test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition'ఉపాధి హామీ'ని దెబ్బ తీయడం

19 మే, 2026

upadi hami
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 06:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

స్వాతంత్య్రానంతర కాలంలో భారతదేశంలో ప్రజలపై ఎక్కువ ప్రభావం కలిగించిన చట్టంగా 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని' గురించి చెప్పవచ్చు. కేవలం పేదలకు కొంత నిధిని కేటాయించడమో, గతంలో నడిచిన 'పనికి ఆహారం' వంటి మరొక పథకమో కాదిది. ఎన్ని పరిమితులున్నప్పటికీ, ఈ చట్టం 'ఉపాధి హక్కు' ను గుర్తించింది. కోరిన ప్రతీ ఒక్కరికీ కనీసం వంద రోజులకు తగ్గకుండా పని కల్పించాల్సిందేనని ఈ చట్టం నిర్దేశించింది. ఆ విధంగా ఈ చట్టం ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చాలా ఇబ్బందుల్లో ఉండే పలు గ్రామీణ పేద కుటుంబాలకు గణనీయంగా ఊరట కల్పించింది.
ఉపాధి హక్కును రాజ్యాంగ హక్కుగా గుర్తించనప్పటికీ, ఆ హక్కును దాదాపు రాజ్యాంగబద్ధం చేసినంత పని చేసింది. పార్లమెంటు లోపలే కాకుండా, వెలుపల కూడా ఈ చట్టం రూపకల్పన మీద చర్చ జరిగింది. పార్లమెంటు సభ్యులతోబాటు విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు, ప్రజా మేథావులు, కార్మికవర్గ ప్రతినిధులు, పౌర సంస్థలు ఆ చర్చల్లో భాగస్వాములయ్యారు. ఆ తర్వాతనే ఆ చట్టం ఆమోదించబడింది. అది కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆ విధంగా ఈ చట్టం గ్రామీణ పేదలకు ఒక రాజ్యాంగబద్ధమైన హామీని ఇచ్చినట్టైంది. అప్పటి ప్రభుత్వ భాగస్వాముల్లో ఈ చట్టాన్ని వ్యతిరేకించినవారూ లేకపోలేదు. కాని యుపిఎ ప్రభుత్వాన్ని వెలుపల నుండి బలపరిచిన వామపక్ష పార్టీల ఒత్తిడి ఫలితంగా ఈ చట్టాన్ని తీసుకురాక తప్పలేదు. మొత్తానికి అన్ని పార్టీలూ, బిజెపితో సహా, ఈ చట్టాన్ని అంగీకరించక తప్పలేదు.
ఆ చట్టం ద్వారా ఉనికిలోకి వచ్చిన ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకే గాక, పట్టణ పేదలకూ జీవనాధారమైంది. కరోనా హమ్మారి కాలంలో పెద్ద సంఖ్యలో తమ తమ గ్రామాలకు మరలిపోయిన లక్షలాది కూలీలకు ఈ పథకమే జీవనాధారమైంది. చాలా పరిమిత స్థాయిలోనైనప్పటికీ, ఈ చట్టం సమాజంలోని వర్గ శక్తుల బల పొందికను మార్చింది. ఈ చట్టం ఫలితంగా కూలి రేట్లు పెరిగే ప్రమాదం ఉందని గ్రామీణ ధనిక రైతాంగం ఆందోళనకు గురవడమే కాదు, ఆ గ్రామీణ పేద శ్రామికులు తమ ''అదుపు'' తప్పిపోతారని, తమ చేయి దాటిపోతారని కలవరపడ్డారు. అందుకే ఆ వర్గాలు ఈ ఉపాధి హామీ చట్టాన్ని వ్యతిరేకించారు. వారి వర్గ వ్యతిరేకత అంతా అప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చిన బిజెపి చుట్టూ సమీకృతమైంది. ''అభివృద్ధి'' కోసం వెచ్చించవలసిన నిధులను ఇలా ఉపాధి పథకాల కోసం వృధా చేయడం వలన దేశాభివృద్ధి దెబ్బ తింటుందన్న తప్పుడు వాదన ముసుగులో బిజెపి ఈ పథకానికి వ్యతిరేకంగా వాదించడం మొదలుబెట్టింది. దానికి అదనంగా ఈ పథకం అమలులో అవినీతి పెరిగిపోతోందన్న వాదనను జోడించింది. ఫాసిస్టు స్వభావం కలిగిన బిజెపి వంటి శక్తులు ప్రజలకు ఎటువంటి 'హక్కులూ' ఉండరాదని, వారికి కేవలం 'బాధ్యతలు ' మాత్రమే ఉండాలని వాదిస్తాయి.
ఫలితంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త పథకం వచ్చింది. ఈ కొత్త చట్టాన్ని ఆమోదింపజేసుకోడానికి బిజెపి తన 'చేతివాటాన్నంతటినీ' ప్రదర్శించింది. కొత్త చట్టాన్ని చాలా హడావుడిగా ప్రవేశ పెట్టింది. పార్లమెంటులో దాదాపు ఎటువంటి చర్చా జరగనేలేదు. వెంటవెంటనే మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకుంది. ఈ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుండి అమలు కానుంది. ఈ కొత్త చట్టం పాత పథకంలోని అనేక అంశాలలో ప్రతికూల మార్పులను ప్రవేశ పెట్టింది. ఇంతవరకూ కేంద్రం 90 శాతం ఖర్చును భరిస్తూ వుంటే రాష్ట్రాలు 10 శాతం ఖర్చును భరించేవి. ఇప్పుడు కేంద్రం వాటా కాస్తా 60కి తగ్గి రాష్ట్రాల వాటా 40కి పెరిగింది. ఈ మార్పును కేంద్రం ఏకపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా తీసుకు వచ్చింది. ప్రస్తుత నయా ఉదారవాద విధానాల చట్రంలో ఇప్పటికే ఆర్థిక వనరులు కుదించుకుపోయి ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది తలకు మించిన భారంగా మారబోతోంది. పాత అమ్మకం పన్ను విధానం స్థానంలో జిఎస్‌టి ని తీసుకువచ్చినందువలన ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఈ మార్పు మరింత ఇబ్బందిని కలగజేయకమానదు.
పాత చట్టం ఉపాధి కోరుకున్న ప్రతీ ఒక్కరికీ ఉపాధిని కలుగజేయాల్సిందేనని నిర్దేశించింది. తద్వారా ఉపాధిని ఒక హక్కుగా పేదలకు కల్పించింది. ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడెక్కడ ఈ పథకాన్ని అమలు చేయాలో ప్రకటిస్తుంది. అక్కడ మాత్రమే ఉపాధి కల్పించబుడుతుంది (అటువంటి ప్రాంతాల్లో కల్పించవలసిన పనిదినాల సంఖ్యను 100 నుంచి 125 కి పెంచినట్టు ప్రకటించారు). అయితే ఈ కొత్త పథకానికి ఎటువంటి పరిమితులనూ విధించలేదని ప్రభుత్వ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అయితే, కొత్త చట్టంలో ఏముంది, ఏమి లేదు అన్నది ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే పాత చట్టాన్ని కూడా ఆచరణలో నీరుగారుస్తూ వచ్చింది మోడీ ప్రభుత్వం. ఆ వివరాలను లిబ్‌టెక్‌ ఇండియా అనే సంస్థ తన అధ్యయనంలో తెలిపింది.
2024-25తో పోల్చితే 2025-26లో ఉపాధి హామీ పనులు పొందిన గృహాల సంఖ్య 8.2 శాతం తగ్గిపోయింది. పనులు పొందిన శ్రామికుల సంఖ్య 9.1 శాతం తగ్గిపోయింది. మొత్తం కల్పించిన పని దినాలైతే ఇంకా ఎక్కువ మోతాదులో 21.5 శాతం మేరకు తగ్గిపోయాయి. 2024-25లో 268.44 కోట్ల పని దినాలు కల్పించారు. అదే 2025-26లో 210.73 కోట్ల పని దినాలను మాత్రమే కల్పించారు. దాంతో సగటున ఒక్కో కుటుంబమూ 2025-26లో రూ.1938 మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా మునుపటి కాలంలో పొందగలిగిన ఆదాయాల కన్నా 2025-26లో తగ్గిపోయాయి.
దేశంలో పేదరికం తగ్గిపోయిందని, అందువల్లే ఉపాధి హామీ పనులకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయిందని కొందరు వాదిస్తున్నారు. కాని ఇది బొత్తిగా అర్థం లేని వాదన. ఉపాధి హామీ పనులను కేటాయించమని కోరుతూ తమ పేర్లను నమోదు చేయించుకున్నవారు 2024-25లో 14.98 కోట్ల మంది ఉంటే, 2025-26లో వారి సంఖ్య 15.46 కోట్లకు పెరిగింది. వేరే చోట్ల పనులు దొరుకుతూ వుంటే ఈ పథకం కింద నమోదు చేసుకునేవారి సంఖ్య ఎందుకు పెరుగుతుంది?
ఈ పథకం కింద ఉపాధి పనులు తగ్గిపోవడానికి ఒక ముఖ్య కారణం బడ్జెట్‌ కేటాయింపులో విధించిన 5 శాతం కోత. దానికి తోడు అంతకు మునుపటి ఏడాదిలో చెల్లించవలసిన వేతనాల బకాయిలు రూ.10,000 కోట్లు పైగా పేరుకుపోయాయి. ఆ విధంగా ఈ పథకాన్ని ఆర్థికంగా నిధులను కేటాయించకుండా ఎండబెట్టారు. అందువలన పనిదినాల సంఖ్య తగ్గిపోయింది. కోరిన ప్రతీ ఒక్కరికీ పని కేటాయించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఈ విధంగా నీరుగార్చినప్పుడు కొత్త పథకంలో ఉపాధి ఒక హక్కుగా లేకుండా పోయిన తర్వాత పరిస్థితి ఏం కానున్నదో ఊహించవచ్చు.
అవినీతిని నిర్మూలించే పేరుతో ఈ పథకం అమలు కోసం కొత్త సాంకేతిక పద్ధతులను ప్రవేశ పెట్టారు. ఆధార్‌-ఆధారిత చెల్లింపుల పద్ధతిని, ఆన్‌లైన్‌ హాజరు విధానాన్ని తీసుకువచ్చారు. దాంతో ఈ-కెవైసి ని పూర్తి చేయలేని అనేకమంది పేదలకు పనులు దొరకకుండా పోతున్నాయి.
ఎస్‌.ఐ.ఆర్‌ లో కూడా ఇదే విధంగా 'ఆధునిక సాంకేతిక పద్ధతులను' ప్రవేశపెట్టారు. తద్వారా 'చొరబాటుదారుల' పేర్లను తొలగించవచ్చునని అన్నారు. కాని అచరణలో లక్షలాదిమంది నిజమైన వోటర్ల పేర్లు ఎగిరిపోయాయి. ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో కూడా అదే విధంగా 'సాంకేతికత'తో పేదలకు పనులను నిరాకరిస్తున్నారు. ఆ విధంగా ప్రజల హక్కులను ఊడలాక్కోడానికి 'సాంకేతికత'ను ఉపయోగించే ఎత్తుగడల అమలులో బిజెపి ప్రభుత్వం ఆరితేరింది.
కొత్త పథకంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల నిష్పత్తిలో వచ్చిన మార్పు ఫలితంగా ఈ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రాలకు ఇబ్బందులు పెరుగుతాయి. అదే విధంగా సాంకేతికత ప్రవేశ పెట్టడం ద్వారా చాలా మందికి పనులు దొరకకుండా పోయే ప్రమాదం ఉంది. పేరుకి పని దినాలను 100 నుండి 125కి పెంచుతామని ప్రకటించినా, ఆచరణలో మాత్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీస్తున్నారు.

ప్రభాత్‌ పట్నాయక్‌
( స్వేచ్ఛానుసరణ )

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్