కింగ్ కోహ్లీ విశ్వరూపం
హోమ్ గ్రౌండ్ లో టైటాన్స్ కు తప్పని భంగపాటు
ఫైనల్లో గుజరాత్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపు
గుజరాత్ 155/8, బెంగళూరు 161/5
అహ్మదాబాద్ : నాడు ఒకప్పటి కల.. నేడు తిరుగులేని అలవాటు! నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా గుజరాత్ టైటాన్స్ కోటను బద్ధలు కొడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. కింగ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విశ్వరూపంతో గుజరాత్ విధించిన లక్ష్యాన్ని ఊచకోత కోస్తూ, వరుసగా రెండో ఏడాది ఐపిఎల్ మకుటాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన వశం చేసుకుంది. ఐపిఎల్ చరిత్రలో ఒక సరికొత్త శకం ఆవిర్భవించింది. ఒకప్పుడు కప్పు కోసం పద్దెనిమిదేళ్లు నిరీక్షించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది ఐపిఎల్ సామ్రాజ్యాన్ని శాసించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల హర్షధ్వానాల మధ్య జరిగిన ఐపిఎల్-2026 హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ సంచలన విజయం నమోదు చేసింది. బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్స్‌గా అవతరించింది. గుజరాత్ టైటాన్స్‌ను ఘోరంగా దెబ్బకొట్టింది. గతేడాది (2025) దక్కిన తొలి ట్రోఫీ అయాచితం కాదని, అది తమ జైత్రయాత్రకు నాంది మాత్రమేనని రజత్ పటిదార్ సేన చేతల్లో నిరూపించింది. బౌలర్ల అటాకింగ్, కింగ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విన్యాసాలతో గుజరాత్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి ఐపిఎల్-2026 కీర్తి కిరీటాన్ని బెంగళూరు మరోసారి కైవసం చేసుకుంది. నిన్నటి వరకు ‘ఈసాల కప్ నామ్దే (ఈసారి ట్రోఫీ మాదే)’ అన్న అభిమానులు.. ఇప్పుడు గర్వంగా ‘ఈసాల కూడా కప్ నామ్దే’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి.. గుజరాత్ టైటాన్స్‌ను 155 పరుగులకే కట్టడి చేసింది. లక్ష్య సాధనలో జాగ్రత్తగా ఆడుతూ ఐదు వికెట్లు కోల్పోయి 18 ఓవర్లకు 161 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో ఐపిఎల్ ట్రోఫీని ‘రాయల్’గా మరోసారి తన పరం చేసుకుంది. లీగ్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు ఆధిపత్యం చెలాయించిన ఆర్‌సిబి.. ఫైనల్లోనూ సత్తాచాటింది. ఆ జట్టులో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగులతో చెలరేగాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ ఒక్కో వికేట్ తీశారు.
ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు గుజరాత్ కల్లాస్
ఐపీఎల్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులకే కట్టడి చేశారు. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు ఎవరూ క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయారు. టాప్ ఆర్డర్ చేతులెత్తేసిన వేళ గుజరాత్ టైటాన్స్ జట్టును వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. బాధ్యతాయుతంగా ఆడిన సుందర్ 50 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మిగతా బ్యాటర్లలో నిశాంత్ సింధు (20), జోస్ బట్లర్ (19), అర్షద్ ఖాన్ (15) పర్వాలేదనిపించినా.. భారీ స్కోర్లు చేయలేకపోయారు. స్టార్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (12), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) తీవ్రంగా నిరాశపరిచారు. ఆఖర్లో రాహుల్ తెవాటియా (7), జేసన్ హోల్డర్ (7) వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో యువ బౌలర్ రసిఖ్ సలామ్ దార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా సీనియర్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లతో రాణించగా, కృణాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
గుజరాత్ టైటాన్స్ : 155/8 ( వాషింగ్టన్ సుందర్ 50, నిశాంత్ సింధు 20, జోశ్ బట్లర్ 19,
రసిఖ్ దార్ 3/27, హాజిల్‌వుడ్ 2/27, భువనేశ్వర్ 2/29)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : 161/5 ( విరాట్ కోహ్లి 75,
వెంకటేశ్ అయ్యర్ 32, టిమ్ డెవిడ్ 24, రషీద్ ఖాన్ 2/32, అర్షద్ ఖాన్ 1/32)
పండుగ వాతావరణంలో బెంగళూరు..
మ్యాచ్ ముగియగానే ఆర్సీబీ ఆటగాళ్లు మైదానంలో భావోద్వేగానికి గురయ్యారు. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ మరియు జట్టు సభ్యులు ఒకరినొకరు కౌగిలించుకొని ఆనందాన్ని పంచుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని గెలవడంతో అటు బెంగళూరు నగరంతో పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి.








కామెంట్‌లు (0)