టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించడంపై సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించారు. ఈ విజయంపై విరాట్ కోహ్లీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ”ఛాంపియన్స్! అహ్మదాబాద్‌లో టీమిండియాకు ఇది అద్భుత విజయం. టోర్నమెంట్ ఆసాంతం మనవాళ్ళు ఎక్స్‌ప్లోజివ్ క్రికెట్ ఆడారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాడి మళ్లీ వరల్డ్ చాంపియన్లుగా నిలిచిన తీరు అద్భుతం” అని పేర్కొన్నాడు.
సచిన్ టెండూల్కర్ : ”టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండుసార్లు కప్పు గెలిచిన ఘనత భారత్‌కే దక్కుతుంది. కివీస్ బౌలర్లతో పోలిస్తే మన బౌలర్లు స్లోయర్, షార్ట్ పిచ్ బంతులను తెలివిగా విసిరారు. ఇక్కడి బౌండరీ కొలతలకు తగ్గట్టుగా లెంగ్త్స్ మార్చడం వల్లే విజయం సాధ్యమైంది” అని సచిన్ కొనియాడారు. కాగా సొంతగడ్డపై టీ20 కప్పు గెలిచిన తొలి జట్టుగా, మూడుసార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
ప్రధాని నరేంద్ర మోడీ :భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. “ఛాంపియన్స్.. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు” అంటూ ప్రధాని ప్రశంసించారు. ఈ గెలుపు జట్టు అద్భుతమైన నైపుణ్యాలు, దృఢ సంకల్పం, టీమ్ వర్క్‌కు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. టోర్నమెంట్ ఆసాంతం భారత ఆటగాళ్లు చూపిన పోరాట పటిమ అమోఘమని మోదీ కొనియాడారు. ఈ విజయం ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో, ఆనందంతో నింపిందని తెలిపారు. “వెల్ డన్ టీమ్ ఇండియా” అంటూ ప్రధాని తన సందేశంలో భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో భారత జట్టు కప్ గెలవడం క్రీడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది.








కామెంట్‌లు (0)