లక్నో : ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. హమీర్పూర్ జిల్లాలో బేత్వా నదిపై మొరాకందర్, కందౌర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన శుక్రవారం తెల్లవారుజామున కూలిపోయిందని, ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆరుగురు కార్మికులు మృతి చెందారని యుపి అధికారులు వెల్లడించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని, సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని వారు తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం, ఈదురుగాలులు వీచాయి. ఈ సమయంలో వంతెనలోని ఒక భాగంపై నిద్రిస్తున్న కార్మికులపై నిర్మాణ భాగం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడే పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
ఈ ప్రమాదంపై హమీర్పూర్ అదనపు ఎస్ పి అర్వింద్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. రాత్రి సుమారు 2 గంటల సమయంలో వంతెన స్లాబ్ కూలిపోయిందని సమాచారం అందిందన్నారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు మృతదేహాలను వెలికితీసామని, ఇంకా శిథిలాల కింద కార్మికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షం కురుస్తున్న సమయంలోనూ వంతెన నిర్మాణ పనులను అధికారులు కొనసాగించారు. అర్ధరాత్రి వేళ కార్మికులందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో వాతావరణం మారిపోయి, భయంకరమైన ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్లు, భారీ గడ్డర్లు తీవ్రంగా ఊగిపోయి, క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిపోయాయి. వంతెన కింద తాత్కాలిక షెడ్లలో నిద్రిస్తున్న కార్మికులపై ఈ భారీ ఐరన్ సామాగ్రి, కాంక్రీట్ గడ్డర్లు ఒక్కసారిగా పడటంతో, వారంతా నిద్రలోనే ఆ శిథిలాల కింద ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో మరికొంతమంది కార్మికులకు తీవ్ర గాయాలవ్వగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
కాగా శుక్రవారం రాత్రి వరకూ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం అందజేస్తారనే విషయాన్ని ప్రకటించలేదు.
యుపిలో ఘోరం
29 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 30, 2026, 12:18 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్లు (0)