- పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే
దేశంలో నిరుద్యోగం కోరలు చాచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరింతగా పెరిగి ఆందోళనకు దారితీస్తోంది. 2026 ఏప్రిల్‌లో దేశ నిరుద్యోగిత రేటు 5.2 శాతానికి ఎగబాకింది. ఇది ఆరు నెలల గరిష్ఠసాయి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మార్చిలో ఇది 5.1 శాతంగా ఉండగా, తాజాగా స్వల్పంగా పెరిగినట్లు తెలిపింది. అయితే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత మాత్రం 10 నెలల కనిష్ఠానికి తగ్గినట్లు చెప్పింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) నెలవారీ బులెటిన్‌లో పేర్కొంది.
గ్రామీణ ప్రాంతాల్లోనే నిరుద్యోగిత పెరుగుదల
గ్రామీణ భారతావనిలోనే నిరుద్యోగిత గతంలో పోలిస్తే ఏప్రిల్ నెలలో భారీగా పెరిగింది. మార్చిలో 4.3 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 4.6 శాతానికి పెరిగింది. ఇక పట్టణ ప్రాంతాల్లో మాత్రం నిరుద్యోగిత 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది. ఇది ఏప్రిల్ తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి అని గణంకాలు తెలిపాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో 6.6 శాతం నమోదైంది.
పట్టణ మహిళలకు ఉపాధి అవకాశాలు
పట్టణ మహిళల నిరుద్యోగిత రేటు మార్చిలో 9.0 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 8.5 శాతానికి తగ్గింది. ఇది ఏడాది కనిష్ఠ స్థాయిని సూచిస్తుంది. పట్టణ పురుషుల నిరుద్యోగిత కూడా 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా చూస్తే మహిళల ఉద్యోగ పరిస్థితి ఇంకా సవాళ్లతోనే ఉందని నివేదిక తెలిపింది. మహిళల మొత్తం నిరుద్యోగిత రేటు మార్చిలో 5.3 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 5.4 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 5.0 శాతంగా నమోదైంది. ఇక పురుషుల నిరుద్యోగిత కూడా మార్చిలో 5.0 శాతం నుంచి ఏప్రిల్‌లో 5.1 శాతానికి పెరిగింది. అయితే 2025 ఏప్రిల్‌లో నమోదైన 5.2 శాతంతో పోలిస్తే స్వల్పంగా తక్కువగానే ఉంది.
తగ్గిన కార్మిక భాగస్వామ్యం
నిరుద్యోగిత పెరుగుదలతో పాటు కార్మిక శక్తిలో పాల్గొనే వారి సంఖ్య కూడా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 15 ఏళ్లు పైబడిన వారి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్‌ఎఫ్‌పిఆర్) మార్చిలో 55.4 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 55.0 శాతానికి పడిపోయింది. అలాగే వర్కర్ పాప్యులేషన్ రేషియో (డబ్ల్యూపిఆర్) 52.6 శాతం నుంచి 52.2 శాతానికి తగ్గింది. మహిళల కార్మిక భాగస్వామ్యం కూడా తగ్గుముఖం పట్టింది. మహిళల మొత్తం ఎల్‌ఎఫ్‌పీఆర్ మార్చిలో 34.4 శాతం ఉండగా, ఏప్రిల్‌లో ఎనిమిది నెలల కనిష్ఠమైన 33.9 శాతానికి పడిపోయింది. పట్టణ మహిళల భాగస్వామ్యం 25.2 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. ఈ సిరీస్‌లో ఇదే అత్యల్ప స్థాయి అని నివేదిక పేర్కొంది.
ఏప్రిల్ నెలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రామీణ పురుషులలో డబ్ల్యూపీఆర్ 74.5 శాతంగా ఉంది. అదే సమయంలో గ్రామీణ మహిళల్లో డబ్యూపీఆర్ 36.5శాతం గా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో, ఇదే కాలంలో పురుషులలో 70.7శాతం నమోదు కాగా, మహిళల్లో ఇది 22.9 శాతంగా ఉన్నట్లు నివేదికలు తెలిపింది.








కామెంట్‌లు (0)