test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒక్క రోజులో 40 ఇంటర్వ్యూలు – సమంత సరికొత్త రికార్డు

2 గంటల క్రితం

40 interviews in a single day – Samantha sets a new record.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 12:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వినోదం : సినిమాల విజయంలో మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సినిమా షూటింగ్ దశ నుంచి విడుదలయ్యే వరకు, ప్రేక్షకల్లో అంచనాలు పెంచడానికి, సినిమాపై ఆసక్తిని సృష్టించడానికి ఈ ప్రచారాలు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో ఒక చిత్రాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించామన్నది ఎంత ముఖ్యమో.. దాన్ని ప్రేక్షకుల గుండెల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లామన్నది కూడా అంతే కీలకం. మరీ ముఖ్యంగా ఓటీటీ విప్లవం వచ్చాక, ప్రేక్షకులు థియేటర్ల వైపు రావాలంటే ప్రమోషన్ల ద్వారా క్రియేట్ చేసే హైప్ చాలా అవసరమవుతోంది. అందుకే ఇప్పటి తరం మేకర్స్ సరికొత్త ప్రచారాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రేసులో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక కళ్లు చెదిరే సరికొత్త రికార్డును తన పేరుతో లిఖించుకున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’. జూన్ 19వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న సమంత.. కేవలం ఒకే ఒక్క రోజులో ఏకంగా 40 వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.

ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు ..!
సాధారణంగా ఒక సినిమా ప్రమోషన్స్ అంటే హీరో హీరోయిన్లు నాలుగైదు ఇంటర్వ్యూల్లో పాల్గొనడమే ఎక్కువ. కానీ సమంత మాత్రం తన సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఉదయం నుంచి రాత్రి వరకు నాన్‌స్టాప్‌గా 40 డిజిటల్, లీడింగ్ మీడియా ఛానెళ్లకు వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒకే రోజులో ఈ స్థాయిలో ఇంటర్వ్యూలు ఇవ్వడం టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డని, ఇది సమంత డెడికేషన్‌కు నిదర్శనమని సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఈ ఇంటర్వ్యూలన్నీ ఒకట్రెండు రోజుల్లో యూట్యూబ్ వేదికగా సందడి చేయనున్నాయి.

‘బాషా’ తరహా స్క్రీన్‌ప్లే.. చీరకట్టులో యాక్షన్ స్టంట్స్
సమంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి ఆమె భర్త రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు సహ నిర్మాతగా వ్యవహరించారు. రజనీకాంత్ క్లాసిక్ హిట్ ‘బాషా’ తరహాలోనే.. ఒక సీక్రెట్ ఫ్లాష్‌బ్యాక్ ఉన్న ఒక సాధారణ మధ్యతరగతి గృహిణి పాత్రలో సమంత ఇందులో నటించారు. దర్శకురాలు నందిని రెడ్డితో ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత సమంత కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సమంత ఎలాంటి డూప్ సహాయం తీసుకోకుండా, కేవలం చీరకట్టులోనే భీకరమైన యాక్షన్ సీన్లు చేయడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 20 నిమిషాల పక్కా రన్‌టైమ్‌తో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

ఈ సినిమాలో సమంతతో పాటు వర్సటైల్ యాక్టర్ గుల్షన్ దేవయ్య, దిగంత మంచాలే, సీనియర్ నటి గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు చేసిన సమంత, మొదటిసారి పూర్తి స్థాయి యాక్షన్ కామెడీ జోనర్‌లో చేస్తుండటం, పైగా ప్రమోషన్ల కోసం ఈ స్థాయిలో కష్టపడుతుండటంతో ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 19న ఈ ‘బంగారం’ థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తుందో వేచి చూడాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్