test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టార్గెట్ విజయన్

28 మే, 2026

cpm pinarayi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 28, 2026, 07:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • బిజెపి కక్షసాధింపు.. కాంగ్రెస్ సహకారం *సిఎం ఢిల్లీకి వెళ్లిన సమయంలో రంగంలోకి ఇడి

  • గంటల కొద్ది సోదాలు… రిక్త హస్తాలతో వెనక్కి

  • భగ్గుమన్న కేరళం…

  • ఢిల్లీలో ఇడి ఆఫీసు ముట్టడి .. *ఎంఎ బేబితో సహా పలువురి అరెస్ట్

  •  నేడు నిరసనలకు పిలుపు

  • దాడులకు భయపడం : విజయన్‌

తిరువనంతపురం : రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటున్న నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం కేరళంలోనూ అదే కుట్రకు దిగింది. మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్షనేత, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ లక్ష్యంగా చేసుకుని ఎన్ ఫోర్స్ మెంట్ (ఇడి) అధికారులు దాడులకు దిగారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వం ఈ దాడులకు సహకరించింది.
కేరళం ముఖ్యమంత్రి వి.డి సతీషన్ ప్రధానమంత్రిని కలవడానికి ఢిల్లీకి వెళ్లిన సమయంలోనే పెద్ద సంఖ్యలో కేంద్రబలగాలతో పినరయి అద్దెకుంటున్న నివాసాన్ని చుట్టుముట్టడం గమనార్హం. బుధవారం తెల్లవారుజామున ఆరుగంటలకు ప్రారంభమైన ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. కేరళ ప్రజానీకం భగ్గుమన్నారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. తిరువనంతపురంలో, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్‌ ‌నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు రోడ్డుపై గట్టిగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. పినరయిలో కేంద్ర కమిటీ సభ్యులు ఇ.పి.జయరాజన్‌, కె.కె.శైలజల నాయకత్వంలో నిరసనలు జరిగాయి. ఢిల్లీలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీతో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ ఇడి ప్రధాన కార్యాలయానికి నిరసన ప్రదర్శన నిర్వహించారు. గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు ఎల్‌‌డిఎఫ్‌ ‌పిలుపిచ్చింది.

ఏక కాలంలో 12 చోట్ల ..

తిరువనంతపురంలోని పినరాయి విజయన్ అద్దె నివాసం, కన్నూర్‌లోని ఆయన కుటుంబ నివాసంలో తొలుత ఈ దాడులు ప్రారంభమయ్యాయి. విజయన్ కుమార్తె, ఎక్సాలాజిక్ అధినేత్రి వీణా టి నివసిస్తున్న ఇంటితో పాటు, వీణా జీవిత భాగస్వామి, బేపూర్ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి పి.ఎ. మహమ్మద్ రియాస్‌కు చెందిన కోజికోడ్‌లోని ఇంట్లో కూడా ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం మీద కేరళలో పది చోట్ల, బెంగళూరులో రెండు చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగాయి. వందల సంఖ్యలో ఉన్న బలగాలతో ఇడి అధికారులు ఢిల్లీ నుండి తిరువనంతపురం చేరుకున్నా, తమకు ఎటువంటి సమాచారం లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రితో రమేష్ చెన్నితాల చెప్పడం, అదే సమయంలో ముఖ్యమంత్రి స్థానికంగా అందుబాటులో లేకుండా ఢిల్లీకి వెళ్లడంతో బిజెపి, కాంగ్రెస్ లు కలిసి కుట్ర చేశాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్న కీలక మంత్రులు సైతం తమకేమి తెలియదని చెబుతుంటే, సిఎం కార్యాలయంలోని కొందరు ఉన్నతాధికారులకు దాడుల విషయం ముందే తెలుసని చెప్పినట్లు మీడియాలో వార్తలు రావడం గమనార్హం. ఈ పరిణామాలతో కేరళ ప్రజానీకం ఒక్కసారిగా భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి కక్కడ నిరసనలకు దిగారు. పినరయి విజయన్ నివాసం వద్దకు వందలాదిమంది చేరుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇడి దాడులు కొనసాగినంతసేపు ఈ నిరసనలు కొనసాగాయి.

దాడుల వెనుక కుట్ర

వివాదాస్పద ఎక్సాలాజిక్-సిఎంఆర్ఎల్ సాకుతో ఇడి సుదీర్ఘ విరామం తరువాత ఈ దాడిని నిర్వహించింది. పినరయి విజయన్‌ ‌కుమార్తె టి.వీణకు చెందిన కంపెనీ ఎక్సాలజిక్‌కు, సిఎంఆర్‌ఎల్‌కి మధ్య చట్టబద్ధంగా జరిగిన వాణిజ్య లావాదేవీని మనీలాండరింగ్‌‌గా ముద్రవేయడానికి దీర్ఘకాలంగా సాగుతున్న వేధింపుల్లో ఈ దాడులు ఒక భాగం. గతంలో జరిగిన దర్యాప్తుల్లో ఇందుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలను కనుగొనడంలో ఇడి విఫలమైంది. అయినప్పటికీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఇడి అధికారులు మళ్ళీ రావడం చూస్తుంటే కచ్చితంగా ఉన్నత స్థాయిలో జరిగిన కుట్ర అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాని మోడీని కలిసేందుకు ముఖ్యమంత్రి సతీశన్‌ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం హోం మంత్రి అమిత్‌ ‌షాతో ఆయన సమావేశం కావడానికి ముందుగానే ఈ దాడులు మొదలయ్యాయి. మీడియా దీన్ని గురించి ప్రశ్నించగానే వ్యాఖ్యానించడానికి సతీశన్‌ ‌తిరస్కరించారు. ఇడి దాడుల వెనుక ఢిల్లీలో బిజెపి, కాంగ్రెస్‌లు సంయుక్తంగా తీసుకున్న రాజకీయ నిర్ణయం ఉందనడానికి బలమైన సూచనలు ఉన్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి ఎక్స్ లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుని ప్రతిపక్ష నాయకులకు వేటాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రజలు దృఢంగా విశ్వసిస్తున్నారని, ఈ రాజకీయ నాటకాలను చట్టబద్ధంగా, ప్రజలను సమీకరించి ఎదుర్కొంటామని కేరళ సిపిఎం ప్రకటించింది.

ఖాళీ చేతులతో వెనక్కి …

విజయన్ ను అవినీతి కేసులో ఇరికించాలన్న దురుద్ధేశంతో దాడులకు దిగిన ఇడి చివరకు అవమానకరంగా వెనుతిరగాల్సి వచ్చింది. గంటల తరబడి సోదాలు జరిపినప్పటికీ, వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. పినరయి ఇంట్లో సోదాలు నిర్వహించిన వారు తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఒక లేఖపై రాసి, సంతకాలు చేసి ఇచ్చి వెళ్ళారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగాయి. ఇంటిలోని పత్రాలు, డిజిటల్ పరికరాలు, మరియు ఆర్థిక లావాదేవీల వివరాలు ఖచ్చితమైనవని నిర్ధారించుకోవడానికి తనిఖీ చేశారు. గంటల తరబడి తనిఖీలో ఎలాంటి పత్రాలు లభించలేదని పేర్కొంటూ ఇడి సహాయ సంచాలకులు ప్రశాంత్ సౌభరి ఒక పత్రంపై రాసి సంతకం చేశారు. తనిఖీ శాంతియుతంగా జరిగిందని కూడా ఆ నోట్‌లో పేర్కొన్నారు. దాడుల విషయం తెలియడంతో స్థానికులు మరియు సిపిఎం కార్యకర్తలు విజయన్ ఇంటి వద్దకు పోటెత్తారు. నివాసం ముందు రోడ్డుపై కూర్చొని ఇడి అధికారులు తిరిగి వెళ్ళేంతవరకు నినాదాలు చేస్తూనే ఉన్నారు. మహ్మద్ రియాజ్ ఎంఎల్ నివాసంలో వృద్ధులైన తల్లిదండ్రులను ఏడు గంటల పాటు నిర్బంధించిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తిరిగి వెళ్లారు. కోటులిలోని ‘గ్రేస్’లో ఉదయం 7.10 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. ఇక్కడ కూడా ఎలాంటి పత్రాలు లభించలేదని ఇడి బృందం లిఖిత పూర్వకంగా పేర్కొంది.

బిజెపి దాడులకు భయపడం : పినరయ్

కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా బిజెపి చేపట్టే దుర్మార్గపు దాడులకు తాము భయపడేది లేదని పినరయి విజయన్ అన్నారు. ఇడి తనిఖీల అనంతరం ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తన నివాసం ఎదుట రాజకీయ ప్రతీకార చర్యలకు నిరసనగా ఆందోళనలు
చేసిన వారికి ఆయన పిడికిలి బిగించి అభివాదం చేశారు. పై నుండి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే అధికారులు తన ఇంటికి వచ్చారన్నారు. ఈ సోదాలు కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ వంటి వారిని సంతృప్తిపరిచి వుంటాయన్నారు. పినరయి నివాసంపై ఎందుకు ఇడి దాడి చేయలేదని, ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని రాహుల్‌ ‌గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రశించిన సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యలతో తమను నిర్వీర్యం చేయగలమని ఎవరూ కూడా భ్రమల్లో వుండరాదన్నారు. ‘ప్రతి దశలోనూ, శత్రువులు పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నించారు, కానీ పార్టీ సహచరులు, దేశ ప్రజలు అచంచలమైన మద్దతును అందించారు. ఈనాడు, అలాంటి మద్దతుకు ఎలాంటి కొరత లేదని రుజువైంది` అని ఆయన అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్