ప్రజాశక్తి - రోలుగుంట (అనకాపల్లి జిల్లా) : తమ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ యోగా విన్యాసాలతో వినూత్న రీతిలో గిరిజన విద్యార్థులు ఆదివారం నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధి లోసింగి రెవెన్యూ గ్రామంలోని కొత్తలోసింగి, పాతలోసింగి, పెదగరువు, పిత్రిగడ్డ గ్రామాల కొందు గిరిజనులు నివసిస్తున్న కొండ శిఖర గ్రామాల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే 60 మంది విద్యార్థులు ఉన్నారు. లోసింగి గ్రామంలో పాఠశాల లేకపోవడంతో విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరంలోని వైబి పట్నం పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు 13 కిలోమీటర్ల దూరంలోని రాజన్నపేటకు డోలీల్లో వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. గత ఏడాది డిఇఒ, ఎంపిడిఒ, తహశీల్దార్ బృందం గ్రామాన్ని సందర్శించి పాఠశాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలిక పాఠశాల ఏర్పాటు చేశారు కానీ, పర్మినెంట్ ఉపాధ్యాయులను నియమించలేదు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ లోసింగిలో మాత్రం ప్రత్యామ్నాయ పాఠశాల తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో శాశ్వత పాఠశాల ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు. నిరసన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె గోవిందరావు, గ్రామస్తులు గెమ్మెల కొండబాబు, రాము, కొండతామల సత్తిబాబు, వెంకట్రావు పాల్గొన్నారు.
పాఠశాల ఏర్పాటు చేయరూ..
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 10:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)