గుండె పొరల్ని కంపనమెత్తించినట్టు,
మెదడు నరాలని మత్తింప చేసినట్టు,
శోకాన్ని రుంజిన ఈదురు గాలిలా
ఈడ్సికొడుతున్నట్టు,
వరసలు మార్చి మార్చి,
సిరత దరువులతో ఊరి సంబరాన్ని
చిందెయ్యించినట్టు,
రివ్విన్... రివ్విన్... రివ్విన్... రవ్విన్...
కీరు పెట్టే తోలు దనారింపే ఈర్నం.
సన్నాయికి సరి జోడు ఈర్నం పాటతోనే.
గౌరీ పౌర్ణమికి
ఊరి బారికి ఇంట్లో నందెన్న కొలువు దీరేది.
ఒనుమునొదిలి అసిరమ్మ,
వేప మండలాలు, గుగ్గిలం ధూపాల మధ్య
ఘటమై నడీదికి నడిసొచ్చేది.
పెళ్ళిల్లకైనా, పేరంటాలకైనా,
చావుకైనా, సంబరానికైనా,
ఈర్నపు బాజే పల్లె ఓజీబు.
ఊరు లేని పెళ్లి లేనట్టే,
ఈర్నం లేని బాజా లేదన్నది
కళింగాన సామెత.
ఈర్నం రాపుడు గమనం
గగనాన్ని తాకాలంటే,
గుళ్ల కొట్టి చిత్రిక పట్టిన ఏగిస దుక్కకి
ఎండిన ఆడ మేక తోలుతో మూతలు కట్టాల.
వాట్ని నవారుతో ఇర్రించాల.
పెంకుపై అరగదీసిన గోవు మూలుగు పొడిని
పాలతో రంగరించి,
ఆరారగా ఎడమ మూతపై పూత పెట్టాల.
సాపు చేసి సానబట్టిన ఈత బద్దితో
రివ్విన్... రివ్విన్... రివ్విన్... రివ్విన్...
రాపుడివ్వాల.
సవర దొర తమ్మి కర్రతో చేసిన
వంక సిరతతో కుడి మూతపై
వరసలు పలికించాల.
శంకరునుకి రోకైన ఈర్నాన్ని
రంగు రంగుల తాళ్ళతో అల్లిక చేసి,
కుల దైవంగా కళ్ళకద్దుకోవాల.
ఏ దాస దస్యుల వారసత్వమో,
మా తాతలు, తండ్రులు
పిర్రలు పైకి ఎగ్గట్టిన శిలకట్టుతో,
గావంచా తలపాగాలతో,
రాజులమ్మ తీర్థాల్లోనో,
డోలా యాత్రల్లోనో,
దివిటీల వెలుగుల్లో,
నల్లని ఈరిగిల్లా నిగారించి పోయోళ్ళు.
నీలకంఠుడి మెడలో నాగరాజులా
మెడలోని ఈర్నాలపై
దరువుల్ని బుసలు కొట్టించేవారు.
ఆది శంకరుడే ఆవహించినట్టుండేవారు.
ఈర్నం తరతరాల మా పేట బతుకు పాట.
మొగ్గ సారాతో రుచి తగిలిన
కాల్చిన గొలిబెంట్రుక తునక,
కలుక్కు మన్న మా ఆకలి పేగుల్ని
తన కడుపులో దాచుకున్న ఆత్మగౌరవం.
ఈర్నం మా పేట కళాత్మక లోగిలి,
మా నాగరికత కోవిలి.
మొక్కుల్ని, ముడుపుల్ని
దేవర్లకి మోసుకెల్లే బాజా సవ్వారి.
ఈర్నం... ఇప్పుడు...
మా బతుకు మూలాన్ని వదిలి
పరాయి రీతుల్లోకి మిలామైపోయింది.
దరువుల పెట్టె రిథమ్ పాడ్ నుంచి
ఎరువు తెచ్చుకున్న ఎర్రి కూతలతో
డిజిటల్ గోలగా గగ్గోలు పెడుతోంది.
సూతకాలు, శుభకార్యాలు,
ఊరేగింపులు, నిమజ్జనాలు,
ఇప్పుడన్నీ డి.జే.ల
పెను ఘోషల మధ్యే...
మా సాంస్కృతిక సవురు దీపం ఆరిపోయింది.
మా నోటి కాడి మెతుకు తుళ్ళిపోయింది.
నిరాదరణకు నిలువెత్తు గురుతై,
మా ఇళ్ళ చీకటి మూలల్లో
మహిమ కోల్పోయిన పరమ శివునిలా
చిలక్కొయ్యకు ఏలబడిపోయింది.....
(ఈర్నం : కళింగాంధ్ర దళిత జానపద వాయిద్యం. ఈ పేరుతో ప్రచురించిన కవితా సంపుటి ఆవిష్కరణ ఈనెల 21న శ్రీకాకుళంలో జరుగుతుంది. )
కలమట దాసు బాబు
8096703363
ఈర్నం
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 10:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)