ప్రఖ్యాత పర్వతారోహకుడు, తన మూడవ ప్రయత్నంలో ఎవరెస్టు శిఖర సమీపాన ప్రాణాలు విడిచిన జార్జ్ మాల్లోరీని “మీరు ఎవరెస్ట్ ఎందుకు ఎక్కాలనుకుంటున్నారు?” అని అడిగినప్పుడు, ఆయన ఇచ్చిన సమాధానం “అది అక్కడ ఉంది గనక”. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం కావడమే ఎవరెస్ట్ ఆకర్షణ. భూమి మీద అంతకంటే ఎత్తైన చోటు మరొకటి లేదు కాబట్టి, (సముద్ర మట్టానికి సగటు ఎత్తు ఆధారంగా కొలిచినప్పుడు భూమిపై అత్యంత ఎత్తైన ప్రదేశం. పర్వతాల ఎత్తును నిర్ణయించడానికి సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ప్రమాణం ఇదే.) ఆ శిఖరాగ్రాన నిలబడి ప్రపంచాన్ని చూడాలనే కోరిక సాహసికులను వెనక్కి తగ్గనివ్వదు. పైగా ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా, ప్రతి ఏటా వందలాది మంది ఈ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. ఎవరెస్ట్ పట్ల ఇంతలా ఆకర్షితులు కావడానికి కారణాలు ఏమిటి? ఒకేఒక్క కారణం.. సాహసించడంలో వచ్చే సంతృప్తి – ఇప్పటి పరిభాషలో ‘కిక్’!
సముద్ర మట్టానికి 29,031.7 అడుగులు లేదా 8,848.86 మీటర్ల ఎత్తులో మోర విరుచుకు నిలిచే ‘ఎవరెస్ట్’ను అధిరోహించడం అనేది ప్రతి సాహసికుడి చిరకాల స్వప్నం. ఈ అసాధ్యమైన స్వప్నాన్ని సుసాధ్యం చేసిన చారిత్రాత్మక ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మే 29న మనం ‘అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం’ జరుపుకుంటున్నాము.

ప్రారంభ యత్నాలు ..
ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో అనేక దేశాలు హిమాలయాల పర్వతశ్రేణుల వైపు దృష్టి సారించాయి. 1921లో బ్రిటీష్ వారు మొదటి ఎవరెస్ట్ యాత్రను నిర్వహించారు. మూడవ ప్రయత్నం చేస్తున్న జార్జ్ మాల్లోరీ, 22 ఏళ్ల ఆండ్ర్యూ ఇర్విన్ జూన్ 8, 1924న దాదాపు శిఖరం సమీపానికి చేరుకున్నారు. కానీ అకస్మాత్తుగా అదృశ్యమైపోయారు. మాల్లోరీ శవం 1999లో చిక్కింది గానీ ఇర్విన్ ఆనవాళ్లతోబాటు అసలు వీళ్లు శిఖరాన్ని చేరుకున్నారా లేదా అనేది ఇప్పటికీ అంతు చిక్కలేదు. అలా ఎందరో సాహసికులు ప్రయత్నించి విఫలమైన నేపథ్యంలో “ఎవరెస్ట్ మనిషికి లొంగదు” అనే అభిప్రాయం బలంగా ఉండేది.
ఎన్నాళ్లో వేచిన ఉదయం: 1953 మే 29 కానీ, 1953లో జరిగిన తొమ్మిదవ బ్రిటీష్ యాత్ర ఈ అభిప్రాయాన్ని తుడిచిపెట్టేసింది. బ్రిటీష్ కల్నల్ జాన్ హంట్ నాయకత్వంలో బయలుదేరిన బృందంలో న్యూజిలాండ్లో తేనెటీగలను సాగుచేసే ఎడ్మండ్ హిల్లరీ, హిమాలయాలనే తన ఇల్లుగా మార్చుకున్న నేపాలీ షెర్పా టెన్జింగ్ నార్గే ఉన్నారు. అప్పటికే టెన్జింగ్ నార్గే షెర్పా ఏడు సార్లు ఎవరెస్ట్ యాత్రల్లో పాల్గొన్నారు. శిఖరానికి చేరుకోవడానికి కొద్ది అడుగుల ముందు, వారు ఒక భారీ నిలువు రాతి గోడను ఎదుర్కొన్నారు (ఇప్పుడు దీనినే ‘హిల్లరీ స్టెప్’ గా పిలుస్తారు). సుమారు 40 అడుగుల ఎత్తు, దట్టమైన మంచుతో కప్పబడి ఉన్న ఆ గోడ వద్ద ఒక్క తప్పటడుగు వేసినా వేల అడుగుల లోతున్న లోయలో పడిపోయే ప్రమాదం ఉంది. హిల్లరీ చాకచక్యంతో పైకి ఎక్కగా, నార్గే ఆయనను అనుసరించారు. ఆ అడ్డంకిని దాటడమే వారి విజయానికి నాంది పలికింది. మే 29 ఉదయం సరిగ్గా 11:30 గంటలకు వారు ఎవరెస్ట్ శిఖరాగ్రంపై కాలుమోపారు. ప్రతికూల వాతావరణ కారణంగా వారు అక్కడ గడిపింది కేవలం 15 నిమిషాలు మాత్రమే. తమ కాళ్లకిందకు వచ్చిన శిఖరాగ్రాన హిల్లరీ తన కెమెరాతో టెన్జింగ్ నార్గే గాల్లో గొడ్డలిని (ఐస్ యాక్స్‌ను) ఎత్తి పట్టుకున్న చారిత్రాత్మక ఫోటోను తీశారు. అయితే, హిల్లరీ ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడలేదు. వారు కిందకు దిగి వచ్చిన తర్వాత ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా దావాగ్నిలా వ్యాపించింది. సరిగ్గా బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 పట్టాభిషేకం రోజే ఈ శుభవార్త లండన్ చేరుకోవడంతో, దానిని ఒక శుభశకునంగా భావించారు. హిల్లరీకి ‘నైట్ హుడ్’ (సర్) ప్రదానం జరిగింది. టెన్జింగ్ నార్గే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. టెన్జింగ్ నార్గే నేపాల్లో జన్మించినప్పటికీ తరువాత భారతదేశాన్ని తన నివాసంగా ఎంచుకున్నారు. ఆయన Himalayan Mountaineering Institute తొలి డైరెక్టర్ గా పనిచేసి, అనేక భారతీయ పర్వతారోహకులకు శిక్షణ అందించారు.

ఒక జ్ఞాపకం.. ఒక దినోత్సవం
ఎడ్మండ్ హిల్లరీ 2008 జనవరి 11న కన్నుమూశారు. ఆయన మరణానంతరం, ఆయన సాహసానికి, నేపాల్ పర్యాటక రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నేపాల్ ప్రభుత్వం మే 29ని ‘అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం’గా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
నేపాల్ రాజధాని ఖాట్మండులో ఈ రోజున పండుగ వాతావరణం నెలకొంటుంది. పర్వతారోహకులు, అధికారులు, పర్యాటకరంగ ప్రతినిధులతో భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. ఆ సంవత్సరంలో ఎవరెస్ట్ ను అధిరోహించిన సాహసికులను, రికార్డులు సృష్టించిన పర్వతారోహకులను ప్రభుత్వం ఘనంగా సన్మానిస్తుంది. న్యూజిలాండ్‌లో కూడా ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఎవరెస్ట్ కథ కేవలం 1953లో హిల్లరీ, నార్గేల విజయంతో ముగిసిపోలేదు. ఆ విజయ స్ఫూర్తి గత ఏడు దశాబ్దాలుగా వేల మంది సాహసికులను ఆకర్షిస్తూనే వుంది. ఈ దినోత్సవం కేవలం పర్వతారోహణ గురించి మాత్రమే కాదు, ఇది మనకు కొన్ని పాఠాలను నేర్పుతుంది.
పర్యావరణ స్పృహ: ఎవరెస్ట్ మీద పేరుకుపోతున్న వ్యర్థాల గురించి ప్రపంచాన్ని హెచ్చరించడం.
ఆర్థిక వ్యవస్థ: నేపాల్ వంటి దేశాల పర్యాటక ఆదాయానికి ఎవరెస్ట్ వెన్నెముక. స్థానిక షెర్పాల జీవనోపాధిని మెరుగుపరచడం.
మానవ పరిమితులు: మనిషి తలచుకుంటే ఏ శిఖరాన్నైనా అధిరోహించగలడని నిరూపించడం.
భారత ఎవరెస్ట్ వీరులు
మనదేశపు తలపైన, మనం తలెత్తి చూసేలా నిలబడ్డ హిమాలయ శిఖరాల తలలపైకి ఎక్కి వాటిని తమ కాళ్ల కిందకు తెచ్చుకున్నవారిలో మనదేశ సాహసికులూ వున్నారు.
1965 లో కమాండర్ M S కోహ్లీ ఆధ్వర్యంలో తొమ్మిదిమంది ఆ శిఖరాన్ని అధిరోహించడంతో ఆ ఘనత పొందిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది.
అవతార్ సింగ్ చీమా: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు (1965 మే 20న).
బచేంద్రి పాల్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ (1984 మే 23న).
సంతోష్ యాదవ్: రెండుసార్లు ఎవరెస్ట్ ను అధిరోహించిన ప్రపంచ తొలి మహిళ (1992, 1993లో).
తాషి మాలిక్, నుంగ్షి మాలిక్: ఎవరెస్ట్ ను అధిరోహించిన ప్రపంచ తొలి కవల సోదరీమణులు (2013లో ).
అన్షు జంసేన్పా: ఎవరెస్ట్ శిఖరాన్ని 6 సార్లు అధిరోహించిన భారతీయ మహిళ (2024 వరకు). ఆమె 2017లో ఒకే సీజన్లో (11 రోజుల వ్యవధిలో) రెండు సార్లు ఎవరెస్ట్ ఎక్కిన ప్రపంచంలోనే మొదటి మహిళ. ఆమె ఒక శిశువుకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఎవరెస్ట్ ఎక్కిన సాహసి. భారత ప్రభుత్వం నుంచి పద్మ శ్రీ (2021) అవార్డు అందుకుంది.
లవ్ రాజ్ సింగ్ ధర్మశక్తు: ఏడు సార్లు (1998, 2006, 2009, 2012, 2013, 2017, 2018) ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు.

తెలుగు తేజం మలావత్ పూర్ణ
తెలుగు నేల గర్వించదగ్గ పేరు మలావత్ పూర్ణ. ఎవరెస్ట్ ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలైన బాలికగా (13 ఏళ్ల 11 నెలలు) పూర్ణ రికార్డు సృష్టించినప్పుడు ప్రపంచం మొత్తం మనవైపు చూసింది. నిజామాబాద్ జిల్లాలోని పాకాల అనే ఒక చిన్న గ్రామంలో, వ్యవసాయ కూలీల కుటుంబంలో పుట్టిన పూర్ణకు ఎవరెస్ట్ అనేది ఒక కల కూడా కాదు. కానీ ఆమెలోని పట్టుదలని గుర్తించిన ఐపీఎస్ అధికారి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆమెకు గిరిజన సంక్షేమ పాఠశాలల ద్వారా పర్వతారోహణలో శిక్షణ ఇప్పించారు.
మే 25, 2014న, పూర్ణ ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకుంది. అక్కడ ఆమె భారత త్రివర్ణ పతాకాన్ని, డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి.. పేదరికం, నేపథ్యం ఎదుగుదలకు అడ్డుకావు అని చాటింది.
నమ్మశక్యం కాని సంకల్పం
రక్తం గడ్డకట్టే చలి, నిటారుగా ఉండే మంచు కొండలు, ప్రాణవాయువు అందని ఎత్తు. అవయవాలన్నీ సక్రమంగా, దృఢంగా ఉన్నవారే అక్కడ అడుగు వేయడానికి వణికిపోతారు. మరి, కాళ్లు లేని వ్యక్తి ఆ శిఖరాన్ని ఎక్కగలరా? ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు అరుణిమా సిన్హా, హరి బుద్ధ మగర్.
మనదేశానికి చెందిన అరుణిమా సిన్హా రైలు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయి కూడా కృత్రిమ కాలితో ఎవరెస్ట్ ను అధిరోహించిన (2013లో) ప్రపంచంలోనే తొలి వికలాంగ మహిళ. నేపాల్ కు చెందిన హరిబుద్ధ మగర్ ఒక బాంబు పేలుడులో తన రెండు కాళ్లను కోల్పోయారు. కృత్రిమ కాళ్ల సహాయంతో 2017లో ఆయన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.

మానవ పరిమితుల పరీక్ష
ఎవరెస్ట్ అధిరోహణ అనేది, ఆమాటకొస్తే, ఏ పరవతాధిరోహణ అయినా, కేవలం శారీరక శక్తికి సంబంధించింది మాత్రమే కాదు, అది మానసిక దృఢత్వానికి పరీక్ష. ఎవరెస్ట్ శిఖరంపై వాతావరణ పరిస్థితులు అత్యంత కఠినమైనవిగా ఉంటాయి. అక్కడ సంవత్సరం పొడవునా తీవ్రమైన చలి ఉంటుంది. సాధారణంగా ఉష్ణోగ్రత మైనస్ 36 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతుంది. శీతాకాలంలో ఇది మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ వరకు చేరవచ్చు. ఇంత తీవ్రమైన చలిలో మనిషి శరీరం చాలా త్వరగా బలహీనపడుతుంది. ఎవరెస్ట్ శిఖరంపై గాలులు కొన్నిసార్లు గంటకు 160 – 200 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఈ బలమైన గాలుల వల్ల నిలబడటం కూడా చాలా కష్టమవుతుంది. అంతేకాకుండా, అక్కడ గాలిలో ఆక్సిజన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. శిఖరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఆకస్మికంగా మంచు తుపాన్లు సంభవించవచ్చు. కొన్నిసార్లు దట్టమైన మంచు, మబ్బుల కారణంగా చుట్టూ ఏమీ కనిపించదు. ఎత్తు ఎక్కువగా ఉండటంతో సూర్యుని అల్ట్రావయొలెట్ కిరణాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఇవి చర్మానికి, కళ్లకు హాని కలిగించవచ్చు.
ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలోని 8,000 మీటర్లకు పైబడిన ప్రాంతాన్ని “మరణ మండలం” (Death Zone) అని అంటారు. ఈ ప్రాంతంలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండటం వల్ల మనిషి ఎక్కువసేపు ఉండటం ప్రమాదకరం. అందువల్ల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన, సాహసోపేతమైన కార్యాలలో ఒకటిగా భావిస్తారు. అటువంటి కఠిన పరిస్థితులను జయించి, తమ ప్రాణాలను పణంగా పెట్టి గెలవడంలో ఉండే ‘కిక్’ పర్వతారోహకులకు మరెక్కడా దొరకదు. ఎవరెస్ట్ కేవలం ఒక పర్వతం కాదు; అది మనిషి తన భయాన్ని జయించి, అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనుకునే తపనకు ఒక నిదర్శనం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పట్టు వదలకుండా పోరాడే గుణమే మనిషిని ఎవరెస్ట్ వైపు పరుగులు తీయిస్తోంది. ఎడ్మండ్ హిల్లరీ అన్నట్లు.. “మనం జయించాల్సింది పర్వతాలను కాదు, మనల్ని మనం!”
ఈ అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం సందర్భంగా, ప్రాణాలకు తెగించి సాహసాలు చేసే పర్వతారోహకులందరికీ, పర్వతాల రక్షణ కోసం పాటుపడే వారందరికీ సెల్యూట్.
డా. కె. విజయ్








కామెంట్‌లు (0)