test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బతుకులు బుగ్గి

03 జూన్, 2026

Fire breaks out at south Delhi restaurant
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 01:01 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

• ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం
• 21 మంది మృతి
• 40 మందికి గాయాలు
• మృతుల్లో అత్యధికులు విదేశీయులే
• సహాయక చర్యల్లో జాప్యంతో భారీ ప్రాణనష్టం
• భద్రతా ప్రమాణాలు పాటించని భవన యాజమాన్యం
• రాష్ట్రపతి, ప్రధాని దిగ్ర్భాంతి

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బుధవారం ఉదయం ఒక హోటల్‌‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో 21 మంది నిండు ప్రాణాలు బుగ్గి అయ్యాయి. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సాకేత్‌‌లోని మాక్స్‌ ఆస్ప్రతికి 39 మంది తరలించగా..అప్పటికే వారిలో 18 మంది చనిపోయారు. మిగిలినవారికి చికిత్స అందిస్తున్నామని, వీరిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంలో జాప్యం చోటుచేసుకోవడం వల్లే భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధితుల్లో అత్యధికులు మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి హోటల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఢిల్లీలోని మాలవీయ నగర్‌‌లో ఉదయం 8.50గంటల సమయంలో ఫ్లరిష్‌ ‌స్టే బ్రెడ్‌ అండ్‌ ‌బ్రేక్‌‌ఫాస్ట్‌ ‌హోటల్‌‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం ఎలక్ట్రిక్‌ ‌స్టవ్‌ ఆన్‌‌ చేయడానికి ప్రయత్నించగానే మంటలు వచ్చాయని చెఫ్‌ ‌కేసర్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశానని, బయటకు వచ్చి చూసేసరికి ఒక్కసారిగా మంటలు హోటల్‌ ‌అంతా వ్యాపించినట్లు కనిపించిందని తెలిపారు. మంటలు చెలరేగిన సమయంలో సీల్డ్‌ ‌గాజు కిటికీలు, సెన్సార్‌‌తో పనిచేసే గేట్ల వల్ల సహాయక సిబ్బంది వెంటనే చర్యలు తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. దీనికి తోడు హోటల్‌‌లో పరిమితికి మించి జనాభా వున్నట్లు తెలుస్తోంది. కిక్కిరిసిన రూములు, పైగా అగ్ని ప్రమాదం జరిగినపుడు తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలు కూడా హోటల్‌ ‌యాజమాన్యం ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఫైర్‌ ‌నో అబ్జెక్షన్‌ ‌సర్టిఫికెట్‌ ఈ భవనానికి లేదు. దీంతో మొత్తంగా హోటల్‌ ఒక మృత్యుకూపంగా మారింది. చాలా వేగంగా భవనాన్ని పొగ, మంటలు కమ్ముకోవడంతో డజన్ల సంఖ్యలో లోపలివారు తప్పించుకునే వీలు లేకపోయింది.
సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు కిటికీలు బద్దలు కొట్టి, దుప్పట్లు కప్పి లోపల వున్నవారు బయటకు వచ్చేందుకు సాయపడ్డారు. ఐదంతస్తుల ఈ హోటల్‌ ‌కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బ్రెడ్‌ అండ్‌ ‌బ్రేక్‌‌ఫాస్ట్‌ ‌పథకం కింద నడుస్తోంది. ఆ లైసెన్స్‌ ప్రకారం ఆరు గదులకు మాత్రమే అనుమతి వుంటుంది. కానీ భవనం బేస్‌‌మెంట్‌‌, గ్రౌండ్‌‌ఫ్లోర్‌, పైన గల ఐదు అంతస్తుల్లో ఏకంగా 25 గదులు వున్నట్లు తెలుస్తోందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. పైన టెర్రస్‌ ‌కూడా వుందని, అన్ని అంతస్తుల్లోనూ గదులు వున్నాయని, ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేందుకు కూడా వీల్లేని రీతిలో అత్యంత అధ్వాన్నంగా ఆ నిర్మాణం వుందని చెప్పారు. అయితే వెంటనే అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలికి రావడంలో ఆలస్యమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ హోటల్‌ ‌భవనానికి ఎదురు భవనంలో వుండే అంజుమ్‌ అనే మహిళ మాట్లాడుతూ పొద్దునే తన తండ్రికి మందులు ఇవ్వడానికి ఆయన గదిలోకి వెళ్ళేసరికి ఏదో వాసన వచ్చిందని, ఆ వెంటనే ఒక స్పార్క్‌‌లా వచ్చిందని, భవనం మంటల్లో చిక్కుకుందని తెలిపారు. పెద్ద ఎత్తున పేలుళ్ళ శబ్దాలు కూడా వినిపించాయన్నారు. చాలామంది ప్రాణాలు కాపాడుకోవడానికి పైఅంతస్తుల నుండి కిందకు దూకేశారని తెలిపారు. వీరిలో మహిళలు కూడా వున్నారన్నారు. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా వున్నాయి. ప్రతి ఒక్కరూ తీవ్రంగా కాలిపోయారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఢిల్లీ పోలీసులు కల్పబుల్‌‌హోమిసైడ్‌ అభియోగాల కింద ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశారు. ఢిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ భవనం ఎన్నేళ్ళ కాలం నాటిది, యజమాని ఎవరు అన్న వివరాలు కనుగొని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్‌ ‌స్థాయీ సంఘం చైర్మన్‌ ‌సత్య శర్మ తెలిపారు.

Live Updates
12 days agoJun 03, 2026 03:40 PM IST

several foreigners among those dead

12 days agoJun 03, 2026 03:31 PM IST

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం నుండి రక్షించిన వారిలో 15 మంది ఐసియులో చికిత్స పొందుతున్నారని మ్యాక్స్ హెల్త్‌కేర్ వైద్యులు తెలిపారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని అన్నారు. స్వల్ప గాయాలైన ఐదుగురికి ప్రాథమిక చికిత్స అందించి, డిశ్చార్జ్ చేశామని చెప్పారు. తీవ్ర గాయాలైన ఒకరిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. మృతులలో స్థానికులతో పాటు విదేశీ పౌరులు కూడా ఉన్నారని వైద్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

12 days agoJun 03, 2026 03:22 PM IST

హృదయ విదారకం: రాష్ట్రపతి ముర్ము

ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన అత్యంత హృదయ విదారకమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ఎక్స్ లో తెలిపారు.

12 days agoJun 03, 2026 03:10 PM IST

మృతుల్లో విదేశీయులు అత్యధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో బుధవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 21మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాదం నుండి మారు 40మందిని రక్షించినట్లు ఫైర్ సర్వీస్ తెలిపింది.

ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

12 days agoJun 03, 2026 01:42 PM IST

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ లోని హోటల్ లో ఉదయం 8.50గంటలకు అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అగ్నిమాపక కేంద్రం, సహాయక బృందాలు  అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. విదేశీయులు సహా పలువురు  ఈ ప్రమాదంలో గాయపడ్డారు.  ప్రమాదానికి గల కారణం తెలియాల్సి వుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్