నార్వే జర్నలిస్టు హెల్లె లైంగ్ స్వెండ్సెన్ పేరు గుర్తుంది కదా..! ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆమె ఒక ప్రశ్న అడగడం, దానికి తనదైన శైలిలో మోడీ జవాబియ్యకుండా వెళ్లిపోవడం, అదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ కావడం తదితర అంశాలన్నీ ఇటీవలే జరిగినవే కావడంతో ఇప్పడప్పుడే మరిచిపోయే అవకాశం లేదు. ఆమె అడిగిన ప్రశ్నకు ప్రధాని మోడీ ఆగి జవాబిచ్చి ఉంటే … ఏమి జరిగిఉండేది? ఈ ప్రశ్నకూడా ఆసక్తికరంగానే ఉంది కదూ! టెలిగ్రాఫ్ పత్రిక ఇదే విషయాన్ని హెల్లె స్వెండ్సెన్ ను అడిగింది. ఆమె అడిగిన ప్రశ్న ,మోడీ స్పందించిన తీరు చర్చనీయాంశం కావడం, భారత్‌లో కొందరు వ్యక్తులతో పాటు, ఒక సెక్షన్ మీడియా పనిగట్టుకుని స్వెండ్సెన్ కు వ్యతిరేకంగా విష ప్రచారాన్ని చేస్తున్న నేపధ్యంలో టెలిగ్రాఫ్ ఆమెను వీడియో కాల్ ద్వారా ప్రత్యేకంగా ఇంటర్యూ చేసింది. ఆ సందర్భంగానే ఈ ప్రశ్న వేసింది. దీనికి స్వెండ్సెన్ ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా?‘మరిన్ని ప్రశ్నలు వేసి ఉండేదాన్ని’ అని! ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండచ్చి జవాబిచ్చిన ఆమె ఆ వెంటనే ఆ ప్రశ్నల చిట్టాను కూడా విప్పింది. భారతదేశంలోని మానవ హక్కుల పరిస్థితిపై మాట్లాడాలని అడిగే దాన్ని అని ఆమె తొలుత చెప్పారు. ఆ తరువాత ‘ మీ దేశంలో మెరుగుపరచాల్సిన అంశాలేమిటి? ప్రస్తుతం జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను మీరు అదుపుచేస్తారా? ఆ మేరకు కట్టుబడి ఉంటారా? మార్పు కోసం చర్యలు తీసుకుంటారా? దేశీయంగా, అంతర్జాతీయ సంస్థల నుంచి వస్తున్న విమర్శలను మీరు పరిగణలోకి తీసుకుంటారా? అని అడిగిఉండేదాన్ని’ అని ఆమె వివరించారు. భారతదేశంలో నిజాయితీతో పనిచేస్తున్న స్వతంత్ర జర్నలిస్టుల నుంచి వచ్చే విమర్శనాత్మక ప్రశ్నలకు మీరు ఎప్పుడైనా సమాధానం ఇస్తారా?” అని కూడా ప్రశ్నించేదాన్నని ఆమె తెలిపారు.
గత పన్నెండు సంవత్సరాలుగా ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించని ప్రధాని మోడీ ఈ వరుస ప్రశ్నలకు జవాబులు చెప్పి ఉండేవారా? అసలు అన్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇచ్చేవారా? ఇవ్వన్నీ ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే! నిజానికి స్వెండ్సెన్ కాదు, మన దేశంలోనూ చాలా మంది పాత్రికేయులకు ఇటువంటి కోరికే ఉంది.. వారి దగ్గర ఉన్న ప్రశ్నల జాబితా ఇంతకన్నా పెద్దది, విస్తృతమైనది కూడా! కానీ, అటువంటి అవకాశం అసలు వస్తుందా అన్నదే అసలు ప్రశ్న! ఆ విషయం అటు ఉంచితే, టెలిగ్రాఫ్ ఇంటర్వ్యూలో ఆమె మరిన్ని వివరాలు చెప్పారు. ‘ఆ రోజు తను అడిగిన ప్రశ్న ప్రధానికి వినపడకుండా ఉండే అవకాశం లేదని ఆమె అన్నారు.‘ నేను ఆయనకు చాలా దూరంలో లేను. నేను రెండో వరుసలో కూర్చున్నాను. గది చాలా చిన్నది. నేను ప్రశ్న అడిగినప్పుడు ఆయన బయటకు వెళ్తున్నారు. కాబట్టి మేము చాలా దగ్గరగా ఉన్నాం.’ అని ఆమె చెప్పారు. ఈ వ్యవహారం ఇంత పెద్దదిగా మారడానికి భారత మీడియానే కారణమని స్వెండ్సెన్ అభిప్రాయపడ్డారు. ‘అది నేను చేసింది కాదు నన్ను విమర్శిస్తున్న భారత మీడియానే కథను నా చుట్టూ తిరిగేలా చేసింది.’ అని చెప్పారు. నార్వేలో పత్రికా స్వేచ్ఛపై మోదీకి ప్రశ్నలు ఎదురయ్యాయి’ అని చెప్పాల్సింది పోయి, వారు ఈ కథను జర్నలిస్టు గురించే మార్చేశారు.’ అని ఆమె విమర్శించారు. ఈ ఘటన తర్వాత రాహుల్ గాంధీతో సోషల్ మీడియాలో చాలా కొద్దిసేపు మాట్లాడానని, దానిని అధారంగా చేసుకుని తనను కాంగ్రెస్ ప్రతినిధి అని, జార్జి సోరస్ నిధులతో పనిచేసే ఏజెంట్ అని విమర్శలు చేశారని ఆమె అన్నారు. తనకు అవకాశం వస్తే రాహుల్‌గాంధీని కూడా విమర్శనాత్మక ప్రశ్నలే అడుగుతానని చెప్పారు. ఇరవై ఏళ్ల స్వెండ్సెన్ కు భారత్ రావాలని ఎంతో కోరిక. కానీ ఈ దశలో భారత్ తనను స్వాగతిస్తుందో లేదో అని ఆమె సందేహపడుతున్నారు. తన ప్రశ్నకు మోడీ సమాధానమివ్వకుండా వెళ్లిపోయినప్పటి నుండీ తనపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైందని ఆమె చెబుతున్నారు. ‘మోడీ మా దేశాన్ని వదిలి వెళ్లగానే ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ నా ఖాతాను సస్పెండ్ చేశాయి. రాత్రికి రాత్రే ప్రపంచంలోనే ప్రముఖ సోషల్ మీడియా ఖాతాలు నన్ను దూరం చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మొదట నా ఖాతాలు స్తంభించిపోయాయి. ఆ తరువాత గంటల వ్యవధిలో సస్పెండ్ అయ్యాయి. ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు కూడా నా ఖాతాలు పనిచేయడం లేదు. ఒక్కోసారి యాక్టివ్ అవుతున్నాయి. ఇంకోసారి మ్యూట్ అయిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో కచ్చితమైన కారణం నాకు తెలియడం లేదు` అంటున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి కాపీరైట్ ఉల్లంఘనలప్పుడు చోటుచేసుకుంటుంది. లేదా ప్రజా అశాంతికి కారణమయ్యేలా విస్తృత భయాందోళనలు వ్యాప్తి చేసినప్పుడు జరుగుతుంది. తప్పుడు సమాచారం ఆరోపణలపై ఒక ఖాతాపై పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇలానే డిజిటల్ వేదికగా ఆంక్షలు తలెత్తుతాయి. ‘అయితే, నేను అటువంటివి ఏమీ చేయలేదు’ అని స్వెండ్సెన్ అన్నారు. ‘ఇంత స్థాయి ట్రోలింగ్ కు గురైనా భారతదేశం నుండే కాక, విదేశాలలోని భారతీయులు పంపిన సంఘీభావ సందేశాలతో తన ఇన్ స్టా గ్రామ్ నిండిపోయింది` అని కూడా ఆమె చెప్పారు.
పత్రికా స్వేచ్ఛలో నిలకడగా అగ్రస్థానంలో నిలుస్తున్న తన దేశం గురించి కూడా ఆమె మాట్లాడారు. నార్వేలోని రాజకీయ నాయకులు, తమ చుట్టూ సంక్షోభం ఉన్నా, వారి జీవితం తలకిందులైనా, పెద్ద రాజకీయ కుంభకోణం జరిగినా, ఎలాంటి సమయాల్లోనైనా పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తారు. తరచూ ఒకే రోజు అనేక సార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నార్వే మాజీ ప్రధాని ఎర్నా సోల్బర్గ్ ఒకే రోజులో 14 చిన్న, పెద్ద మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారని ఆమె చెప్పారు. ఇంకా ఆమె ఇలా అన్నారు.
భారత్‌లో పరిస్థితిపై
నేను ప్రపంచంలోనే ఒక సౌకర్యవంతమైన మూల నుండి నా పనిని చేశాను. భారతదేశంలో ఉన్న పాత్రికేయేలు అసలైన కష్టాన్ని, నిజమైన శ్రమను మోస్తున్నారు` అని చెప్పారు. ఈ పరిస్తితిని వారు అధిగమించగలరన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ‘భారత్ కి రావాలని ఉంది. అక్కడికి వచ్చి రిపోర్టింగ్ చేయాలి. కానీ అది సాధ్యం కాదు. కాబట్టి భారతదేశ సంస్కృతి, చరిత్ర, ప్రజలను అధ్యయనం చేసేందుకైనా ఇండియా వస్తాను` అని ఆమె చెప్పారు.
– జ్యోతిర్మయి








కామెంట్‌లు (0)