- ఖండించిన అభిజీత్ దీప్కే
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ప్రారంభించిన ఐదు రోజుల్లోనే రెండు కోట్లకు పైగా ఫాలోవర్లు చేరారు. అయితే, సిజెపి ఫాలోవర్లను ఉద్దేశించి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వారిని పాకిస్తాన్, జార్జ్ సోరోస్‌కు చెందిన వారుగా పేర్కొన్నారు. దీనిపై అభిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. సిజెపి ఫాలోవర్లను పాకిస్తాన్ వారిగా చెప్పడాన్ని అభిజీత్ తీవ్రంగా ఖండించారు. తన ఖాతా హ్యాక్ కావడానికి ముందు ఫాలోవర్ల భౌగోళిక వివరాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. అందుకు సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్‌ను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఆ వివరాల ప్రకారం, 94 శాతానికి పైగా ఫాలోవర్లు భారతదేశానికి చెందినవారేనని అభిజీత్ తెలిపారు. భారత యువతను పాకిస్తానీయులుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎందుకు ముద్ర వేస్తున్నారు? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ కేంద్ర మంత్రి రిజిజు మరో పోస్టు చేశారు. 'పాకిస్తాన్, జార్జ్ సోరోస్ వర్గాల నుంచి సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవాలనుకునే వారిపై నాకు జాలి వేస్తోంది. భారతదేశంలో తగినంత జనాభా, ‘అత్యంత చురుకైన యువత ఉన్నారు. వారు నిజమైన, విలువైన అనుచరులుగా ఉండగలరు. గుర్తింపు కోసం దేశ వ్యతిరేక శక్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం భారత్‌లో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా ఖాతాలు నిలిపేశారు.









కామెంట్‌లు (0)