ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఉరుకులు, పరుగులతో జీవితాన్ని గడుపుతున్నారు. ఒత్తిడితో కూడుకున్న జీవితాలను అనుభవిస్తున్నారు. ఈ ఒత్తిడి రక్తపోటును ప్రభావితం చేస్తుంది. శుద్ధి అయిన రక్తం గుండె నుంచి శరీర భాగాలకు, ధమనుల ద్వారా సరఫరా అవుతుంది. రక్తం రక్తనాళాల్లో ప్రవహించేటప్పుడు వాటి గోడలపై కలిగించే ఒత్తిడిని రక్తపీడనం (బిపి-బ్లడ్ ప్రెజర్) అంటారు. ఈ సరఫరా మామూలు కంటే అధిక వేగంగా ఉంటే అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) లేదా అధిక రక్తపీడనం (హై బిపి) అంటారు. దీనిపట్ల అవగాహన అవసరం. అలాగే దీని లక్షణాలు, కారణాలు, నివారణ గురించి తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది దాదాపు శరీరంలోని ప్రతి భాగాన్నీ ప్రభావితం చేస్తుంది. మన శరీర భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే అతిముఖ్యమైన ద్రావకం రక్తం. గుండె సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది. మన గుండె పని చేయాలి కానీ ప్రయాసపడుతూ పని చేయకూడదు. ఈ రక్తపోటు అనేది గుండె ఎంత కష్టపడి పని చేస్తోందో అనేదాన్ని సూచిస్తుంది. మన రక్తనాళాల్లో రక్తం వేగంగా పరుగులు తీస్తూ, అలల మాదిరిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ప్రవహిస్తున్నప్పుడు రక్తం రక్తనాళాల గోడల మీద ఒత్తిడి పెడుతుంది. గుండెకు దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండి, దూరం వెళ్తున్న కొద్దీ క్రమేపీ తగ్గి, కేశనాళికల దగ్గర నెమ్మదిగా ప్రవహిస్తుంది.. ఇక చివరికి సిరలలో ప్రవేశించి, అక్కడ పూర్తిగా తన వేగాన్ని తగ్గించుకొని, నెమ్మదిగా కండరాల సహాయంతో మళ్ళీ గుండెకు చేరుకుంటుంది. అయితే రక్తం ప్రవహించేటప్పుడు శరీరం అంతటా ఒకటే వేగం ఉండాలి. ఇలా హెచ్చుతగ్గులు కలిగినప్పుడు శరీరం అంతటా ఒకటే పోటు ఉండదు.
అనారోగ్యకరమైన జీవనశైలి
ఈ రక్తపోటు ఉన్నప్పుడు ధమనులలో ఉన్న ఒత్తిడిని కొలుస్తారు. ఈ ఒత్తిడిని పీడనం అని కూడా అంటారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపోటు 120/80 ఉంటుంది. ఈ విలువ 135/85 దాటితే, ఆ వ్యక్తి అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడని అర్థం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అకాలమరణాలకి అధిక రక్తపోటు ప్రధానకారణం అవుతోంది. దీనికి స్పష్టమైన ఎలాంటి లక్షణాలూ లేవు. అనారోగ్యకరమైన జీవనశైలి అధిక రక్తపోటుకు దారితీస్తుంది. సాధారణంగా ఎక్కువ ఉప్పు తినడం, అధిక బరువును కలిగి ఉండడం, తగినంత వ్యాయామం చేయకపోవడం, ఒక విషయాన్ని పదే పదే ఆలోచించడం, పొగాకు వాడటం వంటి వాటివల్ల కూడా రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. ముందస్తు నివారణ పద్ధతులు తెలుసుకోవడం వల్ల అకాల మరణాల నుండి తప్పించుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య..
WHO ప్రకారం ప్రపంచంలో 30-79 సంవత్సరాల వయస్సు గల దాదాపు 130 కోట్ల మంది ప్రజలు అధిక బీపీతో బాధపడుతున్నారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, కనీసం ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి వారి రక్తపోటును తనిఖీ చేయించుకోవాలి. రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు కనీసం నెలకు ఒక్కసారైనా చెకింగ్ చేయించుకోవాలి. ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు వైద్యపరంగా ధృవీకరించబడిన డిజిటల్ రక్తపోటు మానిటర్‌ను ఉపయోగించి, ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చికిత్స ప్రభావాన్ని, జీవనశైలి మార్పుల్ని ట్రాక్ చేయడంలో సాయపడుతుంది. ఇండియా కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం.. మన దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ ఉంది. కేవలం 10 శాతం మంది రోగులకు మాత్రమే వారి రక్తపోటు నియంత్రణలో ఉంది. బీపీ ఉన్న వారు పోషకాలున్న మంచి ఆహారం తీసుకోవాలని సూచించింది. యువత కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపింది. ఆరోగ్యవంతుని సాధారణ రక్తపీడనం (BP) 120/80 ఉండాలి. ఇది 140/90 కంటే ఎక్కువైతే అధిక రక్తపోటు గాను, 90/60 కంటే తక్కువైతే అల్ప రక్తపోటు (హైపోటెన్షన్) (లోబిపి) గాను పేర్కొంటారు. ఈ రెండు ప్రమాదకరమైనవే. రక్తపోటు నుండి బయటపడటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.
కారణాలు..
అధిక రక్తపోటుకు కారణం రక్తపోటును పెంచడానికి కలిసి పనిచేసే జన్యు, పర్యావరణ (జీవనశైలి) కారకాల వల్ల కావచ్చు.
కొన్ని ఇతర అంశాలు:
• అధిక బరువు లేదా ఊబకాయం
• శారీరక శ్రమ లేకపోవడం
• ఉప్పు ఎక్కువగా తీసుకోవడం
• అధికంగా మద్యం సేవించడం
• ధూమపానం
• ఒత్తిడి, అందోళనకు గురికావడం
• అడ్రినల్, థైరాయిడ్ వ్యాధి రుగ్మతలను కలిగి ఉండడం
• స్లీప్ అప్నియా వంటి సమస్యల ద్వారా రక్తపోటు సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.
ప్రభావాలు..
రక్తపోటు అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మన గుండె ఎంత కష్టపడి పనిచేస్తుందన్నది రక్తపోటు సూచిస్తుంది. రక్తపోటు అనేది రోగం కాదు.. ఒక రోగ లక్షణం. ఈ సమస్యను వైద్యులు సైలెంట్ కిల్లర్ అని కూడా అభివర్ణిస్తారు. ఈ సమస్య వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడులోని రక్తనాళాలు సున్నితత్వాన్ని కోల్పోయి, చిట్లిపోయి బ్రెయిన్ స్ట్రోక్ కు గురై, పక్షవాతం బారినపడే అవకాశం కూడా ఉంటుంది. అధిక రక్తపోటు వల్ల కిడ్నీలలో ఉన్న రక్తనాళాలు దెబ్బతిని కిడ్నీ ఫెయ్యిలర్, కళ్ళలో ఉన్న రక్తనాళాలు దెబ్బతిని, కంటిచూపు పోయే ప్రమాదం ఉంది. దీనిని హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
ఏయే వయస్సుల వారిపై ప్రభావం చూపుతుందంటే...
కొందరు ఏ కారణం లేకుండానే హైపర్‌టెన్షన్ బారిన పడుతున్నారు. దీని బారిన పడిన చాలామందికి కారణాలే తెలియడం లేదు. కొందరిలో 20 ఏళ్లు దాటిన వారిలోనూ వంశపారంపర్యంగా కూడా హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశముంది. పరీక్షలు చేస్తేగానీ రక్తపోటు ఉందనేది నిర్దారణ కాదు. మారిన జీవనశైలి, శ్రమ, పని ఒత్తిడి కారణంగా ప్రస్తుతం కొందరికి యుక్త వయస్సులోనే హైపర్‌టెన్షన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. 20 నుంచి 30 ఏళ్ల వయస్సు వారిలో ఐదు శాతం, 30 నుంచి 40 ఏళ్ల వారిలో 10 శాతం, 40 నుంచి 50 ఏళ్ల వయస్సు వారిలో ఐదు శాతం, 50 నుంచి 60 ఏళ్ల వారిలో 15 శాతం మంది హైపర్ టెన్షన్ తో ఇబ్బంది పడుతున్నారు.. ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒక యువతకి ఉండే అవకాశం ఉంది.
హైబీపీలో ముఖ్యమైన రకాలు..
ఎసెన్షియల్ హైపర్ టెన్షన్: ఈ రకమైన హైపర్‌టెన్షన్‌కు కచ్చితమైన కారణాలు ఉండవు.
సెకండరీ హైపర్‌టెన్షన్: వివిధ రకాల కారణాలతో వచ్చే అధిక రక్తపోటును సెకండరీ హైపర్‌టెన్షన్ అని అంటారు.
గర్భస్థ రక్తపోటు (Gestational Hypertension): ఇది గర్భిణీ స్త్రీలను మాత్రమే ప్రభావితం చేసే పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రసూతి మరణాలు, పిండ లోపాల వంటి ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ప్రీఎక్లంప్సియా నిర్ధారణతో లేదా లేకుండా కూడా సంభవించవచ్చు.
వైట్ కోట్ హైపర్ టెన్షన్ (White Coat Hypertension): దీనినే ఐసోలేటెడ్ క్లినిక్ హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. అంబులేటరీ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ ఉపయోగించి దీనిని నిర్ధారిస్తారు. పెద్దవారి కంటే యువకుల్లోనే ఈ హైపర్‌టెన్షన్ ప్రమాదం ఎక్కువ.
రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ (Resistant Hypertension): ఏదైనా చికిత్స చేసినా పేషంట్ రక్తపోటును నియంత్రించడంలో విఫలమైనప్పుడు దానిని రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అని నిర్ధారిస్తారు. హైబీపీ ఉన్న 10% మంది పేషంట్స్ లో ఈ రకమైన రక్తపోటు ఉండవచ్చు. హృదయ సంబంధ వ్యాధులు, అవయవ వైఫల్యం వంటి పరిస్థితుల్లో ఈ రకమైన హైబీపీ ఉంటుంది.
లక్షణాలు
రక్తపోటు ఉన్న వారికి ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ అది తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు:
• తలనొప్పి
• విపరీతమైన అలసట
• కళ్ళు తిరగడం
• చూపు మందగించడం
• నిద్రలేమి
• మతిమరుపు
• చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం
• ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
• ఛాతీలో నొప్పి
• గుండె దడ
• గందరగోళం, తికమక పడడం
• మెడనొప్పి
• త్వరగా అలసిపోవడం
• జీర్ణవ్యవస్థలో సమస్యలు వంటివి కూడా కనిపిస్తాయి.
కొన్నిసార్లు గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, కంటి జబ్బులు, మెదడు సంబంధ రక్తనాళాల జబ్బులు, పక్షవాతం, గుండె రక్తనాళాల జబ్బులు, విపరీతమైన తలనొప్పులు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
టెస్టు చేసేప్పుడు జాగ్రత్తలు..
• రక్తపోటు పరీక్ష చేయించుకునే గంట ముందు ధూమపానం, వ్యాయామం చేసి ఉండకూడదు.
• కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నాక పరీక్ష చేయాలి.
• పరీక్ష చేసే సమయంలో బీపీ చూసే మెషీన్ కన్నా ఆ వ్యక్తి గుండె ఎత్తులో ఉండాలి.
• ఆ వ్యక్తి పాదాలు పూర్తిగా నేల మీద ఉండాలి.
• వెనక ఆసరా ఉండాలి. చెయ్యి ఎక్కడైనా ఆసరాతో పెట్టి ఉండాలి.
• బీపీ చూసే సమయంలో కదలకుండా, మాట్లాడకుండా ఉండాలి.
• మందుల వాడకాన్ని ఒకరోజు కూడా నిలిపేయొద్దు.
• ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడకం మార్చుకోవాలి.
• షుగర్, గుండె, థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి.
• కారం, ఉప్పు వాడకం చాలా వరకు తగ్గించాలి.
రక్తపోటు లక్షణాలను ముందుగానే గుర్తించి, సరైన సమయంలో వైద్యుణ్ణి సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకున్నట్లైతే, ఈ సమస్య తీవ్రతరం కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే, కొన్నిసార్లు చికిత్సలో నిర్లక్ష్యం వహించినట్లు అయితే దీర్ఘకాలిక, ప్రాణాంతక సమస్యలకు సైతం దారి తీయవచ్చు.
డాక్టర్ వి. మధుసూదనరావు
ఆరోగ్యశాఖాధికారి,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దేవపూడి,
ముదినేపల్లి మండలం, ఏలూరు జిల్లా.
9550768724
సంభాషణ : యడవల్లి శ్రీనివాసరావు








కామెంట్‌లు (0)