తిరువనంతపురం: రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు మతతత్వ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నిర్వహించిన కార్యక్రమానికి అధికారికంగా హాజరవడం దుమారం రేపింది. తిరువనంతపురంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి కేరళ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం విసి మోహనన్ కున్నుమ్మల్, మహాత్మా గాంధీ వర్సిటీ ఇన్‌ఛార్జ్ విసి మావూత్తు డి, తుంచత్ ఎజుత్తచ్చన్ మలయాళ వర్సిటీ ఇన్‌ఛార్జ్ విసి సిఆర్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి విసిలు హాజరుకావడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ప్రతిపక్ష నేత పినరయి విజయన్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. విశ్వవిద్యాలయాలపై సంఘ్ పరివార్ ఎజెండాను రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్లతో రాజీ పడటంతో, ఉన్నత విద్యా రంగంపై ఆర్‌ఎస్‌ఎస్ పట్టు బిగిస్తోందని విజయన్ తెలిపారు. గత ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను కాషాయీ కరణ నుంచి రక్షించేందుకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడితే, అప్పట్లో యుడిఎఫ్ దానిని వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిణామాలపై ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. బిజెపి, సంఘ్ పరివార్ విషయంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని విజయన్ నిలదీశారు. అయితే ఎట్టకేలకు ఈ వివాదంపై కేరళం ముఖ్యమంత్రి వి డి సతీశన్ స్పందించారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అలాగే, విసిలు రాజకీయ, సామాజిక ఒత్తిళ్లకు లొంగకుండా తటస్థంగా ఉండాలని 'ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్' ( ఎఫ్‌యుటిఎ) హితవు పలికింది. కేరళ సంప్రదాయాలకు విరుద్ధమైన పోకడలను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోరని అసోసియేషన్ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో విసిలు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 15, 2026, 12:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)