test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అవినీతి’ నేతలకే సిఎం కుర్చీ!

11 మే, 2026

bjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 11, 2026, 06:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • బిజెపి ‘వాషింగ్‌మిషన్‌’ ‌రాజకీయాలు..

  • ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పగ్గాలు

న్యూఢిల్లీ: ఒకప్పుడు ‘దేశాన్ని దోచుకున్నవారు’ అని బిజెపి ఆరోపించిన నేతలే ఇప్పుడు ఆ పార్టీకి ముఖ్యమంత్రులు, ప్రాంతీయ శక్తులుగా మారారు. వారి మీద ఉన్న కేసులు, దర్యాప్తులు అదృశ్య మవడమో, నత్తనడకన సాగడమో జరుగుతున్నా యి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు బిజెపిలోకి రాగానే వాషింగ్‌‌మిషన్‌‌లో శుభ్రపర్చినట్టుగా ‘క్లీన్‌’ అవుతారని ప్రతిపక్షాలు సంధించి వ్యంగ్య్రాస్ర్తాలు నిజమేనని తాజా రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి.

హిమంత బిశ్వ శర్మ.. అసోం సిఎం

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 2001 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ, తరుణ్ గోగోయ్ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, ఆర్థికం వంటి ముఖ్యమైన శాఖలను నిర్వహించారు. 2015 ఆగస్టులో, ఆయన కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు. 2016లో కీలక మంత్రిగా, 2021 మేలో, అసోం ముఖ్యమంత్రిగా బిజెపి నియమించింది. ఆయన కాంగ్రెస్‌‌లో ఉన్నప్పుడు లూయిస్‌ ‌బెర్గర్‌ ‌లంచం కేసులో బిజెపి తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పట్లో విడుదల చేసిన పుస్తకాల్లో ఆయనను అవినీతి ముఖచిత్రంగా చూపించింది. అవన్నీ మరిచిపోయి, మరోసారి సిఎం పదవి కట్టబెడుతోంది.

సువేందు అధికారి, పశ్చిమ బెంగాల్‌ ‌సిఎం

సువేందు అధికారి ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌ ‌సిఎం. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయ నాయకులలో ఒకరు. ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్‌తో ప్రారంభమైనప్పటికీ, 1998లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. నందిగ్రామ్ లో మమతా బెనర్జీతో కలిసి నానా యాగీ చేసిన వాడు. 2020లో ఆయన తృణమూల్ ని వీడారు. 2020 డిసెంబర్ 19న అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. 2021లో, నందిగ్రామ్ స్థానంలో, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ స్థానంలో కూడా ఆయన మమతా బెనర్జీని ఓడించి వార్తల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌‌లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో 2016 నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ ‌మళ్లీ చర్చకు వచ్చింది. ఆ వీడియోల్లో నగదు స్వీకరిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న సువేందు.. అప్పట్లో బిజెపికి అవినీతి అనకొండగా కనబడ్డాడు. ఇప్పుడు అదే నేతను బిజెపి ‘బెంగాల్‌ ‌రక్ష‍కుడు’గా కీర్తించడం కాషాయపార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

సామ్రాట్ చౌదరి, బీహార్‌ ‌సిఎం

బీహార్ నూతన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన మొదట ఆర్‌‌జెడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జెడియులో మంత్రిగా పనిచేశారు. 2018లో, బిజెపిలో చేరి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1995 నాటి హత్య హత్య కేసు, వయస్సు తారుమారు ఆరోపణలు ఉన్నప్పటికీ.. బిజెపిలో చేరాక ఆ పార్టీ నాయకత్వం వాటిని పూర్తిగా విస్మరించింది. నితీశ్ కుమార్‌‌ను తప్పించి మరీ సామ్రాట్‌ ‌చౌదరీని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది.

పేమా ఖండూ, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌సిఎం

అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూ 2016లో, కాంగ్రెస్ ‌తరపున ముఖ్యమంత్రిగా అయ్యారు. అదే సంవత్సరం ఆయన మొదట పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పిపిఎ)లో చేరి, ఆ తర్వాత తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలో చేరారు. అనంతరం బిజెపి ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగించింది.

బిజెపి కీలక నేతలెందరో….

ఇతర పార్టీల నుంచి వచ్చిన కీలక నేతలలో అసోం గణపరిషత్‌‌కు చెందిన సర్బానంద సోనోవాల్ బిజెపిలో చేరడంతో అసోం సిఎంగా అవకాశం కల్పించింది. కాంగ్రెస్‌ ‌నుంచి వచ్చిన ఎన్. బీరెన్ సింగ్ మణిపూర్‌ అల్లర్ల సమయంలో బిజెపి సిఎంగా ఉన్నారు. జనతాదళ్‌ ‌నుంచి వచ్చిన బసవరాజ్ బొమ్మై కర్ణాటక సిఎంగా పనిచేశారు. జెఎంఎం నుంచి వచ్చిన అర్జున్ ముండా బిజెపిలో చేరి, సిఎంగా పనిచేశారు. ఈ జాబితాలో ముఖ్యమంత్రులే కాదు. కేంద్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులు జ్యోతిరాదిత్య సింధియాతో పాటు పలువురు ఎంపీలు తమ పదవులను కాపాడు కోవడం కోసం బిజెపిలో చేరడం దేశ ప్రజలకు తెలియనిదేం కాదు.

బీజేపీ ‘నాలుగు ఐ’ల ఫార్ములా

మోడీ పాలనలో బిజెపి నాలుగు ఐల ఫార్ములాను అమలు చేస్తోందని చెప్తున్నారు. అవి.. ఐడెంటిఫై (గుర్తించు), ఇన్వెస్టిగేట్‌ (‌దర్యాప్తు), ఇండక్ట్‌ (‌చేర్చుకోవడం), ఇనాగురేట్‌ (‌పదవి ఇవ్వడం). ప్రతిపక్ష‍ నేతను భారీ అవినీతి కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా చూపించడం ‘ఐడెంటిఫై’లో భాగం. ఇన్వెస్టిగేట్‌‌లో భాగంగా సదరు నేతపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఒత్తిడి పెంచడం. ఆ నేత బీజేపీలో చేరగానే స్వాగతం పలకడం ‘ఇండక్ట్‌’ అర్థం. చివరకు మంత్రి పదవిలో లేదా ముఖ్యమంత్రి కుర్చీతో బహుమతి ఇవ్వడం ‘ఇనాగురేట్‌’లో భాగం.

కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు

మోడీ అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకులపై నమోదైన 190కి పైగా ఎన్‌‌ఫోర్స్‌‌మెం ట్‌ ‌డైరెక్టరేట్‌ (ఇడి) కేసుల్లో రెండు మాత్రమే తీర్పుతో ముగిశాయి. ఈ విషయాన్ని సాక్ష‍ాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌‌లో వెల్లడించడం గమనార్హం. ఇక ఇడి దర్యాప్తులను ఎదుర్కొన్నవారి లో 90 శాతం మంది ప్రతిపక్ష‍ పార్టీల నేతలేనని వివిధ మీడియా సంస్థల విశ్లేషణలు సైతం వెల్లడించాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు బిజెపి రాజకీయ ఆయుధాలుగా మారిపోయాయన్న ఆరోపణలు మరింత బలపడ్డాయి.

అవినీతి సొమ్ము బిజెపి ఖజానాలోకే : ప్రతిపక్ష‍ాలు

ఇటీవల మోడీ చేసిన ‘జో లూటా వో లౌటానా హోగా’ (దోచుకున్నది తిరిగి ఇవ్వాల్సిందే) వ్యాఖ్యలపై కూడా ప్రతిపక్ష‍ాలు వ్యంగ్య్రాస్ర్తాలు సంధిస్తున్నాయి. ‘దోచుకున్న డబ్బు ప్రజలకు తిరిగి రావడం లేదు, బిజెపి రాజకీయ ఖజానాకే చేరుతోంది’ అని విమర్శిస్తున్నాయి. బిజెపికి అవినీతి మచ్చలతో సంబంధం లేదనీ, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఎవరినైనా అంగీకరిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్