- రాత్రి 7.30గంటల నుంచి
ధర్మశాల: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-19 ఫైనల్ కు చేరే జట్టేదో మరి గంటల్లో తేలిపోనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), 2022 ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా తొలి క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు మరో ఛాన్స్ దక్కనుంది. 2026 సీజన్ టాప్-2 జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో బెంగళూరు, గుజరాత్ తో పాటు సన్ రైజర్స్ జట్టు కూడా 9 విజయాలతో సహా 18 పాయింట్లతో సమంగా నిలిచినా.. మెరుగైన రన్ రేట్ తో బెంగళూరు, గుజరాత్ జట్లు టాప్-2 స్థానాల్లో నిలిచి క్వాలిఫయర్-1కు అర్హత సాధించాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రన్ రేట్ లో వెనుకబడి 3వ స్థానానికి పరిమితమైంది. బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు రాజస్తాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ న్యూ ఛండీగడ్ వేదికగా జరగనుంది.
టోర్నీ ప్రారంభం నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు టాప్ ఫామ్ ను కొనసాగిస్తూ వచ్చింది. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తూ విజయాలను నమోదు చేసుకొంది. మరోవైపు గుజరాత్ టోర్నీ ఆరంభ మ్యాచుల్లో నిరాశపరిచినా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొంది. ప్రారంభంలో పంజాబ్, రాజస్తాన్ చేతిలో ఓడిన గుజరాత్.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకొన్నా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి తొలి అర్ధభాగం 7 మ్యాచ్ లు ముగిసేసరికి కేవలం 3 విజయాలు, 4 పరాజయాలతో 8వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ పుంజుకున్న అత్యద్భుతం. ఆ తర్వాత గుజరాత్ ఆడిన 5 మ్యాచుల్లోనూ గెలిచి ఏకంగా ప్లే-ఆఫ్స్ బెర్త్ కొట్టేసింది. లీగ్ దశలో ఇరుజట్లు ముఖా ముఖి తలపడగా.. ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ లో గెలిచాయి. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ ను చిత్తుచేయగా.. రెండో లీగ్ మ్యాచ్ లో గుజరాత్ జట్టు 4 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది.
ఐపిఎల్ చరిత్రలో ముంబయి, చెన్నై జట్లదే హవా. ఇప్పటివరకు జరిగిన 18 సీజన్ లలో ఈ రెండు జట్లు ఏకంగా 10 టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. ఈసారి ఆ రెండు జట్లు ప్లే-ఆఫ్స్ కు చేరడంలో విఫలమయ్యాయి.
దీంతో సీజన్-19 టైటిల్ ను మరో జట్టు కైవసం చేసుకోనుంది. 2022 నుంచి ఐపిఎల్ ను 10 జట్ల కు విస్తరించిన తర్వాత ముంబయి, చెన్నై జట్ల టైటిళ్ల వేటకు కొంత గండి పడింది. ఈ నాలుగు సీజన్లలో 4 వేర్వేరు జట్లు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి2022లో గుజరాత్, 2023లో చెన్నై, 2024లో కోల్ కతా, 2025లో ఆర్సీబీ జట్లు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. ఈ సీజన్ ప్లే-ఆఫ్స్ కు చేరిన 4జట్లు ఒక్కోసారి టైటిల్ ను ముద్దాడాయి. 2026 సీజన్ టైటిల్ ను ఏ జట్టు కైవసం చేసుకున్నా.. రెండోసారి టైటిల్ ను కొట్టేయడం ఖాయం.








కామెంట్‌లు (0)