హార్మూజ్‌లో భారత నౌకపై దాడి వార్తను కొట్టిపారేసిన ఇరాన్
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు
టెహ్రాన్, వాషింగ్టన్ : పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన శాంతి ఒప్పందం చట్రపరిధిపై అమెరికా, ఇరాన్‌లు అంగీకరించాయని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం తెలిపారు. ఒప్పందం తుది పత్రం కూడా సిద్ధమైందన్నారు. రాబోయే 24గంటల్లో ఎలక్ట్రానిక్ సంతకాలకు పాకిస్తాన్ సన్నద్ధమవుతోందని, ఆ తర్వాత వచ్చే వారం సాంకేతిక స్థాయి చర్చలు జరుగుతాయని షరీఫ్ తెలిపారు. గతంలో కంటే శాంతి ఒప్పందానికి చాలా చేరువకు వచ్చామని షరీఫ్ వ్యాఖ్యానించారు. చర్చల సందర్భంగా అమెరికా, ఇరాన్‌లు ప్రదర్శించిన నిబద్ధతకు కృతజ్ఞతలు తెలియచేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలోని తమ సోదరులు అందించిన తోడ్పాటుకు కూడా అభినందనలు తెలియచేసుకుంటున్నామన్నారు. ఈ చారిత్రక ఒప్పందం శాశ్వత శాంతి స్థాపనకు గట్టి పునాదిని వేయగలదని విశ్వసిస్తున్నామని షరీఫ్ ట్వీట్ చేశారు.
హర్మూజ్ జలసంధిలోని భారత నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి జరిపిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వాదన పూర్తిగా నిరాధారమని ఇరాన్ ఎంబసీ పేర్కొంది. ఈ వారంలో ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మృతి చెందారన్న విషయం నుండి అందరి దృష్టిని మళ్ళించేందుకు చేసిన ప్రయత్నమని, ఇది చాలా దయనీయమని ఎంబసీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులకు పాల్పడిందని లెబనాన్ శనివారం తెలిపింది. నబటియె నగరం సహా 20 ప్రాంతాల్లో ప్రజలను తరలివెళ్లాలంటూ ఇజ్రాయిల్ ఆర్మీ ఆదేశాలుఎ జారీ చేసిన కాసేపటికే ఈ దాడులు జరిగాయని తెలిపింది.
జులైలో ఖమేనీ అంత్యక్రియలు
4న అంతిమయాత్ర మొదలు..
9న ఖననం టెహ్రాన్ : ఇరాన్ మాజీ సుప్రీం నేత అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియను జులైలో నిర్వహించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. నెలల తరబడి పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ముగించడానికి ఒప్పందానికి చేరువయ్యామని మధ్యవర్తులు తెలియచేసిన నేపథ్యంలో ఈ వార్త వెలువడింది. అంత్యక్రియలు, ఖననం, వీడ్కోలు కార్యక్రమాలు జులై 4 నుండి 9 మధ్య చేపట్టనున్నట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఇరిబ్ తెలిపింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించిన తొలి రోజే ఖమేనీ మరణించారు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ సుప్రీం నేతగా ఎన్నికయ్యారు. అంత్యక్రియల కార్యక్రమాలు టెహ్రాన్‌లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. పలువురు షియా మత పండితులకు స్థావరమైన క్వామ్‌కు అంతిమయాత్ర వుంటుంది. అక్కడ నుండి ఖమేనీ జన్మస్థలమైన మషాద్‌కు తీసుకెళతారు. అక్కడ ఇమామ్ రెజా ఆరాధనా స్థలంలో ఆయనను ఖననం చేస్తారు. ఈ ప్రాంతం షియాలకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఖమేనీ కుమార్తె, అల్లుడు అంత్యక్రియలు కడా అదే రోజు అక్కడ నిర్వహిస్తారు. 1989లో ఆయతుల్లా రుహల్లా ఖొమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన ఖమేనీ ఇరాన్‌ను పునర్నిర్మించారు. చాలా ధృఢమైన, ప్రజల్లో ఆదరాభిమానాలు కలిగిన సిద్ధాంతవేత్త అయిన ఖమేనీ షా పాలనను అంతమొందించి, షియా ముస్లిం మత పెద్దల పాలనను నెలకొల్పారు.









కామెంట్‌లు (0)