మొన్నటి మే4 ఎన్నికల ఫలితాలకు ముందు వెనకా ఒక విశేషం వుంది. మేడే వేడుకలతో మొదలుపెట్టి వారోత్సవాలు ఒకవైపు. మే5 కారల్‌మార్క్స్ జయంతి మరోవైపు. వీటి మధ్యలో వచ్చిన ఎన్నికల ఫలితాలతో ముందే సిద్ధం చేసుకున్న కమ్యూనిస్టులు ఖతం పాట రికార్డు వేసింది బడా మీడియా. గెలుపులు, ఓటములు, గుణపాఠాలు, సమీక్షలు ఎప్పుడూ వుంటాయి, వుండాలి కూడా. కానీ ఖతం కథలేంటి? 1880ల నాడు ఎర్రజండా ఎగిరినప్పుడు ఏ ప్రభుత్వాలున్నాయి? అసలు ఎన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీలున్నాయి? ఈ సోకాల్డ్ జాతీయ, ప్రాంతీయ పార్టీలలో ఏవైనా వున్నాయా? దోపిడీ పీడన, పోరాటం మాత్రమే వున్నాయి. అవి ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నాయి. వాటిపై ఆ పోరాట వారసత్వం కూడా కొనసాగుతున్నది. అంతేగాని ముగిసిపోలేదు, పోదు కూడా. ”పీడితులు, తాడితులు, కార్మికులు, కర్షకులు నీ నీడలో నేడు నిలిచి వున్నారే…నిన్ను నమ్ముకు వారు బతుకుతున్నారే..నీకు సాటెవ్వరే సమతా పతాక” అని ఒక కవి రాసినట్టు ఆ ప్రాథమిక సత్యం మారుతుందా?
మనిషి పోతే మాత్రమేమి…
దేశమంతా అయిదు రాష్ట్రాల ఎన్నికల పలితాల హడావుడిలో వుంటే సుప్రీంకోర్టు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక సంచలన వ్యాఖ్య చేసింది. దాని ప్రభావం కూడా తీవ్రంగా వుండే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా వివాదాస్పదమైన మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో అధినేత సిహెచ్ రామోజీరావు మరణించినంత మాత్రాన నమోదైన కేసుల స్వభావం మారదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బ్యాంకింగు చట్టం కింద హిందూ అవిభక్త కుటుంబం (హెచ్.యు.ఎఫ్) డిపాజిట్లు సేకరించకూడదన్నది నిబంధన. ఈ కోణంలోనే గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరాలు లేవనెత్తడం, ఆ వివాదం అనేక మలుపులు తిరగడం చూశాం. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వుండగా మరోసారి సిఐడి ద్వారా తీసుకున్న చర్యలు విమర్శలకు కారణమైనాయి. అయితే తర్వాత రామోజీ కన్నుమూశారు. ఆయన మరణానంతరం కేసు మూసేయాలని హైకోర్టులో అభ్యర్థించగా కోర్టు ఆమోదించింది. దాన్ని ఉండవల్లి ఇప్పడు సవాలు చేశారు. ఆయన లేకపోయినా సంస్థ ఆస్తిపాస్తులు, ఆర్థిక కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయి గనక అప్పటి పరిణామాలకు బాధ్యత వహించవలసిందేనని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరి ఆయన లేరు గనక సంస్థ ఆస్తులు జప్తు చేస్తే ఒప్పుకుంటారా అని ప్రశ్నించింది. పూర్తి వివరాలు దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై సంస్థ, సర్కారు ఏం చెబుతాయో చూడాలి.
హైడ్రామాలు, వాస్తవాలు
ఒక్కో పరిణామం కొన్ని పాత విషయాలను పైకి తీసుకొస్తుంటుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఘట్టం అలాగే అనేక పాఠాలు పైకి తీసుకొచ్చింది. బెంగాల్‌లో ‘సర్’ పేరుతో అక్రమ ఓట్ల తొలగింపు ప్రభావం వంటివి వాటిలో ముఖ్యమైనవి. వాటన్నిటిపై లోతైన అంశాలు ఇప్పుడిప్పుడే బయిటకు వస్తున్నాయి. అయితే అరాచక అవినీతి పాలన ఫలితంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రజా వ్యతిరేకత భారీగానే తాండవించిందన్నది కూడా నిజం. ఈ తీర్పు సరైంది కాదు గనక తాను రాజీనామా చేయబోనని మమత భీష్మిస్తున్నారు. మమతా బెనర్జీకి బాగా ఆలవాటైన హైడ్రామాకు తప్ప దీనివల్ల నిజంగా రాజ్యాంగ పరంగా ఫరక్ పడేది వుండదు. ఎందుకంటే ఒక శాసనసభ అయిదేళ్ల కాలపరితి ముగియగానే ఆ ప్రాతిపదికన ఎన్నికైన ప్రభుత్వం కాలం చెల్లిపోతుంది. ఏ ముఖ్యమంత్రినైనా అయిదేళ్ల కాల పరిమితికి మించి కొనసాగించే అవకాశం గవర్నర్‌కి లేదు. నిజానికి గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మంచి మెజార్టీ మద్దతు వున్నా అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా బర్తరఫ్ చేసింది. తొలి కాంగ్రెసేతర కమ్యూనిస్టు ముఖ్యమంత్రి ఇఎంఎస్ నంబూద్రిపాద్ సర్కార్ ఉనికిని సహించలేక కృత్రిమమైన శాంతిభద్రతల సమస్య సృష్టించి 1959లో బర్తరఫ్ చేశారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు సమయంలో రాజీనామాకు నిరాకరించిన ఎన్టీఆర్‌ను కూడా అప్పటి గవర్నర్ రామ్‌లాల్ బర్తరఫ్ చేశారు. సిక్కింలో మొత్తం స్థానాలు వరసుగా గెలుస్తూ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి నార్ బహదూర్ భండారీని, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను కూడా నిరంకుశంగా తొలగించారు. సర్కారియా కమిషన్ దీన్ని నిరోధించడానికి కొన్ని సూచనలు చేసినప్పటికీ అయిదేళ్ల పదవీ కాలం ముగిసిన వారిని ఇంకా కొనసాగించే నిబంధనలేమీ లేవు. మళ్లీ వారే గెలిచినా వున్న సర్కారును తొలగించవలసిందే.
హీరోచిత పొలిటికల్ పోకడలు?
తమిళనాడులో టివికె విజరు వంద స్థానాల పైన సాధించి ప్రథమ శక్తిగా రావడంతో హీరోచిత రాజకీయాల పైకి మరోసారి చర్చ మళ్లింది. ఎంజిఆర్, ఎన్టీఆర్, జయలలిత, చిరంజీవి, పవన్ కల్యాణ్ అంటూ నెమరు వేత మొదలైంది. ఎంజిఆర్ మూడు దశాబ్దాల పాటు డిఎంకెలో వుంటూ సేవా సినీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైనారు. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధితో విభేదాల కారణంగానే స్వంత పార్టీ స్థాపించి అధికారంలోకి రాగలిగారు. ఇక ఎన్టీఆర్! అఖిలపక్ష ఉద్యమం, విజయవాడ విశాఖపట్టణం కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఓటమి వంటి పరిణామాలతో కాంగ్రెస్ పట్ల వ్యతిరేక వాతావరణం తారాస్థాయిన వున్నప్పుడే తెలుగుదేశం స్థాపించారు. ఆయనకు సినిమా ఆకర్షణ తోడైందిగాని ఆ ఎన్నికల్లో పక్కనున్న కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే నాయకత్వంలో జనతా పార్టీ కూడా విజయం సాధించింది. ఎన్టీఆర్ విజయాలు సొధించడంతో పాటు ఓటములూ ఎదురుదెబ్బలు కూడా చాలా చూశారు. ఇక జయలలిత ఎంజిఆర్ ప్రోత్సాహంతో ఎదిగారు. ఆయన మరణానంతరం అన్నా డిఎంకెలోనూ, కుటుంబంలోనూ కొన్ని వ్యతిరేకతలు వచ్చినా నిలదొక్కుకుని ఆధిపత్యం నిలుపుకోగలిగారు. అవినీతి ఆరోపణల నుంచి బిజెపితో స్నేహం, వ్యతిరేకత మళ్లీ చెలిమి రకరకాల విన్యాసాలు చేసి మరణంలోనూ మిస్టరీగా మిగిలారు. కొణిదెల చిరంజీవి కొంత ప్రభావం చూపినా కాంగ్రెస్‌లో విలీనానికే మొగ్గు చూపారు. పవన్ కల్యాణ్ స్పష్టమైన భావజాలానికి కట్టుబడకుండా రకరకాల రాజకీయ పిల్లిమొగ్గలు వేసి ఇప్పుడు బిజెపి-టిడిపి కూటమిలో భాగంగా ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వీరందరి విషయంలోనూ విధానపరంగా వారి చర్యలు తప్ప కేవలం వ్యక్తిగత ఆకర్షణ మాత్రమే సరిపోలేదని ఒప్పుకోవలసి వుంటుంది. ఇప్పుడు విజరు ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి మరి.
– పీపీ








కామెంట్‌లు (0)