తెలంగాణ : మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ కంటే ఇతర నగరాలు ముందున్నాయని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి దశలో రూ.15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ వ్యయం రూ.22 వేల కోట్లకు పెరిగిందన్నారు. కెసిఆర్ పాలనలో ప్రజలు ప్రయాణించాల్సిన ప్రాంతాల్లో మెట్రో విస్తరణ జరగలేదని విమర్శించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెకండ్ ఫేజ్‌లో మెట్రో విస్తరణ అనుమతి కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. అయితే, ఏడాదికి రూ.400 కోట్ల నష్టం వస్తుందని ఎల్‌అండ్‌టీ చెప్పిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల మెట్రో విస్తరణకు ఆ సంస్థ ఒప్పుకోవట్లేదని వివరించారు. ‘‘రూ.30వేల కోట్ల ఎల్‌అండ్‌టీ ఆస్తుల్ని రూ.15వేల కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎల్‌అండ్‌టీకి రూ.13,600 కోట్ల అప్పు ఉంది. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి ఎల్‌అండ్‌టీకి రూ.13,600 కోట్ల రుణాలు ఇప్పించాం. ఆ మొత్తానికి 4 శాతం వడ్డీగా రుణం ఇప్పించాం. రేవంత్‌రెడ్డిని తేలికగా పని చేయిస్తే.. తెలంగాణలో బిజెపి కి ఇబ్బందులు వస్తాయని సహచర కేంద్రమంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్‌కు కిషన్‌రెడ్డి చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా.. లోన్ డబ్బులు ఎల్‌అండ్‌టీకి ట్రాన్స్‌ఫర్ కాలేదు. ఐఆర్‌ఎఫ్‌సీ లోన్ మంజూరు చేయకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న కిషన్‌రెడ్డికి నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత లేదా ? కెసిఆర్, కెటిఆర్ కలిసి ఆయన మెట్రో ఫేజ్-2ను అడ్డుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి కెసిఆర్ సహకరించినందుకు కిషన్‌రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారు. అహ్మదాబాద్, విశాఖ మెట్రోలకు అనుమతులిచ్చి హైదరాబాద్‌కు ఆపారు. తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగిస్తోంది. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వద్దే మెట్రో ఫేజ్-2 ఆగింది. హైదరాబాద్‌కు 2023లోనే ట్రిపుల్ ఆర్‌ను కేంద్రం ప్రకటించింది. అది ఇంకా సాకారం కాలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడి హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు. అన్నింటికీ బాధ్యత వహిస్తూ మోడి రాజీనామా చేస్తే.. మేమూ చేస్తాం’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మెట్రో రైలు నిర్మాణంలో ఇతర నగరాలు ముందున్నాయి : సిఎం రేవంత్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 15, 2026, 04:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)