mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొనసాగుతున్న దీర్ఘకాలిక శరణార్థుల సంక్షోభం : యు ఎన్ హెచ్ సి ఆర్

11 జూన్, 2026

UNHCR says fewer people displaced worldwide in 2025
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 12:54 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం


జెనీవా : ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు మరియు హింసల కారణంగా నిరాశ్రయులైన ప్రజల సంఖ్య దశాబ్ద కాలంలో 2025లో మొదటిసారిగా తగ్గినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (యుఎన్ హెచ్ సి ఆర్ ) గురువారం విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. అయితే, దీర్ఘకాలికంగా నిరాశ్రయతను ఎదుర్కొంటున్న శరణార్థుల స్థాయిలు మాత్రం ఇప్పటికీ ఆమోదయోగ్యం కాని రీతిలో అత్యధికంగానే ఉన్నాయని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది సుమారు 54 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి పారిపోగా, ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు, శరణార్థుల వంటి పరిస్థితులలో ఉన్న వారి మొత్తం సంఖ్య 4.16 కోట్లకు చేరింది. వీరిలో దాదాపు 60 లక్షల మంది పాలస్తీనా శరణార్థులే ఉన్నారని యుఎన్ హెచ్ సి ఆర్ పేర్కొంది. మరోవైపు,గతేడాదితో పోలిస్తే తమ సొంత ఇళ్లకు తిరిగి వచ్చిన శరణార్థులు, అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన ప్రజల సంఖ్యలో 50శాతం పెరుగుదల నమోదైంది. సుమారు 14.7 మిలియన్ల మంది తమ స్వస్థలాలకు చేరుకోగా, ఇది 1965 నుండి నమోదైన రెండవ అత్యధిక సంఖ్య కావడం గమనార్హం.


సొంత ఇళ్లకు చేరుకున్న వారిలో అత్యధికులు ప్రధానంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సూడాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్, మయన్మార్ వంటి ఆరు దేశాలకు చెందినవారని నివేదిక వెల్లడించింది. స్వస్థలాలకు తిరిగి వచ్చినప్పటికీ శరణార్థుల జీవితాలు సాఫీగా సాగడం లేదని నివేదిక స్పష్టం చేసింది. ప్రాథమిక సేవలకు పరిమిత ప్రాప్యత, మౌలిక సదుపాయాలకు విస్తృత నష్టం, కొనసాగుతున్న అభద్రత వంటి క్లిష్ట పరిస్థితుల మధ్య చాలా మంది తమ సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చారని తెలిపింది. తిరిగి వచ్చినప్పటికీ వారి సుస్థిరత, భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోందని ప్రకటించింది. ముఖ్యంగా 2025లో సుమారు 2.9 మిలియన్ల ఆఫ్ఘన్లు తిరిగి రాగా, వారిలో 1.9 మిలియన్ల మంది శరణార్థులు ఉన్నారు. ఇది గత సంవత్సరం కంటే ఐదు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దశాబ్దానికి పైగా ప్రపంచంలోనే అతిపెద్ద స్థానభ్రంశ సంక్షోభాలలో ఒకటిగా ఉన్న సిరియాలో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. 2024 డిసెంబర్‌లో బషర్ అల్-అసద్ ప్రభుత్వం పతనం కావడంతో, 2025 నాటికి సుమారు 1.3 మిలియన్ల మంది ప్రజలు తిరిగి వచ్చారు. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. దీనివల్ల 2025 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిరియా శరణార్థుల జనాభా 6 మిలియన్ల నుండి 4.9 మిలియన్లకు తగ్గింది. అయినప్పటికీ, తిరిగి వచ్చిన వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, పరిమిత సేవలు.దేశంలోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న హింస వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం 2026లో ప్రపంచవ్యాప్త వలసల ధోరణులను తీవ్రంగా ప్రభావితం చేసిందని నివేదిక హెచ్చరించింది. ఫిబ్రవరి చివరిలో అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల తర్వాత ఇరాన్‌లో సుమారు 32 లక్షల మంది తాత్కాలికంగా నిరాశ్రయులయ్యారని, అదే సమయంలో మార్చి 2న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు, ఖాళీ చేయాలన్న ఆదేశాల మధ్య సుమారు పది లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లవలసి వచ్చిందని యుఎన్ హెచ్ సి ఆర్ తెలిపింది.

శరణార్థుల సంఖ్యను తగ్గించడం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులలో 70శాతం మంది ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా లెబనాన్, జోర్డాన్, టర్కీ, ఇరాన్ వంటి దేశాలలో ప్రవాసంలో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో, ఉద్యోగ కల్పన మరియు విద్యా అవకాశాలకు మద్దతు ఇవ్వడం ద్వారా 2035 నాటికి మానవతా సహాయం అవసరమయ్యే శరణార్థులు, దీర్ఘకాలిక స్థానభ్రంశంలో ఉన్న వారి సంఖ్యను సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యుఎన్ హెచ్ సి ఆర్ పేర్కొంది. ముఖ్యంగా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న అల్ప మరియు మధ్య-ఆదాయ దేశాలలో ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. “ఆశ్రయం, భద్రత అనేవి ప్రాణాలను కాపాడేవి, వాటిపై ఎలాంటి చర్చకు తావులేదు. కానీ, లక్షలాది శరణార్థులు తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి వాస్తవిక అవకాశాలు లేకుండా సంవత్సరాలు లేదా దశాబ్దాల పాటు చిక్కుకుపోయి ఉండే భవిష్యత్తును మనం అంగీకరించలేము,” అని యుఎన్ హెచ్ సి ఆర్ హై కమిషనర్ బర్హమ్ సాలిహ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా శరణార్థులు స్వచ్ఛందంగా తిరిగి వెళ్ళడాన్ని ప్రోత్సహించడంతో పాటు, వారు ఆతిథ్య దేశాలలో విద్య, ఉపాధిని పొందేందుకు వీలు కల్పించనున్నారు. తద్వారా వారు ఆర్థికంగా తమకు తాము ఆర్థికంగా అండగా ఉండి, ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్