– నెదర్లాండ్స్ పర్యటనలో ప్రధాని వ్యాఖ్యలు
ద హేగ్ : ప్రపంచం ప్రస్తుతం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ది హేగ్ నగరంలో ప్రవాస భారతీయులతో శనివారం నిర్వహించిన సమావేశంలో భారత పురోగతి, ప్రపంచ సవాళ్లు, భారత్- నెదర్లాండ్స్ సంబంధాలు తదితర అంశాలపై ప్రసంగించారు. ఈ దశాబ్ది ఆరంభంలోనే కరోనా మహమ్మారి వచ్చిందని, ఆ తర్వాత యుద్ధాలు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు ఇంధన సంక్షోభం ప్రపంచాన్ని వేధిస్తోందని తెలిపారు. ఈ దశకం ప్రపంచానికి వైపరీత్యాల (డిజాస్టర్ల) దశాబ్దిగా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితులు త్వరగా మారకపోతే గత ఎన్నో దశాబ్దాల అభివృద్ధి ఫలితాలు చెదిరిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ జనాభాలో అనేక మంది పేదరికంలోకి జారిపడే పరిస్థితి రావచ్చన్నారు. ఇక్కడి ప్రవాస భారతీయుల ఉత్సాహం చూస్తుంటే తాను భారత్‌లోని ఏదో పండుగలో పాల్గొన్నట్లుగా అనిపించిందని ప్రధాని వ్యాఖ్యానించారు. నెదర్లాండ్స్ నాయకత్వంతో ఎప్పుడు మాట్లాడినా అక్కడి భారతీయుల కృషి, ప్రతిభ గురించి ఎంతో ప్రశంసిస్తారని చెప్పారు. ది హేగ్ నగరం భారత్- నెదర్లాండ్స్ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందని పేర్కొన్నారు. తరాలు మారినా, దేశాలు మారినా భారతీయ కుటుంబ విలువలు, సంస్కృతి మారలేదని కొనియాడారు. డచ్ భాషను స్వీకరించినా తమ మూల భాషలను, సంప్రదాయాలను ప్రవాస భారతీయులు వదల్లేదని అభినందించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలు రెసిలియెంట్ సప్లై చైన్‌పై దృష్టి పెడుతున్నాయని ప్రధాని తెలిపారు. భారత్, నెదర్లాండ్స్ కలిసి విశ్వసనీయమైన, పారదర్శకమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన సరఫరా వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకు 20 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు కేవలం నాలుగు యూనికార్న్ కంపెనీలు మాత్రమే ఉండగా ఇప్పుడు 100కు పైగా ఉన్నాయని వెల్లడించారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠ పెరుగుతోందని ప్రధాని మోదీ చెప్పారు. ఎఐ సమ్మిట్, జి20 సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించగలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 90 కోట్ల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటు వేశారని వెల్లడించారు. ఇయు దేశాల మొత్తం జనాభాను కలిపినా 64 కోట్ల మంది ఉండరంటూ భారత ప్రజాస్వామ్య విస్తృతిని తెలిపారు. ప్రపంచానికి ప్రజాస్వామ్యానికి భారత్ మాతృదేశమని పేర్కొన్నారు.
రాజు విలియం అలెక్జాండర్తో భేటీ
నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా శనివారం నాడు ఇక్కడి రాయల్ ప్యాలెస్‌లో రాజు విలియం – అలెగ్జాండర్, రాణి మెక్సిమాతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. భారత్ – నెదర్లాండ్స్ మధ్య సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరాభివృద్ధి, వాణిజ్య, జలవనరుల వంటి రంగాల్లో స్నేహబంధం మరింత బలోపేతానికి తమ భేటీ ఉపయోగపడిందని మోడీ చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టు చేశారు. ప్రయోజనాల పరస్పర పంపిణీ, విశ్వ అవసరాలకు తగినవిధంగా భవిష్యత్ నిర్మాణంలో పరస్పర విశ్వాసం ఆధారంగా భారత్ – నెదర్లాండ్స్ అనుసంధానమైవున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చోళుల కాలం నాటి తామ్ర వస్తువులను నెదర్లాండ్స్ ..భారత్‌కు అప్పగించింది.
ఇది వైపరీత్యాల దశాబ్ది
16 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 16, 2026, 11:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్లు (0)