కేరళ : దక్షిణ భారత రాష్ట్రాల్లో మరోసారి నిఫా వైరస్ భయం నెలకొంది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఒక వ్యక్తికి నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో రాష్ట్ర యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టింది. కోజికోడ్ లోని రమణట్టుకర మున్సిపాలిటీ పరిధికి చెందిన 43 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు.
పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థ (NIV) నుంచి వైరస్ నిర్ధారణ నివేదిక అందిన వెంటనే కేరళ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసింది. వైద్య నిపుణుల సూచనల మేరకు బాధితుడికి మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సను కూడా ప్రారంభించారు.
87 మంది పర్యవేక్షణలో ….
బాధితుడితో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు అధికారులు విస్తృత స్థాయిలో కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించారు. మొత్తం 87 మందిని పర్యవేక్షణ జాబితాలో చేర్చారు. వీరిలో 58 మంది ఆరోగ్య సిబ్బంది, 14 మంది కుటుంబ సభ్యులు, ఐదుగురు స్నేహితులు ఉన్నారు. అధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులను ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంచారు. అయితే, ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్న ఎవరికీ వైరస్ లక్షణాలు కనిపించలేదని, ఇప్పటివరకు సేకరించిన నమూనాల పరీక్ష ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ సమాజంలో విస్తరించిన సూచనలు లేవని, అందువల్ల ప్రస్తుతం కంటైన్‌మెంట్ జోన్లు ప్రకటించే అవసరం లేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) నిపుణుల బృందం కూడా కోజికోడ్ కు చేరుకుంది.
తమిళనాడు సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ….
కేరళలో నిఫా కేసు వెలుగులోకి రావడంతో పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా అప్రమత్తమైంది. కేరళతో సరిహద్దు కలిగిన నీలగిరి, కోయంబత్తూర్, తేని, కన్యాకుమారి, కడలూరు జిల్లాల్లో ఆరోగ్య శాఖలను సిద్ధంగా ఉంచింది. తాళూర్, నాడుగని, నంబియార్‌కున్ను, సోలాడి, పట్టవాయల్ తదితర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను మోహరించి కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద లక్షణాలు ఉన్నవారిని వైద్య శిబిరాలకు తరలించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నారు.
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు ….
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నిఫా వైరస్ వ్యాప్తికి అనుకూల కాలంగా భావిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గబ్బిలాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
గబ్బిలాలు లేదా పక్షులు కొరికిన పండ్లను తినకూడదు.
మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను బాగా కడిగి తినాలి.
జ్వరం వంటి లక్షణాలు ఉన్నప్పుడు మాస్క్ ధరించి ఆసుపత్రికి వెళ్లాలి.
పెంపుడు జంతువులను తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి.
ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచిన ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు: 0495-2373901, 9072007767. ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.









కామెంట్‌లు (0)