test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అండమాన్ జైలు

31 మే, 2026

Andaman Jail
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 31, 2026, 03:00 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

ఇటీవల మేము కొందరు మిత్రులతో కలిసి అండమాన్ యాత్ర చేసి వచ్చాము.విహారయాత్రగా బయలుదేరిన మేము దాదాపు అన్నిచోట్ల విలాసంగా ఉల్లాసంగా గడిపాము కాని ఒకే ఒక్కచోట గుండెల నిండా విషాదం అలముకోగా ఆ రోజంతా దిగులు పడిపోయాం. యాత్ర ముగించుకొని, ఎవరిళ్లకు వాళ్ళం చేరినా అక్కడ కమ్ముకున్న ఆ దిగులు మేఘాలు ఇంకా విడిచిపోవడం లేదు. మమ్మల్ని అంతలా కదిలించిన ఆ చోటు అండమాన్ రాజధాని పోర్టుబ్లెయర్ లోని సెల్యూలార్ జైలు.

‘జీవితం ఒక్కటే జైళ్లు అనేకం’ అన్న శివసాగర్ మాటలు గుర్తొచ్చాయి. ఇక్కడ జైలు ఒకటే గదులు అనేకం! జీవితాలు అనేకానేకం! ఇక్కడి కన్నీటి కథలు అసంఖ్యాకం! ఎందరు దేశభక్తుల ఎన్ని కుటుంబాలు…. ఎన్ని జీవితాలు….. ఎన్ని కలలు…. ఎన్ని ప్రేమలు …. ఎంత వియోగం…. ఎంత నిరీక్షణ….. ఎంత చీకటి…. ఎంత హింస…. ఎంత అణచివేత…. ఎన్ని భయాలు….. ఎన్ని మరణాలు….. ఆ స్వాతంత్ర సమరయోధులు తలపుకు రాగానే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దుఃఖంతో గుండె బరువెక్కుతుంది.
అసలు ఈ జైలు అనేది నాగరికత సాధించిన ఏ అభివృద్ధికి ప్రతీకో అర్థం కాదు. అంత వికృత రూపం మాకు అక్కడ ప్రత్యక్షమైంది! ఈ జైలు లేదా కారాగారాన్ని కనిపెట్టిన మహానుభావుడు ఎవడో…!? ఆదిమానవుడు నాగరికత సాధించే క్రమంలో తొలినాళ్లలో బహుశా వేటాడిన పక్షులను, జంతువులను తాత్కాలికంగా ఉంచడం కోసం (ఆహారంగా మారేవరకు) తయారుచేసిన బోనుల వంటివి తర్వాత కాలంలో తోటి మానవుని బంధించే బంధిఖానాలుగా ఎలా మారాయో అర్థం చేసుకోవలసి ఉంది! ప్రాచీనకాలంలో సాధారణంగా బహిష్కరణ, బానిసత్వం, మరణ దండన మాత్రమే శిక్షలుగా ఉండేవి. కానీ ఆధునిక నాగరికతలు రూపుదిద్దుకొనే క్రమంలో నేర స్వభావం తీవ్రమయ్యే కొద్దీ నేరస్తులను సంఘానికి దూరంగా ఉంచడం సమాజానికి అవసరమైంది! ముఖ్యంగా 1779 బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన పెనిటెన్షియరీ చట్టం ప్రకారం ‘ఏకాంత నిర్బంధం’ అనేది కఠిన శిక్షగా ప్రపంచానికి మార్గదర్శకమైందని చెప్పవచ్చు.

Andaman Jail


సృష్టిలోని ఏ ప్రాణికైనా స్వేచ్ఛ ఊపిరిలాంటిది. స్వేచ్ఛ లేకుంటే శ్వాస అందనట్లు విలవిలలాడిపోతుంది ఏ జీవి ఐనా! మరి అన్నివిధాలా పరిణితి చెందిన మనిషికి స్వేచ్ఛే కదా ప్రాణం! అటువంటి అమూల్యమైన స్వేచ్ఛని పోగొట్టుకొని తమ సొంత నేలనీ, కుటుంబాలనీ, బంధాలనీ, తమదైన సంఘాన్నీ విడిచి కఠోర శిక్షలలో మగ్గిపోయిన వందలాది వీరుల కన్నీటి కథలకు సజీవ సాక్ష్యమైన సెల్లులార్ జైలు చూడగానే మేము చలించిపోయాం! ఏకాంతవాస శిక్షతోపాటు వారికి విధించిన కఠోర శిక్షా సాక్ష్యాలు (ఫోటోలు, శిల్పాలు) మొదలగునవి చూసేకొద్దీ బాధతో, భయంతో రక్తం గడ్డకట్టినట్టయింది. దేశానికి స్వేచ్ఛా వాయువుల్ని కాంక్షించిన దేశభక్తుల్ని కొండకోనలు, సముద్రాలు దాటించి, వేల మైళ్ళ దూరానికి తరలించిన వలస పాలకులు ఎంత కర్కశులో కదా! కోట లాంటి జైలు నిర్మించి పశువుల్ని బంధించినట్లు గాలి వెలుతురు చొరబడని ఆ గదులలో ఇనుప సంకెళ్లు బిగించి, అంతటి ఇరుకు గదుల్లో సైతం అటు ఇటు కదలకుండా కాళ్లు చేతులకు, మెడలకు ఇనుప సంకెళ్లు వేసి గోడల కొక్కాలకు బిగించిన ఆనవాళ్ళు ఎక్కడికక్కడ కనిపిస్తుంటాయి! వారిపై జరిగిన హింసకు దాష్టీకాలకు మౌనసాక్ష్యాలుగా ఆ గోడలకు ఇప్పటికీ వేలాడుతున్న ఇనుప కొక్కాలు, గొలుసులు మన మనసులను ద్రవింప చేస్తాయి.
అసలు ఎందుకు అంత దూరం!?…. అంటే వారు మళ్లీ దేశ స్వాతంత్రం కోసం గొంతు ఎత్తకుండా! అలాగే వారి బాట మరెవరూ పట్టకుండా భయభ్రాంతులకు గురి చేయడం కోసం! అదీగాక వందలాది మందిని అంత దూరం తరలించటం వెనుక ఒకానొక సాంఘిక దురాచార కుట్ర కోణం కూడా ఉంది! ఆ రోజులలో ఆ సముద్ర జలం(కాలాపానీ) లో విదేశీ ప్రయాణం చేయడం అంటే కులాన్ని కోల్పోవడమే! అంటే సాంఘిక బహిష్కారానికి గురికావడం అన్నమాట!
స్వాతంత్ర్య పోరాటం తీవ్రమయ్యేకొద్దీ 19వ శతాబ్దం చివరినాటికి కఠిన కారాగార శిక్షలు విధించడానికి వీలుగా ఈ భారీ జైలు నిర్మాణం అవసరమైంది. దీని నిర్మాణశైలిని పరిశీలిస్తే సాధారణంగా మనం చూసే బ్రిటిష్ కాలం నాటి రాతి కట్టడాలకు భిన్నంగా ఇక్కడ ఇటుకలతో కట్టిన భారీ నిర్మాణాలను చూస్తాం! ఆ ఇటుకలను బర్మా నుండి తెప్పించారట! మధ్యలో ఒక టూంబ్, దానిచుట్టూ కిరణాల మాదిరి ఏడు రెక్కలు, ప్రాంగణం అన్ని మూలల్ని డేగ కళ్ళతో కాయటానికి వీలుగా ఒక పెద్ద టవర్! అన్నీ ఒంటరి సెల్స్! ఏ ఖైదీ కూడా మరపక్క ఖైదీతో మాట్లాడటానికి వీలు లేకుండా, ఖైదీల మధ్య ఏ విధమైన కమ్యూనికేషన్ కు తావు లేకుండా….! అంతా ఏకాంత నిర్బంధం!! 1896 నుండి 1906 వరకు సుమారు 10 ఏళ్ల పాటు 696 గదులతో మూడు అంతస్తులుగా ఈ భారీ నిర్మాణం జరిగింది! ఇందులో 795 మంది స్వాతంత్ర సమరయోధులను ఇక్కడ బంధించారు. వీరిలో 238 మంది తప్పించుకుని, తిరిగి పట్టుబడ్డారు. వారిలో 87 మందిని ఉరితీశారు.
అంతులేని హింసకు ప్రతీకగా నిలిచిన ఈ సెల్యులార్ జైలుకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన కృషి ఫలితంగా 1939లో జైలు ఖాళీ చేయడం జరిగింది. 1941లో భూకంప తాకిడికి గురైంది. 1942లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ దండయాత్రలో రెండు రెక్కలు శిథిలమయ్యాయి. అదే సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఇక్కడ మొదటిసారిగా మన జాతీయ జెండా రెపరెపలాడింది! అటు తర్వాత అనతి కాలంలోనే స్వతంత్ర పోరాటం తీవ్రమై 1947లో దేశానికి స్వాతంత్రం సిద్ధించాక స్థానిక అవసరాల కోసం మరో రెండు రెక్కలను కూల్చి వేశారు. ప్రస్తుతం 1,6,7 రెక్కలు మాత్రం ఘనీభవించిన కన్నీటి సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి !

Andaman Jail


నింగిలోకి కోరలు చాచిన ఈ భారీ జైలు గోడల మధ్య భారంగా మా అడుగులు పడుతుంటే రకరకాల ఆలోచనలు…. మనసంతా కలవరపెడుతూ…. ఇక్కడ ఈ రాకాసికారాగార కోరలకు చిక్కి…. మాతృభూమికి ఇన్ని వేల మైళ్ళ దూరాన…. ఎందరు త్యాగధనుల ఎన్ని కలలు ఈ కడలి పాలైనవో కదా! తిరిగి స్వేచ్ఛా ప్రపంచంలోకి వస్తామన్న ఆశలు అడుగంటి ఎన్ని జీవితాలు శుష్కమై, కృంగి కృశించి ఈ మట్టిలో కలిసిపోయాయో కదా! ఎందరి శరీరాలు ఇక్కడ ఇనుప గొలుసులలో నలిగి, రక్తంతో ఒరిసి ఒరిగిపోయాయో కదా! సంవత్సరాల తరబడి ఋతువులు ఎరగకుండానే ఎన్ని బతుకులు చితికిపోయాయో కదా! ఎంత కన్నీటి వెన్నెల ఈ రాతిపొరల్లో ఒలికి సాగర అలల్లో కలిసిపోయిందో కదా! ఎంత ఒంటరి వర్షం ఓదార్పు నెరుగక దుఃఖ ధారలు కట్టి, ఈ ఇసుక మేటల్లో ఇంకిపోయిందో కదా!
ఆ వీరులంతా కన్న కలల్ని ఇక్కడి చెట్ల గాలి ఇంకా మోసుకుంటూ తిరుగుతున్నట్లనిపిస్తుంది! వారి రుధిర అశ్రు స్వేద ధారలతో పునీతమైన ఈ నేల నుండి మొలిచిన గరికపై మన పాదాలు తగిలినప్పుడల్లా ఒక దివ్య స్పర్శ ఏదో మనలను తాకినట్టై మన అడుగులు మందగిస్తాయి! ముందుకు నడవ బుద్ధి కాదు! తలెత్తి ఆకాశంలోకి కోరలు చాచిన ఆ ఎత్తైన కట్టడాల్ని చూసినప్పుడు తలల్ని పైకెత్తకుండా ఆ వీరుల మెడలకు, మెడల నుండి కాళ్లకు తొడిగిన ఇనుప గొలుసులు గుర్తొచ్చి మనిషిలో దాగిన ఆ దానవుడ్ని తలచి సిగ్గుతో భీతిల్లిన మన మనిషితత్వం నేలలోకి కుంచించుకుపోతుంది !
ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు అన్నట్లు అలాంటి ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం కదా! మరి అలా లభ్యమైన అంతటి అమూల్యమైన స్వేచ్ఛని ఎంత భద్రంగా పవిత్రంగా కాపాడుకోవాలి!? ఆ మహనీయులు అందించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఈనాడు మనం ఎంతవరకు అనుభవిస్తున్నాం!? మన ఈనాటి ఈ స్వేచ్ఛ ఆనాడు వారు కోరుకున్నదేనా!? పాలకులు, ప్రజలు అయిన మనమందరం ప్రశ్నించుకోవాలి! ఆత్మవిమర్శ చేసుకోవాలి!!

బి.జె.పి.పుష్పరాజు
9491175348


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్