test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionటైం లేదు .. టెంపరేచరు పెరుగుతోంది..

31 మే, 2026

There is no time... the temperature is rising.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 31, 2026, 02:40 అపరాహ్నం | 9 నిమిషాల చదవడం

వాతావరణ పరిరక్షణ చర్యలు అంటే కేవలం కర్బన ఉద్గారాలు తగ్గించడం, అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రభుత్వ విధానాలు మాత్రమే కాదు. అది సాధారణ ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, జీవన విధానం, ఆహార భద్రత, నీటి వనరులు, ఉపాధి వంటి అనేక అంశాలను ప్రభావితం చేసే అత్యవసర సామాజిక చర్య. ప్రపంచ వ్యాప్తంగా వేడెక్కుతున్న భూమి ప్రభావం ఇప్పుడు శాస్త్రవేత్తల హెచ్చరికల్లో మాత్రమే కాదు.. సామాన్య ప్రజల రోజువారీ జీవితాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.


ఎండలకు మాడిపోతున్న బతుకులు..
ప్రతి వేసవికి మామిడిపళ్ల వ్యాపారం చేసుకునే 67 ఏళ్ల సుబ్బాయమ్మ ఈ ఏడాది ఎండల గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. “నా వయసు 67. యాభై ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నా. రెండేళ్ల నుండి ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ఒళ్లంతా మంటగా ఉంటుంది. నీళ్లు తాగుతున్నా గొంతెండి పోతోంది. అర్ధరాత్రుళ్లు ఊపిరి ఆడడం లేదు” అంటోంది. సుబ్బాయమ్మ మాటల్లో కేవలం వేసవి వేడి మాత్రమే కాదు.. వాతావరణ మార్పులు మానవ శరీరంపై చూపుతున్న తీవ్ర ప్రభావం కూడా వెల్లడవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ​
ఆర్థికంగా ప్రభావం చూపిస్తోంది..
ఉదయం ఏడు గంటలకే ఆటో తీసుకుని రోడ్డు మీదకు వచ్చే వాసు జీవితం కూడా ఎండలతో అతలాకుతలమవుతోంది.
“రోజంతా కష్టపడితే ఆటో అద్దె పోనూ రూ.500–600 కూడా మిగలవు. మధ్యాహ్నం 12 గంటలకే సీటు కాలిపోతోంది. పైన ఎండ.. కింద మంట.. డ్రైవింగ్ చేయలేక ఇంటికి వెళ్లిపోతున్నా” అంటున్నాడు. వాసు బాధలో వాతావరణ మార్పు సామాన్యుడి ఆర్థిక పరిస్థితిని ఎలా దెబ్బతీస్తోందో స్పష్టంగా కనిపిస్తోంది. ఆటోడ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, డెలివరీ బాయ్స్ వంటి బహిరంగ వాతావరణంలో పనిచేసే లక్షలాది మంది ప్రజల పనిగంటలు వాతావరణ మార్పుల వల్ల తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఆదాయం పడిపోతోంది. ​


కాలాలు మారిపోయాయి..
తాడేపల్లి సమీపంలోని పసుపు తోటల్లో పనిచేసే రజని కూడా ప్రకృతిలో వస్తున్న మార్పులను గమనిస్తోంది. “ఇంతకు ముందు ఇలా లేదు. కాలాలు మారిపోయాయి. ఎండాకాలంలో వానలు పడుతున్నాయి.
వానాకాలంలో ఎండలు మండుతున్నాయి. శీతాకాలంలో చల్లదనం ఉండడం లేదు” అని ఆందోళన వ్యక్తం చేస్తోంది. రజని మాటల్లో రైతాంగం ఎదుర్కొంటున్న గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. అకాల వర్షాలు, ఉష్ణోగ్రతల మార్పులు, నీటి కొరత, పంటల దిగుబడిలో అనిశ్చితి వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో సగానికి పైగా వ్యవసాయం వర్షాధారంగా ఉండటంతో వాతావరణ మార్పుల ప్రభావం నేరుగా ఆహార ఉత్పత్తిపై పడుతోంది. ​ రాష్ట్ర వ్యవసాయ రంగం అయోమయంగా మారుతున్న భౌగోళిక పరిస్థితుల వల్ల కోనసీమ జిల్లా రాజోలు ఉప్పునీటి ప్రభావానికి గురవుతోందని ఇటీవల వార్తల్లో వచ్చింది. ఉప్పు నీటి ఊటల వల్ల వేల ఎకరాల్లో కొబ్బరిచెట్లు చనిపోయాయి. 20 వేల ఎకరాల్లో సరుగుడు, వరి చేలు ప్రమాదంలో పడ్డాయి. అకాల వర్షాలకు దెబ్బతింటున్న పంటల వివరాలు ఆందోళన తెప్పిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర యంత్రాంగం వ్యవసాయరంగ బలోపేత చర్యలకు పూనుకోవడం లేదు. గూగుల్ సెంటర్లను, క్వాంటమ్ కేంద్రాలను నిర్మిస్తామంటూ నేల విడిచి సాము లెక్కలు చెబుతోంది. ​


హిమాలయాల హెచ్చరిక..
పర్యావరణ మార్పుల ప్రభావం కేవలం దక్షిణాది ఎండల్లోనే కాదు.. హిమాలయ ప్రాంతాల్లోనూ తీవ్రంగా కనిపిస్తోంది. హిందూ కుష్ హిమాలయాల్లో మంచు నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఒకప్పుడు సెలయేళ్లతో నిండిన లోయల్లో ఇప్పుడు తాగునీటి కొరత కనిపిస్తోంది. నదులు, మంచినీటితో ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో ప్రజలు ఇప్పుడు సీసాల నీరు కొనుగోలు చేస్తున్నారు. హిమనీనదాల కరుగుదల భవిష్యత్తులో తాగునీటి సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2025 నవంబరు నుండి 2026 మార్చి మధ్య హిందూ కుష్ హిమాలయాల్లో మంచు దీర్ఘకాల సగటు కంటే 28 శాతం తగ్గింది. ఈ ప్రభావంతో కాశ్మీర్లో వరుసగా ఏళ్లతరబడి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. శీతకాలం ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మంచు వర్షంగా మారుతోంది. దీనివల్ల పండ్ల తోటలు, తాగునీటి సరఫరాకు ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిస్థితికి అద్దం పట్టేలా ఆ ప్రాంతంలో నివసిస్తున్న మహ్మద్ అష్రఫ్ మీర్ దినచర్య ఒకప్పటిలా ఇప్పుడు లేదు. దాని గురించి అతను ఇలా అంటున్నాడు. ‘‘ఇంతకు ముందు ఉదయం వేళ పండ్ల తోటల్లో పనిచేసేవాడ్ని. కానీ ఇప్పుడు అదే సమయంలో నీళ్ల కోసం వెతుకుతున్నాను’’ అంటున్న 35 ఏళ్ల మీర్ కాశ్మీర్ లోని యాపిల్ పట్టణంగా ప్రసిద్ధి చెందిన సోపోర్ కు చెందినవాడు. ఆ ప్రాంతం ఒకప్పుడు సెలయేళ్లతో నిండిన లోయ. కానీ ఇప్పుడు మీర్ ఇంట్లో కుళాయిలో నెలల తరబడి నీరు రావడం లేదు. నదులు, కరిగిన మంచుతో కప్పబడిన ఆ లోయలో ఇప్పుడు ప్రజలు సీసాల నీటిని కొనుగోలు చేస్తున్నారు.


There is no time... the temperature is rising.

వేడెక్కుతున్న భూమి.. వణుకుతున్న జీవితం..
ఉదయం ఎనిమిది గంటలకే భగ్గుమంటున్న ఎండ. రాత్రిళ్లు ఉక్కపోతతో నిద్రలేని పరిస్థితి. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడదెబ్బ హెచ్చరికలతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని సూచనలు జారీ అవుతున్నాయి. వడదెబ్బలు, శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. తీవ్రమైన వాతావరణ మార్పులతో గతేడాది మన రాష్ట్రంలో అధికారిక గణాంకాల ప్రకారం 100కు పైగా మరణాలు సంభవించాయి. ఇటీవల హోం శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్ సి ఆర్ బి) నివేదికలో తెలంగాణలో 2024లో వడదెబ్బ కారణంగా 116 మరణాలు సంభవించాయని పేర్కొంది. దేశంలో ఈ సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ ఉంది. నివేదిక ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 804 ఉన్న మరణాలు 2024 నాటికి 1,832కు పెరిగాయి. దీర్ఘకాలిక ప్రభావాల్లో అంటే 2001 నుండి 2019 మధ్య కాలంలో దేశంలో దాదాపు 19,693 మంది వడదెబ్బ వల్ల ప్రాణాలు కోల్పోయారు.

ఉన్నట్లుండి మారిపోతున్న వాతావరణం..
ఒకపక్క ఎండలు మండిపోతున్న వేళ.. మరో పక్క పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. మే 12న ఉత్తరప్రదేశ్‌లో ఒక్కసారిగా వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. అప్పటివరకు భగ్గుమన్న ఎండ క్షణాల్లోనే బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు, పిడుగులతో బీభత్సంగా మారింది. కేవలం కొన్ని గంటల పాటు మారిన ఈ వాతావరణానికి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ వృక్షాలు నేలకొరిగాయి. గాలికి మనుషులు ఎగిరిపోతున్న దృశ్యాలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ప్రకృతి ఇస్తున్న ఈ హెచ్చరికలు వాతావరణ మార్పుల తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇటీవల సంభవించిన ఈదురు గాలులు దేశంలో ఇటీవల అనేక ప్రాంతాల్లో గంటకు 90 కిలోమీటర్లకు మించిన వేడి గాలులు వీచాయి. ఈ వేగం సముద్రంపై ఏర్పడే ‘తీవ్ర తుపాను` వేగంతో సమానం. మే 8న బీహార్ లోని పాట్నాలో గంటకు 135 కిలోమీటర్లకు మించిన గాలులు వీచాయి. మే 11న జారీ చేసిన నివేదికలో దేశం చుట్టుపక్కల సముద్రాలపై ఒక అల్పపీడన ప్రాంతం, నాలుగు అల్ప పీడన ద్రోణులు, నాలుగు తుపాను వలయాలు ఆవరించి ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు రాకను కూడా తెలియజేశారు. నివేదిక వెలువరించిన గణాంకాలను బట్టి మే మొదటి వారంలో దేశం మొత్తం మీద 79 శాతం వర్షపాతం నమోదైంది. మధ్య ప్రాంతంలో అత్యధికంగా 226 శాతం అదనపు వర్షపాతం నమోదుకాగా, వాయువ్యంలో 161 శాతం నమోదైంది. అంతకు ముందు మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా ఉరుములు, వడగళ్ల వానలు, వడగాలులు, తేమతో కూడిన ఉష్ణోగ్రతలు, అదనపు వర్షపాతాలు నయోదయ్యాయి. తీవ్ర వాయు కాలుష్యంలో ఢిల్లీ గాలిలో ప్రమాణాలకు మించి, ప్రమాదకరమైన విషవాయువులు ఢిల్లీని కమ్మేస్తున్నాయి. తీవ్ర వాయుకాలుష్యంతో, యాంటీబయాటిక్‌ మందులకు లొంగని సూపర్‌బగ్స్‌తో.. ప్రమాదకరమైన గ్యాస్‌ చాంబర్‌లా ఢిల్లీ మారిపోతోంది. ఆస్తమా, న్యూమోనియా వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ వాతావరణం నరకం చూపిస్తోంది. గొంతు మంట, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ అనుభవాలన్నీ దేశంలో పర్యావరణ సంక్షోభానికి అద్దం పట్టే కొన్ని ఉదాహరణలు మాత్రమే. పర్యావరణ వేత్తలు ఆందోళన చెందే రీతిలో దేశంలో పరిస్థితులు ఉన్నాయి. నిపుణులు, శాస్త్రవేత్తలు పర్యావరణంపై వివరించిన ఈ వాస్తవాలు విస్తుపోయేలా ఉన్నాయి. ​ పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న గ్రీన్హౌస్ వాయువులు, ఎల్ నినో ప్రభావం, సముద్రాలు వేడెక్కడం, నగరీకరణ, చెట్ల కొరత, సిమెంట్ నిర్మాణాల విస్తరణ వంటి అంశాలు భూమి ఉష్ణోగ్రతలను మరింత పెంచుతున్నాయని చెబుతున్నారు.

There is no time... the temperature is rising.

ఎందుకిలా జరుగుతోంది..?
ఒకవైపు భగ్గుమనే ఎండలు, మరోవైపు భారీ వర్షాలు కనిపించడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను నిపుణులు ఇలా వివరిస్తున్నారు. భూమి తీవ్రంగా వేడెక్కడం వల్ల వాతావరణంలో భారీ మేఘాలు ఏర్పడి ఈదురుగాలులు, పిడుగులు, అతివృష్టికి దారితీస్తున్నాయి. మే నెలలో పడే వానలన్నీ సాయంత్రం నుండి రాత్రి వేళ పడతాయి అని చెప్పారు. మే 12న ఉత్తరప్రదేశ్ లో పడిన వాన అలాంటిదే.. మే నెలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో సూర్యాస్తమయం తరువాత వేడి క్రమంగా తగ్గుతుంది. అదే సమయంలో ఆకాశంలో భారీగా క్యుములో నింబస్ మేఘాలు తయారవుతాయి. అవి బరువుగా చాలా ఎక్కువ నీటితో ఎక్కువ విద్యుత్ శక్తితో ఉంటాయి. వాటికి ఈదురు గాలులు తోడవుతాయి. ఇవి సముద్రాల నుండి వచ్చే గాలులు. ఈ గాలులు వాతావరణాన్ని చల్లగా మార్చి మేఘాలు కరిగేలా చేస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే ఈ పరిస్థితిని మనం రోజూ చూస్తూనే ఉంటాం. వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాల గురించి కూడా హెచ్చరించింది. విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది. గాలుల వేగం గంటకు 30 నుండి 50 కిలోమీటర్లుగా ఉంటుందని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఈ వేగం 70 కిలోమీటర్లకు కూడా చేరుతుందని తెలిపింది.

పెరుగుతున్న ఆహార సంక్షోభం
ఆహార సంక్షోభం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న సూపర్ ఎల్ నినో ప్రభావం తీవ్రరూపం దాల్చితే దేశంలో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షపాతం తగ్గితే పంటల దిగుబడి పడిపోతుంది. రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. ఆహార ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగి సామాన్య ప్రజల జీవితం మరింత భారమవుతుంది. వాతావరణ మార్పు అంటే కేవలం ఉష్ణోగ్రతలు పెరగడం మాత్రమే కాదు.. అది ఆరోగ్యం, ఆహారం, నీరు, ఉపాధి, ఆర్థిక వ్యవస్థ అన్నింటినీ ప్రభావితం చేసే మానవ సంక్షోభం.

పరిరక్షణ చర్యలు ఇప్పుడు అత్యవసరం..
ఈ పరిస్థితుల్లో క్లైమేట్ యాక్షన్ అనేది భవిష్యత్తు కోసం చేసే పని కాదు. ప్రస్తుతం మనుగడ కోసం అవసరమైన చర్య. చెట్లు నాటడం మాత్రమే కాదు. నీటి సంరక్షణ, పునరుత్పాదక శక్తి వినియోగం, ప్రజా రవాణా బలోపేతం, హీట్ యాక్షన్ ప్లాన్లు, పర్యావరణ అనుకూల పట్టణ ప్రణాళిక, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ప్రకృతి వనరుల పరిరక్షణ వంటి చర్యలు అత్యవసరం. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలి. పరిశ్రమలు బాధ్యత తీసుకోవాలి. ప్రజలు జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ఇది కేవలం ప్రకృతి సమస్య కాదు. మానవ మనుగడకు సంబంధించిన సంక్షోభం. ఇప్పటికైనా చర్యలు ప్రారంభించకపోతే, భవిష్యత్ తరాలకు మనం అందించేది ప్రకృతి కాదు, సంక్షోభం.. వాతావరణ మార్పు అనేది తక్షణమే దృష్టి సారించాల్సిన ఒక ప్రపంచ సమస్య. దీని ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, ఆర్థిక వ్యవస్థలు, దైనందిన జీవితంపై పడుతున్నాయి. ఈ సమస్యను అర్థం చేసుకుని సమిష్టిగా చర్యలు తీసుకోవడం ద్వారా, ప్రమాదాలను తగ్గించి, భవిష్యత్ తరాల కోసం ఈ గ్రహాన్ని కాపాడగలం. ప్రకృతిని రక్షించడం ఇప్పుడు ఎంపిక కాదు. మనుగడ కోసం తప్పనిసరి బాధ్యత.

There is no time... the temperature is rising.

వేడెక్కుతున్న భూమి.. ఇవీ ప్రమాద సంకేతాలు
భూమి ఉపరితలంపై నమోదైన రికార్డుల్లో ఇది రెండవ అత్యంత వేడి సంవత్సరం. దీనికంటే ముందు 2024 సంవత్సరం ఉంది.
1998వ సంవత్సరం చరిత్రలోనే అత్యంత బలమైన ఎల్ నినో ప్రభావాన్ని చూసింది. ఆ సమయంలో రికార్డులు బద్దలయ్యే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గత పన్నెండు సంవత్సరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవానికి ముందున్న సగటు ఉష్ణోగ్రతల కంటే సుమారు 1.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వేడి తరంగాలు, అతివృష్టి, కరవులు, కార్చిచ్చులు, సముద్ర మట్టం పెరుగుదల వంటి ఘటనలు మరింత తీవ్రంగా మారుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

There is no time... the temperature is rising.

వెనుకడుగు వేస్తున్న అమెరికా

కార్బన్ మానిటర్, గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టులోని స్వతంత్ర పరిశోధకుల ప్రకారం 2025లో ప్రపంచవ్యాప్తంగా కార్బన్ కాలుష్యం సుమారు ఒక శాతం పెరిగింది. అమెరికాలో ఇది రెండు శాతం పెరిగింది. అధిక సహజ వాయువు ధరలు, బొగ్గు వినియోగం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. 2025లో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెడరల్ వాతావరణ నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఆమోదించిన అనేక స్వచ్ఛ ఇంధన పన్ను రాయితీలను బలహీనపరిచే చర్యలు తీసుకున్నారు. ప్రపంచంలోనే అగ్రగామి వాతావరణ పరిశోధనా సంస్థలపై ఒత్తిడి పెరిగిందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఫెడరల్ వెబ్‌సైట్ల నుండి వాతావరణ మార్పు సమాచారాన్ని తొలగించే చర్యలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కార్బన్ ఉద్గారాలలో సుమారు 12 శాతం వాటాతో అమెరికా ఇప్పటికీ అత్యధిక కాలుష్య దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది.

There is no time... the temperature is rising.

తీసుకోవాల్సిన చర్యలు..

వాతావరణ మార్పుల ప్రభావాలు తీవ్రమైనప్పటికీ, దాని వేగాన్ని తగ్గించి, దాని ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవచ్చు.
• సౌర, పవన, జల విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం. • భవనాలు, వాహనాలు, పరిశ్రమలలో శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించడం.
• కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించడానికి అడవుల పునరుద్ధరణ, ఇప్పటికే ఉన్న అడవులను పరిరక్షించడం.
• ప్రజా రవాణాను మెరుగుపరచడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం.
• సుస్థిర వ్యవసాయాన్ని, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడం.
• వాతావరణ విధానాలకు మద్దతు ఇవ్వడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం. ​ ​

There is no time... the temperature is rising.


తీవ్రంగా పరిగణిస్తున్న చైనా

గత కొన్నేళ్లుగా చైనా పునరుత్పాదక శక్తి రంగంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గత ఏడాది చైనాలో అమ్ముడైన కొత్త వాహనాల్లో సగానికి పైగా ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. అమెరికాలో ఈ వాటా పదో వంతు కన్నా తక్కువగా ఉంది. చైనా వాహన తయారీ సంస్థలు ఆగ్నేయాసియా వంటి ప్రాంతాలకు లక్షల సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేస్తున్నాయి. తన విద్యుత్ డిమాండ్ పెరుగుదల కంటే ఎక్కువ స్థాయిలో చైనా కొత్త స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఫలితంగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని కొంతమేర తగ్గించగలిగింది. అలాగే వందల బిలియన్ డాలర్ల విలువైన స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. అయితే ప్రపంచంలోనే అత్యధిక కార్బన్ ఉద్గారాలు విడుదల చేసే దేశాల్లో చైనా ఇప్పటికీ ముందువరుసలోనే ఉంది. దీంతో అభివృద్ధి–పర్యావరణ సమతుల్యత చైనాకు కూడా పెద్ద సవాల్‌గా మారింది.

There is no time... the temperature is rising.


భారత్ కు పర్యావరణ సంస్థల సిఫార్సులు..

మానవ మనుగడతో పాటు జీవవైవిధ్యం ఉనికి, పర్యావరణ పరిరక్షణకు పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు ఈ వాతావరణ మార్పులు. మానవకారక కాలుష్యంతో భూతాపం పెరిగి ఏటా ఎండలు, _వరదలు, కరవులు పెరిగిపోతున్నాయి. ఆహారభద్రతతో పాటు మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఈ దుష్పరిణామాలను తక్షణం నిలువరించాలి. వాతావరణ కార్యాచరణ ప్రణాళికలను తగ్గించడానికి బదులుగా, భారతదేశంలో ఈ వ్యూహాలను వేగవంతం చేసి, విస్తరించాలని అగ్రశ్రేణి పర్యావరణ సంస్థలు, ప్రపంచ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అనేక కీలక రంగాలలో సుస్థిరమైన, స్థానికీకరించిన అధిక ప్రభావం చూపే మార్పులను అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని స్పష్టం చేశాయి.
పునరుత్పాదక శక్తికి పరివర్తన: భారతదేశం తన 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడటానికి సౌర, పవన, బయోమాస్‌లలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం.

వాయు కాలుష్య నియంత్రణ : గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు, తీవ్రమైన వాయు కాలుష్యాన్ని ఏకకాలంలో ఎదుర్కోవడానికి, కార్బన్ తగ్గింపును జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమంతో అనుసంధానించాలి.
సుస్థిర వ్యవసాయం : వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడానికి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, రసాయన వాడకాన్ని తగ్గించే, నీటిని సంరక్షించే వ్యవసాయ పద్ధతులను అవలంబించడం.
ప్రకృతి ఆధారిత పరిష్కారాలు : సహజ తీరప్రాంత రక్షణ, కార్బన్ నిల్వ కోసం తీరప్రాంత ఆవాసాలు, స్పష్టమైన ఆదాయాల కొరకు మడ అడవుల కార్యక్రమాన్ని విస్తరించాలి.


జ్యోతిర్మయి
8332925496


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్