test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆగ్రహం

3 గంటల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 12:54 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

-రైళ్ల కొరత, ఆలస్యం కారణంగా ఆందోళన

-పాటలీపుత్ర రైల్వే స్టేషన్‌‌లో తీవ్ర ఉద్రిక్తత

​పాట్నా : బీహార్‌‌లోని డబుల్‌ ఇంజిన్‌ ‌సర్కారు.. నిరుద్యోగులకు ట్రబుల్‌ ఇంజిన్‌తో చుక్కలు చూపిస్తోంది. బీహార్ ఎక్సైజ్‌ ‌పోలీస్‌ నియామక పరీక్షకు హాజరయ్యేందుకు శనివారం రాత్రి పాటలీపుత్ర స్టేషన్‌‌కు వేలాది మంది అభ్యర్థులు చేరుకున్నారు. అయితే రైళ్ల కొరత, ఆలస్యం కారణంగా తీవ్ర ఆందోళన చెందారు. తెల్లారితే పరీక్ష, సమయం చూస్తే అర్ధరాత్రి 3 గంటలు దాటిపోతుంది. అయినా ఎప్పటికీ రైళ్లు రావడం లేదు.. కొత్త రైళ్లు అసలే లేవు. దీంతో ఆగ్రహించిన నిరుద్యోగులు రైల్వే పట్టాలపైకి దిగి రైళ్లను అడ్డుకున్నారు. పరీక్షకు హాజరుకాలేకపోతే తమ సంవత్సారాల పాటు చేసిన శ్రమ వృథా అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ ‌చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అభ్యర్థులు రైళ్లను అడ్డుకున్నారు. అయితే రైల్వే పోలీసులు గాల్లో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు, భాష్పవాయువు గోళాలు ప్రయోగించి, వారిపై లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. దీంతో అభ్యర్థులు రాళ్ల దాడికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.


​ఏం జరిగిందంటే..!

బీహార్ ఎక్సైజ్‌ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించి ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహించాల్సి ఉండటంతో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది అభ్యర్థులు రాత్రికి రాత్రే పాటలీపుత్ర స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే ఒక్క రైలు మాత్రమే అందుబాటులో ఉంది. తగినన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులో లేకపోవడం, కొన్ని రైళ్లు ఆలస్యంగా నడవడంతో తాము పరీక్ష సమయానికి చేరుకోలేమనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఇదే సమయంలో పాటలీపుత్ర నుంచి కతిహార్‌కు వెళ్లాల్సిన రైలు స్టేషన్‌కు చేరుకున్న సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహానికి గురైన అభ్యర్థులు రైలు ముందు పట్టాలపై కూర్చుని నినాదాలు చేశారు. దీంతో రైలు రాకపోకలు స్తంభించిపోయాయి. ఆందోళన కొనసాగుతున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసరారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో భారీగా పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని, గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చామని, ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అదనపు పోలీసు బలగాలను మోహరించి స్టేషన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, ఎట్టకేలకు తూర్పు మధ్య రైల్వే (ఇసిఆర్‌) దిగివచ్చింది. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకుందని, 10 అదనపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్