test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వినూత్న ఆలోచనా ధోరణి భారత్‌ డిఎన్‌ఎలోనే వుంది !

3 గంటల క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 01:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- భారత్‌ ఇన్నొవేట్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ, మాక్రాన్‌
నైస్‌ (‌ఫ్రాన్స్‌) : వినూత్న ఆలోచనా ధోరణులకు, ఆవిష్కరణలకు, అభివృద్ధికి భారత్‌ ఒక గమ్యం వంటిదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నైస్‌‌లో భారత్‌ ఇన్నొవేట్స్‌ 2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతి ఒక్క పెట్టుబడిదారుడు, ప్రతి యూనివర్శిటీ, పరిశోధనా సంస్థ, ప్రతి పారిశ్రామికవేత్త అందరూ కూడా భారత్‌‌కు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. భారత్‌‌లో రూపకల్పన చేయండి, భారత్‌‌లో అభివృద్ధి పరచండి, ప్రపంచం కోసం పరిష్కారాలను సృష్టించండి.’’ అని మోడీ పేర్కొన్నారు. మోడీతో కలిసి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్వైపాక్షిక సంబంధాలు, సాంకేతికత రంగంలో విశ్వాసం, సహకారం అనే అంశాలపై ఇరువురు నేతలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌, విదేశాంగ మంత్రి జై శంకర్‌, నైస్‌ ‌మేయర్‌ ‌పాల్గొన్నారు. ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, దశాబ్ద కాలం క్రితమే భారత్‌‌ను సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దేశంగా పరిగణించారని, ఇప్పడు సాంకేతికతను అందించే దేశంగా ఆవిర్భవించిందని చెప్పారు. రోదసీ రక్షణ పరిశ్రమల కార్యకలాపాల గురించి ప్రస్తావిస్తూ, భారత్‌లో ఆవిష్కరణ వ్యవస్థ కోసం తాను పాటు పడినట్లు మోడీ పేర్కొన్నారు.
అణువిద్యుత్‌ ‌రంగంలో ప్రైవేటు రంగ ప్రాతినిధ్యాన్ని అనుమతిస్తూ, శాంతి చట్టం ద్వారా ఇటీవల తీసుకువచ్చిన మార్పులను ప్రస్తావించారు. దీనివల్ల పరిశుద్ధ ఇంధనం, అధునాతన రియాక్టర్లు, అత్యాధునిక పరిశోధనా రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టించాయన్నారు. భారత్‌, ఫ్రాన్స్‌‌ల మధ్య సంబంధాలు పరస్పర నిబద్ధత, స్ఫూర్తి, విలువలు, దార్శనికతతో కూడి వుంటాయని అన్నారు. విశ్వసనీయమైన, అందరినీ కలుపుకుని పోయే, మానవ సంక్షేమమే లక్ష్యంగా వుండే సాంకేతికతల కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయన్నారు. ‌బహుళవాదంలో, నిజమైన భాగస్వామ్యాల్లో భారత్‌, ఫ్రాన్స్‌‌లకు విశ్వాసం వుందని మాక్రాన్‌ అన్నారు. అలాగే కృత్రిమ మేథస్సుకు సంబంధించి పరస్పర సహకారాన్ని కూడా గౌరవించాల్సి వుందని వ్యాఖ్యానించారు. విశ్వసనీయమైన భాగస్వాములు కావాలని ప్రపంచం కోరుకుంటుందని, భారత్‌ అటువంటిదాన్ని అందిస్తోందని అన్నారు. భారత్‌ అంటే వినూత్న ఆవిష్కరణలు, సాంకేతిక విప్లవాల దేశమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాక్రాన్‌ ‌ప్రసంగించారు. ఎఐ, సాంకేతితకు ఉత్తమ గమ్యస్థానం ఫ్రాన్స్‌ అని పేర్కొన్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను మనం గౌరవించాలని, అందులో మనం కూడా భాగస్వాములం కావాలనని అన్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ, అధ్యక్షుడు మాక్రాన్‌‌లు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్