test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల ఫలితాలపై కూలంకష సమీక్ష

25 మే, 2026

cpm logo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 26, 2026, 12:38 పూర్వాహ్నం | 9 నిమిషాల చదవడం

- యుద్ధం సాకుతో పెట్రో మంటపై ఆగ్రహం
- కార్మిక, కర్షక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ప్రతిఘటనా పోరాటాలు
- జూన్‌‌లో సామ్రాజ్య వ్యతిరేక ప్రచారం
- సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయాలు
న్యూఢిల్లీ : ఈ నెల 22-24 తేదీల్లో ఢిల్లీలోని హరికిషన్‌ ‌సింగ్‌ ‌సూర్జిత్‌ ‌భవన్‌‌లో సమావేశమైన సిపిఎం కేంద్ర కమిటీ పలు అంశాలపై సవివరంగా చర్చించింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెనుక గల రాజకీయ, నిర్మాణపరమైన, సైద్ధాంతిక కారణాలపై కేంద్ర కమిటీ ప్రాధమికంగా చర్చించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బకు గల కారణాలను అర్ధం చేసుకోవడానికి కేరళం రాష్ట్ర కమిటీ ఇప్పటికే పార్టీలోని వివిధ స్థాయిల నుండి అభిప్రాయాలు సేకరించే ప్రక్రియను ప్రారంభించింది. తిరువనంతపురంలో జూన్‌ 5-8 తేదీల్లో జరగనున్న రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ అభిప్రాయాలన్నింటినీ కూలంకషంగా చర్చిస్తారు. పొలిట్‌‌బ్యూరో సభ్యుల బృందం ఈ సమావేశాలకు హాజరవుతుంది. ఈ చర్చల ప్రాతిపదికన, పార్టీ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, గుర్తించిన బలహీనతలను సరిదిద్దుకునే చర్యలు చేపడతారు.
పశ్చిమ బెంగాల్‌‌లో, పార్టీ అన్ని శాఖలు సమావేశమై, తమ అభిప్రాయాలను రాష్ట్ర కమిటీకి అందచేస్తాయి. జూన్‌‌ చివరి నాటికి రాష్ట్ర కమిటీ సమావేశమై, సమీక్షను ఖరారు చేస్తుంది. తమిళనాడు, అస్సాంలు కూడా ఇదే తరహాలో సమీక్షా ప్రక్రియలు చేపడతాయి. పశ్చిమ బెంగాల్‌‌ పార్టీ పున: ప్రవేశం ఒక సానుకూల పరిణామం. పుదుచ్చేరిలోని మాహెలో పార్టీ కామ్రేడ్‌ ఒకరు ఇండిపెండెంట్‌‌గా గెలుపొందారు. పార్టీకి, దాని మిత్రపక్షాలకు ఓటు వేసిన ఈ రాష్ట్రాల ప్రజలందరికీ కేంద్ర కమిటీ కృతజ్ఞతలు చెబుతోంది. ప్రజల సమస్యలను చేపట్టడంలో, వారి హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు నిర్వహించడంలో పార్టీ ముందు పీఠిన వుంటుందని, నిరంకుశవాద ధోరణి ఏ రూపంలో వున్నా దాన్ని, అలాగే హిందూత్వ-కార్పొరేట్‌ ‌దాడులను కూడా వ్యతిరేకిస్తుంది. ఎన్నికైన శాసనసభ్యులందరూ ప్రజా సమస్యలను లేవనెత్తుతూ, ప్రజా వ్యతిరేక, హిందూత్వ-కార్పొరేట్‌ ‌విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు నేతృత్వం వహించడాన్ని కొనసాగిస్తారు.
తమిళనాడులో కొత్తగా ఏర్పడిన సి.జోసెఫ్‌ ‌విజయ్‌ ‌నేతృత్వంలోని తమిళగ వెట్రిగ కజగం (టివికె) ప్రభుత్వం, రాజ్యాంగాన్ని, దాని సమాఖ్య సూత్రాన్ని, లౌకికవాదాన్ని, ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాపాడతామని చేసిన ప్రకటనలకు అనుగుణంగా పాలిస్తుందని కేంద్ర కమిటీ ఆశిస్తోంది.
సమాజంలో హిందూత్వ మతోన్మాద శక్తులన్నీ సంఘటితం కావడం, అలాగే పశ్చిమ బెంగాల్‌‌లో అవి అధికార పగ్గాలు చేపట్టడం ఈ ఎన్నికల ఫలితాల స్థూల విశేషంగా వుంది. కేరళం, తమిళనాడుల్లో బిజెపి కేవలం నామమాత్రంగా సీట్లను గెలిచినా వారి వ్యాప్తి ప్రధానంగా ఆందోళన కలిగిస్తోంది.
పశ్చిమ బెంగాల్‌‌లో ఆర్‌ఎస్‌ఎస్‌-‌బిజెపి విజయం, అస్సాంలో తిరిగి అధికారంలోకి రావడమనేది అన్ని లౌకికవాద, ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులకు తీవ్రంగా ఆందోళన కలిగించే అంశంగా వుంది. ప్రజల హక్కులను కాపాడేందుకు, మత సామరస్యతను పరిరక్షించేందుకు సిపిఎం అగ్ర భాగాన నిలబడుతుంది.
కేంద్ర కమిటీ ఈ ఏడాది జులై రెండో అర్ధభాగంలో సమావేశమై అన్ని రాష్ట్రాల సమీక్షలను ప్రాతిపదికగా చేసుకుని మొత్తంగా ఎన్నికల ఫలితాలను కూలంకషంగా సమీక్షిస్తుంది. గుర్తించిన బలహీనతలను సరిదిద్దుకోవడమనేది పై నుండి కిందిస్థాయి వరకు తక్షణమే చేపట్టబడుతుంది.

​ఇండియా బ్లాక్‌ : మితవాద శక్తులు అభివృద్ధి చెందడం చూస్తుంటే అన్ని వామపక్ష, ప్రగతిశీల, లౌకికవాద, ప్రజాతంత్ర శక్తులు ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ఇతర ప్రతిపక్ష పార్టీల పట్ల కాంగ్రెస్‌ ‌ధోరణి, ఆర్‌ఎస్‌‌ఎస్‌-‌బిజెపిపై సమైక్య పోరాటం సాగించేందుకు లౌకికవాద శక్తులన్నీ ఏకతాటిపైకి రావడానికి ఏ మాత్రమూ దోహదపడదు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌-‌బిజెపిపై సమైక్యంగా పోరు సాగించడం ప్రస్తుత అవసరంగా వుంది. బిజెపితో సిపిఎం ఒప్పందం కుదుర్చుకుంది అంటూ కేరళం అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమని కేంద్ర కమిటీ ఖండించింది. ఇండియా బ్లాక్‌‌లో భాగస్వామి, మతోన్మాదంపై నిబద్ధతతో పోరాటం సాగించే సిపిఎంపై ఇటువంటి దురుద్దేశ్యపూరితమైన వ్యాఖ్యలు చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన : నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే పేరుతో దేశ ఎన్నికల మ్యాప్‌‌ను మార్పు చేసే తన ఎజెండాను బిజపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది. నియోజకవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్‌‌ అమలుతో ముడిపెట్టడానికి చూసింది. ఎన్నికలపరంగా ప్రయోజనాలు పొందే రీతిలో నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టాలని బిజెపి ఎత్తుగడలు వేసింది. దక్షిణాది రాష్ట్రాల ప్రభావాన్ని తగ్గించాలని చూసింది. ఈ రాష్ట్రాల్లో బిజెపి ఉనికి చాలా బలహీనంగా కొనసాగుతోంది. దీన్ని బట్టి తన ఎజెండాను అమలు చేసేందుకు ప్రభుత్వ సంస్థలను సమర్ధవంతంగా బిజెపి ఉపయోగించుకుంటోందని దీంతో మరోసారి నిరూపితమైంది.

ఎస్‌‌ఐఆర్‌ : ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌‌ను ఎన్నికల కమిషన్‌ అమలు చేసింది. ‘తార్కిక వ్యత్యాసాలు’ అనే కొత్త కేటగిరీ ద్వారా, అలాగే బలహీనమైన కారణాలతో లక్షలాదిమంది ఓటర్లకు వారి రాజ్యాంగ హక్కు నిరాకరించబడింది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలకు గల హక్కులను కాపాడడంలో న్యాయ వ్యవస్థ కూడా విఫలమైంది. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు గానూ ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడడమనేది స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఈ మొత్తం ప్రక్రియ మన ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసింది.
ఇప్పడు మరో 17 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌‌ను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ‌యోచిస్తోంది. నిజమైన పౌరుడెవరికీ ఓటు వేసే హక్కు నిరాకరించబడరాదంటూ ఎస్‌ఐఆర్‌‌పై పార్టీ వైఖరిని కేంద్ర కమిటీ పునరుద్ఘాటించింది. ఎస్‌ఐఆర్‌‌ ద్వారా తన అధికార పరిధిని ఇసి ఉల్లంఘిస్తోంది. దురదృష్టవశాత్తూ, ఈ ప్రక్రియ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తన తీర్పును ఇవ్వలేదు.
ఎస్‌‌ఐఆర్‌ పేరిట లబ్దిదారులపై దాడులు : ఎస్‌ఐఆర్‌‌లో ప్రక్రియలో ఓటర్ల జాబితాల నుండి పేర్లు తొలగించబడిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందబోవని బీహార్‌, బెంగాల్‌‌ల్లోని బిజెపి ప్రభుత్వాలు ప్రకటించాయి. ఎస్‌ఐఆర్‌ ‌ప్రాతిపదికన ఇప్పటికే ఐదు లక్షల రేషన్‌ ‌కార్డులను ఉపసంహరించామని బీహార్‌ ‌ప్రభుత్వం ప్రకటించింది. బెంగాల్‌‌లో, లక్షలాదిమంది ఓటర్లు తమ పేర్ల తొలగింపును నిరసిస్తూ అప్పీళ్ళు దాఖలు చేశారు. ఇంతవరకు వారి అప్పీళ్ళన్నీ పెండింగ్‌‌లోనే వున్నాయి. వారి అప్పీళ్ళు పరిష్కరించబడేవరకు వారికి ప్రభుత్వ ప్రయోజనాలేవీ పొందేందుకు అనుమతించరు. ఇవన్నీ ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధం, నిర్దిష్ట వర్గాలకు చెందిన వ్యక్తుల పౌరసత్వాన్ని, వారి హక్కులను దిగజార్చడానికి చేసిన దారుణమైన ప్రయత్నం. ఇలాంటి వివక్షలను పార్టీ ఎంత మాత్రమూ అనుమతించదు. ప్రజలను సమీకరించడం ద్వారా తక్షణమే జోక్యం చేసుకుంటుంది.
భారత దేశ ఆర్థిక వ్యవస్థ : ప్రభుత్వం ఎంతలా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొనసాగుతోంది. పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ద్వారా స్వయంగా ప్రధానే పరోక్షంగా అంగీకరించారు. నిరుద్యోగం పెచ్చరిల్లుతోంది. అనేక రంగాల వారీగా నిరుద్యోగం పెరుగుతోంది. అనేక చిన్న, మధ్య తరహా సంస్థలు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న వ్యయాలతో, ఎరువుల కొరతతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కునారిల్లుతోంది.
అత్యధిక అదాయం, సంపదలకు సంబంధించి తీవ్ర అసమానతలతో ప్రపంచంలోనే అత్యంత అసమానతలు కలిగిన దేశంగా భారత్‌ ‌కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వేతనాల్లో తేడాలు, మహిళల సేవలకు అసమానమైన, లేదా ఏ మాత్రమూ చెల్లింపులు లేని కారణంగా లింగ అసమానత్వం కూడా చాలా అధికంగా నెలకొంది. రూపాయి విలువ చారిత్రకంగా కనిష్ట స్థాయికి దిగజారింది. విదేశీ మారక నిల్వలు కూడా చాలా వేగంగా కరిగిపోతున్నాయి.
యుద్ధ ప్రభావం : యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ ప్రభుత్వం ఇంధన ధరలను, ఎల్‌‌పిజి సిలిండర్లు ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల ధరలను విపరీతంగా పెంచింది. వాటి వినియోగంపై అనేక ఆంక్షలు కూడా విధించింది. ఈ చర్యలన్నింటి కారణంగా ఆహారం, ఇతర నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా చాలా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక చిన్న దుకాణాలు, సంస్థలు ఏకంగా మూతపడ్డాయి.
పెరిగిన ఇంధన ధరలు : ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే, గత 11 రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ‌ధరలను పలుసార్లు పెంచడం ద్వారా లీటరుకు రూ.7కి పైగా పెరిగాయి. ఈ పెరుగుదల నాలుగు దశల్లో - లీటరుకు రూ.3.90పైసలు, 87పైసలు, రూ.2.61 - చొప్పున సాగింది. పెరుగుతున్న ఇంధన ధరలు, దీనితో పాటూ పొదుపు చర్యలు ఈ రెండూ కలిసి ప్రజలపై అపారమైన భారాన్ని మోపుతున్నాయి. రోజుకు కనీసం ఒక పూటన్నా భోజనం చేయడానికి పోరాటం చేయాల్సి వస్తోంది.
మన ఇంధన వనరుల వ్యూహాత్మక భద్రతకు హామీ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇది ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగించేందుకు దారి తీసింది. పార్టీ ప్రజలను చురుకుగా సమీకరించి, పొదుపు పేరుతో ప్రభుత్వం విధించిన భారాలను ప్రతిఘటిస్తుంది.
ఎరువుల లభ్యత : ఎరువుల నిల్వలను తగినంతగా వుంచడంలో ప్రభుత్వం విఫలమవడంతో రైతాంగం తీవ్రంగా ఎరువుల కొరతను ఎదుర్కొనడంతో పాటు వ్యయాల పెంపును కూడా భరించాల్సి వస్తోంది. వ్యవసాయ సీజను సమీపిస్తున్నందున తక్షణమే ఎరువులను ఎలాంటి ఆటంకాలు లేకుండా లభ్యమయ్యేలా చూడాలని డిమాండ్‌ ‌చేస్తూ రైతాంగాన్ని కదిలించేందుకుటుంది.

గ్రామీణ ఉపాధి హామీ :
వి బి గ్రామ్‌ ‌జి చట్ట ముసా యిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అలాగే జులై 1 నుండి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తోంది. ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల్లో కార్మికులు నిరసనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్‌‌నెట్‌ ‌కవరేజ్‌ అరకొరగా వున్న ఏరియాల్లో డిజిటల్‌ ‌వ్యవస్థలపై ఆధారపడడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. బాధిత శ్రామికులకు పార్టి సంఘీభావంగా నిలబడుతుంది. ఉపాధిని నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ సాగే నిరసనలకు నేతృత్వం వహిస్తుంది.
వి బి గ్రామ్‌ ‌జిని రద్దు చేయాలని, ఆ స్థానంలో పనికి, వేతనాల పెంపునకు హమీ కల్పిస్తూ మరింత పటిష్టమైన ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను తీసుకురావాలన్న డిమాండ్‌‌ను కేంద్ర కమిటీ పునరుద్ఘాటించింది.
ఈ దాడులకు వ్యతిరేకంగా, తమ హక్కుల కోసం నిరసనలు నిర్వహించడంలో రైతులు, వ్యవసాయ కార్మికుల సంఘాలకు పార్టీ మద్దతుగా నిలుస్తుంది.
కార్మికుల నిరసనలు : అమానవీయమైన దోపిడీ, పని పరిస్థితులకు, పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా, కనీస వేతనాలు సవరించడంలో, వేతనాల చెల్లింపునకు హామీ కల్పించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవడాన్ని నిరసిస్తూ తమ గళాన్ని వినిపించి, చైతన్యవంతంగా నిరసనలకు దిగిన వేలాదిమంది కార్మికులను కేంద్ర కమిటీ అభినకునలు తెలియచేసింది. ఆ నిరసనలను అణచివేయడానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. పోలీసు బలగాలను ప్రయోగించింది. వందలాదిమంది కార్మికులను అరెస్టు చేసింది. వారిలోచాలా మంది ఇంకా జైళ్ళలోనే మగ్గుతున్నారు. అణచివేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు పార్టీ అండగా నిలబడుతుంది.

మతోన్మాద ముప్పు : చారిత్రక, మతపరమైన వివాదాలను తిరగదోడుతూ,వాటిపై మళ్ళీ తీర్పులివ్వడమనే పెరుగుతున్న ధోరణిలో భోజ్‌‌శాలా-కమల్‌ ‌మౌలా మసీదులో మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక భాగం. ఇది, మతోన్మాద విభేదాలను మరింత పెచ్చరిల్లచేసే ముప్పను కలిగిస్తోంది. ఆరాధనా స్థలాల చట్టం, 1991 నిబంధనలకు పూర్తి విరుద్ధంగా హైకోర్టు తీర్పు వుంది. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకికవాద సూత్రాలను న్యాయ వ్యవస్థ పరిరక్షించాలి.

మహిళలు, దళితులు, ఆదివాసీలపై దాడులు : దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఇటీవల జరిగిన సామూహిక అత్యాచారం, మన దేశంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలకు, లైంగిక దాడులకు ఒక గుర్తు. అనేక రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో వుండడం, పైగా పాలనా యంత్రాంగంపై మనువాదీ సిద్ధాంతాల ప్రభావం బాగా వుండడంతో కుల, లింగ వివక్ష, హింసలను ఎదుర్కొంటున్న బాధితులు తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకోవడానికి, నేరాల గురించి రిపోర్ట్‌ ‌చేయడానికి కూడా కష్టంగా మారుతోంది. లోపభూయిష్టమైన న్యాయ వ్యవస్థ కారణంగా లైంగిక దాడులకు పాల్పడిన వారు, కుల అత్యాచారాలక పాల్పడిన వారు విడుకు ైనపుడు అనేకమంది బిజెపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ : నీట్‌ ‌పరీక్షా పత్రం లీకవడం వెనుక బిజెపి నేతలు వున్నారనేది స్పష్టమవుతోంది. పరీక్షల నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌‌టిఎ)కు అప్పగించిన తర్వాత పరీక్షా పత్రాలు లీకవడం ఇదేమీ మొదటిసారి కాదు. ఎన్‌‌టిఎను తక్షణమే రద్దు చేయాలి, పరీక్షల నిర్వహణను వికేంద్రీకరించాలి. గతంలో మాదిరిగా, సంబంధిత ప్రభుత్వ సంస్థలకు ఆ బాధ్యతలను అప్పగించాలి. లీకేజీపై కూలంకషంగా దర్యాప్తు నిర్వహించాలి. దోషులందరినీ శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరగకుండా నివారించేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి.
డిజిటల్‌ ‌మూల్యాంకన ప్రక్రియ లోపభూయిష్టంగా వున్న కారణంగా, సిబిఎస్‌ఇ 12 తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం మరో వైఫల్యంగా రుజువయ్యే అవకాశం కనిపిస్తోంది. విద్యార్ధులు, వారి భవిష్యత్తు గురించి ప్రభుత్వానికి ఏమీ పట్టనట్లు కనిపిస్తోంది. టీచర్లు అత్యంత జాగ్రత్తగా జవాబు పత్రాలను దిద్దడానికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి. తమ తప్పేమీ లేకపోయినా విద్యార్ధులు శిక్షించబడరాదు.

కాక్రోచ్‌ ‌జనతా పార్టీ : సిజెపి సోషల్‌ ‌మీడియా హ్యాండిల్‌‌పై నిషేధం, సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కేలపై దాడిని కేంద్ర కమిటీ ఖండించింది. ఈ చర్యలతో బిజెపి నిరంకుశ స్వభావం పైగా అసమ్మతిని సహించలేని దాని ధోరణి మరోసారి ప్రదర్శితమైంది. సిజెపికి అనుకూలంగా ఆన్‌‌లైన్‌‌లో పెద్ద ఎత్తున మద్దతు రావడం, నిరుద్యోగం వంటి అంశాలపై బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెలకొన్న అసమ్మతిని ప్రతిబింబిస్తోంది. యువత నిజమైన ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వం ‘బొద్దింకలనూ’ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తోంది. తన అసహనం ధోరణిని మరోసారి చాి చెబుతోంది.

ఫిఫా ప్రపంచ కప్‌ : జూన్‌-‌జులైల్లో నిర్వహించే ఫుట్‌‌బాల్‌ ‌ప్రపంచ కప్‌‌ను ప్రసారం చేసేందుకు తక్షణమే భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. ప్రస్తుత ప్రతిష్టంభనకు బ్రాడ్‌‌కాస్టర్ల కార్పొరేట్‌ ‌గుత్తాధిపత్యం, లాభాలు ఆశించే పిఫా రెండూ బాధ్యులే, దీనివల్ల భారతీయులు.ఈ ప్రధానమైన క్రీడా కార్యక్రమాన్ని చూసేందుకు అవకాశం లేకుండా పోతోంది. ప్రభుత్వ బ్రాడ్‌‌కాస్టర్‌ ‌ద్వారా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి, ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా తక్షణమే ప్రసారమయ్యేలా చు డాలి.

​క్యూబాకు బెదిరింపులు : క్యూబాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా మరోసారి ప్రకటించింది. క్యూబాపై ఆంక్షలను మరింత పెంచింది. క్యూబాపై సైనిక చర్య తప్పదని బెదిరిస్తోంది. క్యూబా చుట్టుక్కల డ్రోన్లను, గూఢచప్రక్కలవిమానాలను తిప్పుతోంది. నావికాదళానికి చెందిన యుద్ధ నౌక నిమిటజ్‌ను కరేబియన్‌ ‌జలాలకు తరలించింది. క్యూబాను బెదిరించడమే ఇక్కడ అమెరికా లక్ష్యం. క్యూబా మాజీ అద్యక్షుడు రావుల్‌ ‌కాస్ట్రోను అమెరికా కోర్టులో అభిశంసించడం మరో దురాక్రమణ చర్య. క్యూబాకు సంఘీభావంగా, అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా మరోసారి గొంతెత్తి నినదించాలని దేశ ప్రజలను కేంద్ర కమిటీ కోరుతోంది.
సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రచారం : ఇరాన్‌, పాలస్తీనా, వెనిజులా, క్యూబాలపై అమెరికా దురాక్రమణను ఖండిస్తూ జూన్‌ ‌నెలలో పార్టీ విస్తృతంగా సామ్రాజవ్యాద వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించనుంది. సెమినార్లు, సమావేశాలు నిర్వహించడం ద్వారా అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించనుంది.
మహిళా రిజర్వేషన్‌ అమలు కోసం ప్రచారం : చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌‌ను తక్షణమమే అమలు చేయాలని కోరతూ మహిళా సంఘాలు పిలుపిచ్చిన నిరసనలకు మద్దతునివ్వాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ డిమాండ్‌‌కు మద్దతుగా ఇతర వర్గ, ప్రజా సంఘాలతో కలిసి ప్రజలను సమీకరిస్తుంది. రాబోయే పార్లమెంట్‌ ‌సమావేశాల్లో ప్రతి రోజూ ఇవి నిర్వహించబడతాయి.

ఓటు హక్కు కోసం ప్రచారం : ప్రజాస్వామ్య హక్కులు ముఖ్యంగా ఓటు వేసే హక్కును కాపాడుకునేందుకు గానూ పార్టీ విస్తృతంగా ప్రచారం చేపట్టనుంది. ఎన్నికల కమిషన్‌ ‌పక్షపాత పాత్ర, పాలక పార్టీకి అనుబంధంగా దాని చర్యలపై ఈ ప్రచారం దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇసి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, తటస్థ పాత్ర పోషించాలని, మొత్తం ఎన్నికల ప్రక్రియలో - ఓటరు నమోదు నుండి ఎన్నికల నిర్వహణ, ఇవిఎం, ఓట్ల లెక్కింపు వరకు సంపూర్ణ పారదర్శకత పాటించాలని డిమాండ్‌‌చేస్తూ ప్రజాభిప్రాయన్ని విస్తృతంగా సమీకరిస్తుంది.

లేబర్‌ ‌కోడ్‌‌ల నోటిఫికేషన్‌‌కు వ్యతిరేకంగా ప్రచారం : ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాలుగు రోజుల వ్యవధిలోనే బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లేబర్‌ ‌కోడ్‌‌లను అమల్లోకి తీసుకువచ్చింది. ఇది, ప్రభుత్వ మోసపూరితమైన వ్యవహార శైలిని బట్టబయలు చేసిందిటు లేబర్‌ ‌కోడ్‌‌లకు సంబంధించి కొత్తగా నోటిఫై చేసిన నిబంధనల అమలును ప్రతిఘటించే కార్మికులకు అండగా పార్టీ నిలబడుతుంది. కేంద్ర నిబంధనల ప్రకారం అమలు చేయడానికి బదులుగా కార్మికుల ప్రయోజనాలు పరిరక్షిస్తూ లేబర్‌‌కోడ్‌‌లకు దిద్దుబాటు సవరణలు తీసుకురావడానికి రాజ్యాంగంలో వున్న శాసనాధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ ఒక ఉద్యమాన్ని చేపట్టనుంది. కార్మికుల హక్కులను కాపాడేందుకు గల చట్టబద్ధమైన మార్గాలను సూచిస్తూ గతంలో కేరళంలోని ఎల్‌‌డిఎఫ్‌ ప్రభుత్వానికి నివేదికను అందచేసిన జస్టిస్‌ ‌గోపాల గౌడ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్