- 200, 500 నోట్లే ఎక్కువ
- రిజర్వుబ్యాంకు వెల్లడి
ముంబయి : దేశంలో నకిలీ నోట్ల అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దర్యాప్తు అధికారుల సోదాల్లో పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం. బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ కరెన్సీ నోట్ల గుర్తింపు 2025-26లో 5.7 శాతం పెరిగిందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) శుక్రవారం వెల్లడించింది. ప్రధానంగా ముఖ విలువ రూ.200, రూ.500 ఉన్న నోట్లే ఇందులో ఎక్కువగా వుంటున్నాయని తెలిపింది. 2025-26లో మొత్తంగా నకిలీ నోట్ల సంఖ్య 2,29,746కి పెరిగిందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2,17,396గా వుందని ఆర్ బి ఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
2024-25లో నకిలీ రూ.500 నోట్లు 20.5 శాతం పెరిగాయి. అంతకుముందు 1,17,722 గుర్తించగా, తర్వాత ఆ సంఖ్య 1,41,907కి చేరింది. అలాగే రూ.20 ముఖ విలువ ఉండే నోట్లు నకిలీ చలామణి కూడా బాగా పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. ఏడాది క్రితం 253 నోట్లు బయటపడగా అవి 47.4శాతం పెరిగి 373కి చేరాయి.
రూ.200 నకిలీ నోట్ల సంఖ్య తగ్గింది. 2024-25లో 32,600 వుండగా, 2025-26లో 30,591కి పడిపోయింది. అలాగే వంద నోట్ల నకిలీ కూడా తగ్గింది. 51,069 నుండి 45,621కి పడిపోయింది. రూ.50నోట్లు నకిలీ కూడా 12,015 నుండి 10,274కి తగ్గింది.
రూ.2 వేల నోట్లు చలామణి నుండి ఉపసంహరించడంతో వాటి నకిలీ దాదాపు పడిపోయిందని చెప్పవచ్చు. అంతకుముందు ఏడాదిలో 3508 బయటపడగా, 2025-26లో ఈ సంఖ్య 824కి తగ్గిపోయింది. ఆర్ బి ఐలో 2.4శాతం అంటే 5,412 నకిలీ నోట్లు కనుగొనగా ఇతర బ్యాంకుల్లో మొత్తంగా 97.6శాతం అంటే 2,24,334 నోట్లు కనుగొన్నారని నివేదిక పేర్కొంది. ఇంకా పోలీసులు, ఇతర ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నవి ఇందులో కలపలేదని తెలిపింది. పాడైపోయిన నోట్లను తీసివేయడం బాగా తగ్గిందని నివేదిక పేర్కొంది. 2025-26లో ఈ సంఖ్య 1.72లక్షల నోట్లుగా వుండగా అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 2.38 లక్షలుగా వుంది.








కామెంట్‌లు (0)