లాక్ ఐక్యంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్